అమరావతికి అన్యాయం :: ఎవరి ద్రోహం ఎంత? – 1
(అమరావతి నుంచి లియో న్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
అమరావతి ఏపీ రాజధాని. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన చేయకముందు వరకూ ఏపీకి అమరావతే రాజధాని. నేడు ఏపీ రాజధాని ఏది అంటే ఎవ్వరూ చెప్పలేరు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఏపీ రాజధాని లేకుండా తలలేని మొడెంలా తయారైంది. అందుకే ఏపీకి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విస్తృతంగా ప్రచారం చేశారు.
ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలంటే నాకున్న 35 సంవత్సరాల అనుభవం ఉపయోగపడుతుందని, పిల్ల కాంగ్రెస్ (వైసీపీ) వారి వల్ల కాదని ప్రచారం చేసి ఎన్నిల్లో నెగ్గారు. ఊహించిన విధంగానే రాష్ట్రం నడిబొడ్డులో ఉన్న అమరావతిలో రాజధాని పెట్టాలని నిర్ణయించారు. రెండు నియోజకవర్గాల్లోని 29 గ్రామల రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమి సేకరించారు. ఒక్క రూపాయి రైతులకు చెల్లించకుండా, అభివృద్ధి చేసిన భూమి నాలుగో వంతు వారికి ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. రైతులు కూడా తమ బతుకులు మారతాయని భావించారు.
అప్పటి వరకూ వారికి వ్యవసాయం బాగానే ఉన్నా తమ భూముల్లో రాజధాని వస్తే తమ పిల్లల జీవితాలు మారతాయని వారు ఆశపడ్డారు. 2019 వరకు వారి ఆశలు సజీవంగానే ఉన్నాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలోనే భూమి మొత్తం ఫ్లాంట్లు వేసి 90 శాతం మంది రైతుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఆ భూములను మాత్రం అభివృద్ధి చేయలేకపోయారు. రైతులకు ఇచ్చిన భూముల్లో కేవలం వెంచర్ లైనింగ్ వేశారు. కానీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు. సచివాలయం, హైకోర్టు భవనం, అధికారుల క్వార్టర్లు, సీడ్ యాక్సస్ రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.10000 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.46000 కోట్ల పనులు అప్పగించారు.
అప్పట్లో ప్రభుత్వాధినేతగా చంద్రబాబునాయుడు కనీసం కొంత మేర పనులైనా నూరువాతం పూర్తి చేసి ఉంటే.. ఇప్పుడిలాంటి పరిస్థితి వచ్చేది కాదని వాదించే తటస్థ వాదులు కొందరున్నారు. వెలగపూడిలో సెక్రటేరియేట్ భవనం పూర్తయింది. కానీ.. దానిని ‘తాత్కాలిక’ అని ప్రకటించకుండా ఉంటే.. కొంతలో కొంత పరిస్థితి ఇంకోరకంగా ఉండేది. ‘కొన్నయినా పూర్తిచేయకపోవడం’ అనే చంద్రబాబు తప్పిదం కొంత ఉంది. కానీ.. కొత్త నగరాన్ని నిర్మించే ప్రయత్నంలో ఆరంభంలోనే ఎక్కువ ఆలస్యం అవుతుంది. క్వార్టర్ల భవనాలు దాదాపుగా పూర్తయ్యే దశకు వస్తూ.. అనేక కలల నిర్మాణాలకు పనులు ప్రారంభం అయ్యేవరకు ఆయన పాలన కాలం నడిచింది. అంతో అధికారం మారడంతో ఆయన అచేతనులయ్యారు. అమరావతి రాత మొత్తం సమూలంగా మారిపోయింది.
అంతలో 2019 ఎన్నికలు వచ్చాయి. టీడీపీ అధికారం కోల్పోయింది. అంతే రైతుల్లో ఆందోళన మొదలైంది. చివరకు అనుమానించిందే జరిగింది. అసెంబ్లీ సాక్షి గా అమరావతి రాజధానికి అంగీకరించిన ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి , అదే అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేశారు. దీంతో అమరావతి రైతుల ఆశలు అడియాసలు అయ్యాయి. నాటి నుంచి ప్రారంభమైంది అమరావతి ఉధ్యమం. నేటికి 256 రోజులకు చేరుకుంది. అయినా ప్రభుత్వంలో చలనం రాలేదు.
రాజధానికి జరిగిన ద్రోహంలో తెదేపా పాత్ర ఎంత?
రాజధానికి ద్రోహం జరగడం అంటూ నిజమైతే.. అందులో తెలుగుదేశానికి భాగం లేదనడం తప్పు. ఎందుకంటే రాజధాని అనేది 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించినది. అంతేకాని 29 గ్రామల రైతలకు మాత్రమే చెందినది కాదు. అమరావతి రాజధాని ఉధ్యమాన్ని 13 జిల్లాలకు విస్తరించి రాజధానిని కాపాడుకోవాల్సి బాధ్యత టీడీపీకి ప్రధానంగా ఉంది. టీడీపీ అధినేత కూడా రాజధాని ఉద్యమాన్ని అన్ని జిల్లాలకు విస్తరించాలని చూశారు. ఇందులో భాగంగానే రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు నగరాల్లో భిక్షాటన చేశారు. జనం నుంచి మంచి స్పందనే వచ్చింది. రాజధాని ఉధ్యమం ఊపందుకునే సమయంలో కరోనా వైరస్ రావడంతో ఉద్యమాలు ఆపాల్సి వచ్చింది. రాజధాని ఉద్యమానికి కోవిడ్ దెబ్బ బాగానే తగిలింది. ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలు,టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి ఉంది. అయితే సమాజం రెండుగా విడిపోయింది. టీడీపీ, వైసీపీ అనే రెండు ముఠాలు రాజ్యమేలుతున్నాయి. అమరావతి రాజధాని తరలినా ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడరు. పాలన వికేంద్రీకరణ ద్వారా అన్నీ ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయనే స్టీరియో టైప్ సమాధానం చెబుతారు.
బాధ్యత టీడీపీ నేతలకు లేదా?
అమరావతి రాజధానిపై టీడీపీ నేతలు చేయాల్సిన స్థాయిలో ఉద్యమం చేయలేదనే చెప్పాలి. ఏ జిల్లా టీడీపీ నేతలు ఆ జిల్లాలో రాజధానిపై ఉద్యమాలు చేయాలి. కానీ వారు అలా చేయలేదు. ఏదో తూతూ మంత్రంగా అమరావతి రావడం, రైతుల శిబిరాల్లో దూరడం, మీడియాతో మాట్లాడటం, ఇక కనిపించకుండా వెళ్లిపోవడం… ఇదా టీడీపీ నేతలు చేయాల్సింది. అధికారం ఉన్నప్పుడు ఏసీలు అనుభవించిన వారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన బలంగా పోరాడి జైలుకు పోలేరా? వ్యక్తిగత వ్యాపారాలు, సౌకర్యాలు దెబ్బతినకూడదు కానీ మీడియాలో మంచి మైలేజీ రావాలి. ఎలా సాధ్యం అవుతుంది. రాజధానికోసం ఒక్క టీడీపీ నేత అయినా సరైన పోరాటం చేశారా? వారే గుండె మీద చేయివేసుకుని చెప్పాలి. అమరావతి రాజదానికోసం పోరాటాలు చేసి జైలుకు వెళ్లిన టీడీపీ నేత ఒక్కరైనా ఉన్నారా? మరి అలాంటప్పుడు టీడీపీ నేతలు అమరావతి రైతులను మోసం చేరసినట్టు కాదా? ప్రభుత్వం మారితే రాజధాని మారుతుందని తెలిస్తే అమరావతి రైతులు రాజధానికి మీ మొహాలు చూసి భూములు ఇచ్చేవారేనా ఒక్కసారి టీడీపీ నేతలు ప్రశ్నించుకోవాలి. కనీసం అమరావతి రాజధాని రైతులకు ఆరు నెలుగా కౌలు, ఫించన్లు చెల్లించకపోయినా నోరు మెదిపిన టీడీపీ నేత లేడు. చివరకు అమరావతి రాజధాని రైతులు వారి పొలం కౌలు, ఫించన్ల కోసం ఉధ్యమం చేసి లాఠీ దెబ్బలు తిన్నారు. మహిళలు సహా జైలు పాలయ్యారు. అమరావతి మహిళలకు ఉన్న తెగింపు ఈ టీడీపీ నేతలకు లేదా అన్ని సామాన్య కార్యకర్తలు సైతం ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా కళ్లు తెరవాలి
టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రైతుల వద్ద నుంచి రాజధాని పేరుతో భూములు తీసుకున్నారు. కాబట్టి రైతుల పక్షాన పోరాడాల్సింది కూడా టీడీపీ నేతలు, ఆ పార్టీ శ్రేణులే. మరి మిగతా వారికి బాధ్యత లేదని కాదు. తెలుగువారి రాజధాని అందరికి అందుబాటులో రాష్ట్రం మధ్యలో ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ అమరావతి ఉద్యమానికి నేనుసైతం అంటూ ముందుకు రావాలి. టీడీపీ నేతలు కరోనా తగ్గినాక అయినా రాజదాని ఉధ్యమానికి ఊపిరిపోసి రాష్ట్ర వ్యాప్తం చేయాలి. 29 గ్రామల్లో 6 సంవత్సరాలుగా పంటలు లేక రైతులు ఇప్పటికే అన్నీ విధాలా నష్టపోయారు. రాజధాని వస్తే వారి జీవితాలు మారతాయనుకున్నారు, కానీ వారి జీవితాలు చీకటిమయం అవుతాయని రైతులు కలలో కూడా ఊహించలేదు. ఇది కేవలం 29 గ్రామాల రైతుల సమస్యే కాదు తెలుగువారి ఆత్మగౌరవ సమస్య. ఒక్క రాజధానికే దిక్కులేకపోతే ఇక మూడు రాజధానులు కట్టేది ఎక్కడ? టీడీపీ నేతలు, తెలుగు ప్రజలు ఇప్పటికైనా అమరావతి రాజధానిని కాపాడుకోవాలి. టీడీపీ నేతలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి… పోరాడితే పోయేది ఏమీ లేదు. బానిస సంకెళ్లు తప్ప.