మంత్రి స్వగ్రామం గుమ్మనూరులో పేకాట దందా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దందాలు అరెస్టు అయిన వారందరికీ కోర్టు రిమాండు విధించింది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామ పేకాట రాయుళ్లకు సెప్టెంబర్ 10 వరకు రిమాండ్ విధించారు. ఈ మేరకు 36 మందిని రిమాండ్ నిమిత్తం జైలుకు పంపుతూ ఆలూరు కోర్టు ఆదేశాలు జారీచేసింది.
వీరిలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం చిన్నాన్న కొడుకు గుమ్మనూరు నారాయణ అనిల్ మరియు సతీష్ లతో పాటు మరో 16 మందిని ఆదోని సబ్ జైలుకు తరలించారు. పత్తికొండ సబ్ జైల్‌కు 15 మందిని, డోన్ సబ్ జైల్‌కు ఇద్దరిని రిమాండ్ నిమిత్తం తరలించారు.
రిమాండ్ కు తరలించిన నిందితుల్లో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి మూడు గంటల సమయం వరకు విచారణ జరిగినట్లు తెలుస్తోంది. గుమ్మనూరు పేకాట స్థావరాని నడుపుతున్న వారు, ఆడిన వారిపైన 341, 332, 427, 304, 120B ఐపిసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులపైన దాడి చేసినందుకు, ఎక్స్చేంజ్ యాక్ట్ కింద కూడా వీరిపై కేసులు నమోదు అయ్యాయి.
పేకాట దందా పట్టుబడింది మంత్రి స్వగ్రామం కావడం, పైగా ఆయన సొంత చిన్నాన్న కొడుకు కూడా అరెస్టు అయిన వారిలో ఉండడంతో.. పోలీసులపై అధికార పార్టీ ఒత్తిడి ఉంటుందేమోనని, కేసు పెట్టకుండా కాపాడతారని కొన్ని పుకార్లు వచ్చాయి. అయితే వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. మంత్రి సోదరుడి సహా అందరినీ రిమాండ్ కు పంపారు.