కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా విషయాన్నే తీసుకోండి. ఎంతటి వారైనా సరే.. జన్ పథ్ లో అమ్మని కలవాలంటే.. సందర్శకులు వచ్చే ద్వారం చాలా పొట్టిగా ఉండటమే కాదు.. అతిధి తల వంచుకొని మాత్రమే లోపలకు ప్రవేశించాలి. అక్కడే.. తానేమిటన్న విషయాన్ని అమ్మ అర్థమయ్యేలా చేస్తుందని చెబుతారు. అలాంటి అమ్మ అపాయింట్ మెంట్ కోసం తన తండ్రి.. తర్వాతి కాలంలో తానెంతగా శ్రమపడింది జగన్ కు తెలియనిది కాదు. చుట్టూ ఉన్న వారు తన వారే అయినప్పటికీ.. తాను సీఎం కావటానికి అమ్మ అడుగులకు మడుగులు వొత్తుతూ తనకు నేర్పిన పాఠాన్ని జగన్ లాంటి అధినేత అంత తేలిగ్గా మర్చిపోతారా?
తాను విజిలేస్తే ప్రభుత్వం పని అయిపోతుందన్న మాట అమలు కాకపోవటం.. రాజకీయ వైరం అనే కారణంతో ఏకంగా జైలుకు తీసుకెళ్లి.. నెలల తరబడి కటకటాల వెనక ఉండేలా చేయటాన్ని యువనేత అస్సలు జీర్ణించుకోలేరని చెబుతారు. మానసికగా తనను బలహీనపర్చటానికి చేస్తున్న ప్రయత్నాల్ని తనకున్న అమేయమైన మొండితనంతో ఢీ కొట్టటం.. భవిష్యత్తు ఎలా ఉంటుందన్న విషయాన్ని విజువలైజ్ చేస్తూ.. తనదైన టైం కోసం ఎదురుచూసిన జగన్.. అనుకున్నవన్నీ జరుగుతున్న వేళ.. పాత విషయాల్ని ఎందుకు మర్చిపోతారు?
అవసరమైన ప్రతి సందర్భంలోనూ తన తండ్రి ప్రస్తావన తీసుకురావటం జగన్ కు అలవాటు. అదే సమయంలో తన తండ్రిలా వ్యవహరించకపోవటం ఆయనదైన మేనరిజం. తండ్రి మాదిరే చేతి చొక్కా పుల్ హ్యాండ్స్ ను కాస్త మడవటం.. చేతికి వాచీ తొడగటం.. తండ్రి మాదిరి కాకున్నా.. అటు ఇటు వంగటం లాంటి ఎన్నో అంశాలు చూసినంతనే వైఎస్ గుర్తుకు తెచ్చే జగన్.. పొద్దుపొద్దున్నే ఐదు గంటలకే పార్టీ నేతలకు టైమిచ్చే అలవాటున్న తన తండ్రి తీరును ఎందుకు పాటించటం లేదన్న సందేహాన్ని కొందరు ప్రస్తావిస్తారు.
ఉదయం ఐదు గంటలకు అపాయింట్‌మెంట్ ఏమిటి? రోజు మొత్తంలో అపాయింట్ మెంట్లే చాలా తక్కువమందికి ఇచ్చే జగన్ తీరును పలువురు తప్పు పడుతుంటారు. కానీ.. తరచి చూస్తే.. అలాంటి తీరుకు కాలం చెల్లిందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంటుంది. ఒకరికి టైమిస్తే.. అది అక్కడితో ఆగదు. అదో తిరనాళ మాదిరి మారుతుంది. అవసరమైన అంశాల కంటే అవసరమైన పంచాయితీలు పెంచటం.. అవి కాస్తా మీడియాకు ఎక్కటం లాంటి అవకాశం ఇవ్వకూడదంటే.. తలుపులు బంద్ చేస్తే సరి. అందుకే అంటారు జగన్ అపాయింట్‌మెంట్ అంటే.. అదో అరుదైన విజయంగా అభివర్ణిస్తారు. అయినా.. విశ్వసనీయుల ద్వారానే సకల వ్యవహారాలు చక్కదిద్దే ట్రెండ్ నడుస్తున్న వేళ.. పాత చింతకాయ పచ్చడి మాదిరి అపాయింట్‌మెంట్ ఇచ్చి మరీ వారు చెప్పేదంతా మోయాల్సిన ఖర్మ జగన్ కు ఏముంటుంది చెప్పండి.