గతంలో ఆగిపోయిన సినిమాల్ని ఏటీటీలో విడుదల చేసుకొనేందుకు చక్కటి మార్గం చూపించారు నందమూరి బాలయ్య. విజయదశమి కానుకగా ఈ నెల 24న శ్రేయాస్ ఈటీలో ‘నర్తనశాల’ పౌరాణిక చిత్రం కేవలం 17 నిమిషాల నిడివితోనే విడుదలైంది. పూర్తి సినిమా లేనందుకు అభిమానులు ఫీలయినా.. బాలకృష్ణ టేకింగ్ కు, ఆయన డైలాగ్స్ కు మాత్రం ఫిదా అయ్యారు. ఈ సినిమాకి కలెక్షన్స్ రూపంలో వచ్చిన మొత్తాన్ని బసవతారకం చారిటబుల్ ట్రస్ట్ కు అందించిన సంగతి తెలిసిందే.
ఇక గతంలో బాలయ్య నటించగా ఆగిపోయిన మరో సినిమాను కూడా ‘నర్తనశాల’ తరహాలోనే ఏటీటీలో విడుదల చేయాలని నందమూరి అభిమానులు డిమాండ్ చేస్తున్నారట. సినిమా పేరు ‘విక్రమ సింహ భూపతి’. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ జానపద చిత్రంలో బాలయ్య తండ్రీ కొడుకులు గా ద్విపాత్రాభినయం చేశారు.
సినిమా అప్పట్లో భారీ స్థాయిలో మొదలైంది. కొన్ని ముఖ్యమైన సీన్స్ కూడా చిత్రీకరణ జరుపుకున్నాయి. పూజా భాత్రా, అంజలా ఝవేరీ కథానాయికలు గానూ నటించారు. త్రిపురనేని మహారథి కథ అందించిన ఈసినిమా భారీ బడ్జెట్ కారణంగా అప్పట్లో ఆగిపోయింది. ఈ సినిమాలోని సీన్స్ నర్తన శాల లో కన్నా కాస్తంత ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు. మరి బాలయ్య ఈ జానపద సినిమా గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.











