అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టింది లేదు. కనీసం ఉపాధ్యక్ష పదవి దాకా వెళ్లినవారు కూడా లేరు. కానీ ఓ భారతీయ మూలాలున్న నల్లజాతీయురాలు కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవి రేసులో విజయకేతనం ఎగుర వేశారు. మన దేశం కోసం.. మన పిల్లల కోసం అంటూ ఆమె సాగించిన ఎన్నికల ప్రచారానికి అమెరికా ఎన్నికల ప్రచారంలో అనూహ్య స్పందన వచ్చింది. ప్రజల కోసం ( ఫర్ ద పీపుల్ ) అంటూ కమలా హారిస్ ఇచ్చిన ఒక్కపిలుపే ప్రభంజనమైంది. డెమోక్రాట్లను ఒంటి చేత్తో గెలిపించడంలోనూ కమలా హారిస్ కీలక పాత్ర పోషించి ఓ భారతీయ మహిళ ప్రపంచంలో ఎవరికీ తీసిపోదని మరోసారి నిరూపించారు.
మనవారే..
కమలా హారిస్ తాత పీవీ గోపాలన్ తమిళనాడులోని తులసేంద్రపురంలో జన్మించారు. పీవీ గోపాలన్ కుటుంబం స్వతంత్ర సమరయోధులకు పట్టినిల్లు. గోపాలన్ కూడా స్వతంత్ర సమరయోధుడే. స్వతంత్ర్యం వచ్చిన కొత్తలో భారత ప్రభుత్వంలో ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగిగా కూడా గోపాలన్ సేవలు అందించారు. దీంతో ఢిల్లీలో చాలాకాలం వారి కుటుంబం నివాసం ఉంది. పీవీ గోపాలన్ కుమార్తె శ్యామలా గోపాలన్ అమెరికాలో ఉన్నత విద్య చదువుకునేందుకు అవకావం దక్కించుకున్నారు. తండ్రి తను సంపాదించిన కొద్ది మొత్తాన్ని కూతురి కల నెరవేర్చేందుకు ఖర్చు చేశారట. అలా 1960లోనే శ్యామలా గోపాలన్ కాలిఫోర్నియా యూనివర్శిటీలో న్యూట్రిషన్, ఎండోక్రినాలజీ చదువుకోవడానికి అమెరికా చేరుకున్నారు. అక్కడే జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్ పరిచయం అయ్యారు. ఆ పరిచయం పెళ్లికి దారి తీసింది. వీరికి పుట్టిన గారాలపట్టి కమలా హారిస్. 1964 అక్టోబర్ 20 జన్మించిన కమలా హారిస్ మొదటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో కమలా హారిస్ తల్లి సంరక్షణలోనే పెరిగారు. అమెరికాలో నల్లజాతీయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తట్టుకునేలా తల్లి శ్యామలా గోపాలన్ కూతుర్ని తీర్చిదిద్దింది. ఆమెలో అప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు అలవడ్డాయి. కమలా హారిస్ చిన్నతనంలో తాత పీవీ గోపాలన్ ఇంటికి తరచూ చెన్నై వస్తూ ఉండేవారు. దీంతో కమలా హారిస్‌పై తాత ప్రభావం బాగా పడింది.
పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప..
తల్లి శ్యామలా గోపాలన్ గుణాలను కమలా హారిస్ పుణికిపుచ్చుకున్నారు. జాతి వివక్షపై ధిక్కార స్వరం, వలసవాదులపై ఉదారవాదం, చట్టసభల్లో ప్రశ్నించే తత్వం, అద్భుతమైన నాయకత్వ లక్షణాలను కమలా సొంతం చేసుకున్నారు. తన సహచర లాయర్ డగ్లస్‌ను కమలా హారిస్ వివాహం చేసుకున్నారు. అప్పటికే డగ్లస్‌కు మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. వారిని సొంత పిల్లల్లా కమలా హారిస్ పెంచుకుంటున్నారు.
సత్తా చాటుకున్నారు..
న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి డిస్టిక్ అటార్నీగా, రాష్ట్ర అటార్నీ జనరల్‌గా కమలా హారిస్ తన సత్తా చాటారు. అద్భుతమైన వాక్ఫటిమతో లాయర్ గానూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 2016లో డెమోక్రటిక్ పార్టీ నుంచి సెనేట్‌కి ఎన్నికై జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కమలా హారిస్, తొలుత అమెరికా అధ్యక్షురాలు కావాలని కలలు కన్నారు. అయితే జో బైడెన్‌తో పోటీ పడి చివర్లో రేసు నుంచి తప్పుకున్నారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో జో బైడెన్ కు మద్దతుగా నిలిచి అమెరికా ఉపాధ్యక్ష పదవి చేజిక్కించుకున్నారు కమలా హారిస్.
భావితరాలకు స్ఫూర్తి .. కమలా హారిస్ జీవితం
సెనేటర్‌గా కమలా హారిస్ నాయకత్వ లక్షణాలు ఆమెరికా ప్రజలకు పరిచయమే. అమెరికా ఎన్నికల్లో డెమోక్రాట్లను గెలింపించుకోవడంలో ఆమె చూపిన తెగువ, నాయకత్వ లక్షణాలు ప్రపంచానికి కూడా తెలసి వచ్చాయి. ఇంటెలిజెన్స్, న్యాయ విభాగాల్లో మంచి పట్టున్న కమలా హారిస్ అమెరికా రాజకీయాల్లోనే కాదు ప్రపంచంలో మానవ హక్కులను కాపాడుతూ, అణగారిన వర్గాలకు ఆమె అండగా నిలుస్తారనడంలో సందేహం లేదు.