(ఒంగోలు నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో దశాబ్దాలుగా వర్గ, కుల రాజకీయాలదే ఆధిపత్యం. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాను గాలివీచినా పర్చూరులో మాత్రం ఆ పార్టీకి చుక్కెదురైంది. ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర్రావు బరిలోని నిలిచినా.., సైకిల్ ఆడిన వ్యూహంలో చిక్కుకుని పరాజయం పాలయ్యారు. ఓటమి తర్వాత దగ్గుబాటి వైసీపీలో ఉన్నా లేనట్లే కొంతకాలం వ్యవహరించినా.., ప్రస్తుతం ఆయన ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో ప్రస్తుతం అక్కడ ప్యాను పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైంది. పాత, కొత్త నేతల ఆధిపత్య పోరుతో ప్రతి రోజూ ఏదో ఓ వివాదంతో పార్టీ పరువు గంగలో కలుస్తోంది.
దగ్గుబాటి వ్యూహం వెనుక మతలబు ఏంటి..?
సీనియర్ రాజకీయ నాయకుడైన దగ్గుబాటి వెంటకేశ్వర్రావు 2019 ఎన్నికల్లో పోటీ చేయడం అసలు ఇష్టపడలేదు. తన కుమారుడు హితేష్ చెంచురామ్ ని రాజకీయ అరంగేట్రం చేయడానికి ప్రయత్నాలు చేసి…, అమెరికా పౌర సత్వం ఉన్న హితేష్ ఎన్నికల్లో గెలిచినా.. ఆ తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయన్న అనుమానంతో తానే ఎన్నికల బరిలో నిలిచి, అతి తక్కువ ఓట్లతో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుపై పరాజయం పాలయ్యారు.
ఆ తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో బీజేపీలో ఉన్న దగ్గుబాటి పురంధ్రేశ్వరికి ఆ పార్టీ అధిష్టానం పెద్దపీట వేయడంతో.., దగ్గుబాటి సైలెంట్ అయిపోయారు. భవిష్యత్తులో బీజేపీకి రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తు ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. టీడీపీ, వైసీపీ రెండూ బీజేపీతో మిత్రులుగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తుండటం.., తాను వైసీపీలో ఉండి, దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయ భవిష్యత్తుకు అడ్డుకాకూడదని వైసీపీకి దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి బాపట్ల ఎంపీ స్థానం జనరల్‌గా మారితే.., బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దగ్గుబాటి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని ఆయన సన్నిహితులు వాదన.
రావి వర్సెస్ గొట్టిపాటి..!
2014 ఎన్నికల్లో గొట్టిపాటి భరత్ కుమార్ వైసీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. కానీ, ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం, అద్దంకిలో వైసీపీ తరఫున గెలిచిన తన సోదరడు గొట్టిపాటి రవికుమార్.., టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో.., భరత్ పర్చూరులో సైలెంట్ అయిపోయారు. దీంతో వైసీపీ అధిష్టానం రావి రామనాథం బాబును పర్చూరు నియోజకవర్గం ఇంఛార్జిగా నియమించి పార్టీ కార్యక్రమాలను నిర్వహించింది. రావి రామనాథం బాబు ఇంఛార్జి అయినా..? పర్చూరు వైసీపీలో భరత్, రామనాథం వర్గాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికలకు చివరి నిమిషంలో పార్టీ దగ్గుబాటి వెంకటేశ్వర్రావుకు టికెట్ కేటాయించడంతో.., పార్టీపై అలిగిన రామనాథం బాబు టీడీపీలో చేరి.., దగ్గుబాటి ఓటమికి తీవ్రంగా కృషి చేశారు. ఆ తర్వాత ఎన్నికలు ముగిసి ఏడాది కూడా గడవక ముందే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిపోయి ఇప్పుడు నియోజకవర్గ ఇంచార్జి అయిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో వైసీపీలో రావి vs గొట్టిపాటి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. చివరి నిమిషంలో టీడీపీలో చేరి, వైసీపీకి వెన్నుపోటు పొడిచిన రామనాథం బాబు పెత్తనం తమపై ఇప్పుడు ఏంటని భరత్ వర్గం ఆగ్రహంతో ఉంది.
రెండు వర్గాల మధ్య చిచ్చురేపిన వైసీపీ నేత మరణం..!
వైసీపీ జిల్లా కార్యదర్శి అయిన కారంచేడు మండలం కంకణమల్లుకి చెందిన జవ్వా శ్రీనివాసరావు ఇటీవల మరణించారు. ఆయన మృతదేహానికి నివాళులర్పించడానికి ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి రావి రామనాధం బాబు వెళ్లలేదు. మరణించిన వైసీపీ నేత గొట్టిపాటి వర్గం కావడంతోనే.., రామనాథం బాబు నివాళులు అర్పించడానికి కూడా వెళ్లలేదని మృతి చెందిన వైసీపీ సభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ హయాంలో కేసులు ఎదుర్కొని కూడా 8 ఏళ్లు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి వైసీపీ ఇచ్చిన విలువ ఇదా..? అని వారు ఇంచార్జి రామనాథం బాబుపై ఆగ్రహంతో ఉన్నారు.
ఈ ఆగ్రహం చల్లారక ముందే..,
వైసీపీ నేత దశదిన కర్మ రోజున గ్రామంలో జువ్వా శ్రీనివాసరావు అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు. ఈ ఫ్లెక్సీలను ఆయన వ్యతిరేక వర్గీయులు చించివేయడంతో ఈ వివాదం కాస్త ముదిరింది. రామనాధం బాబే ఉద్దేశపూర్వకంగా ఇలా చేయిస్తున్నారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ గ్రామ మహిళలు కొందరు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. పార్టీ పెద్దలు కల్పించుకుని గ్రామస్తులతో మాట్లాడి సర్దిచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. శ్రీనివాసరావు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న సందర్భంలో పార్టీ ఇన్ చార్జి రామనాధం బాబు ఒక్కరే పరామర్శ పేరుతో లోపలకు వెళ్లారని, అక్కడ ఏదో జరిగిందనీ, రామనాధం బాబు కారణంగానే శ్రీనివాసరావు చనిపోయారని ఆ గ్రామ మహిళలు ఆరోపిస్తున్నారు.
మరో వైపు.., ఈయన మరణించిన రోజున పార్టీ ఇన్ చార్జిగా ఉన్న రామనాధం బాబు గ్రామంలో స్వీట్లు పంచారనీ, కొంత మంది నాయకులు పార్టీ చేసుకున్నారనీ ఆరోపణలు, వాదనలు కూడా వస్తుండటంతో ఆ గ్రామం అంతర్గతంగా రగిలిపోతున్నది. పార్టీలో ఎనిమిదేళ్లు చురుగ్గా పని చేసి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇలా పొట్టన పెట్టుకోవడం, మరణానికి కారణం అవ్వడం ఎంత వరకు సబబో పార్టీ పెద్దలు సమాధానం చెప్పాలని ఆ కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
చూడాలి ఈ వివాదం ఇంచార్జి సీటుకు ఎసరుతెస్తుందో.. లేక ఎప్పటిలా టీ కప్ లో తుఫానులా మిగులుతుందో.. వేచి చూడాల్సిందే..!











