ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఈ సీజన్‌ను ఓటమితోనే ప్రారంభించింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా నాశనం చేసుకుంది. సోమవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 10 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. శనివారం జరగబోయే తన రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును ఎదుర్కోబోతోంది.
ఎన్నో అంచనాల మధ్య ఈ సీజన్‌ను ప్రారంభించిన కోల్‌కతా టీమ్‌ది కూడా అదే కథ. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా ఘోర పరాజయం చవిచూసింది. బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ విఫలమై ఏకంగా 49 పరుగుల తేడాతో ఓడిపోయింది. సమష్టి ప్రదర్శన చేయలేక చతికిలపడింది. కనీసం రెండో మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య శనివారం సాయంత్రం 7:30 గంటలకు అబుదాబి క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బలాలు
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు చాలా వరకు మెరుగైన స్థితిలోనే నిలిచింది. బెంగళూరును ఓ మోస్తరు స్కోరుకే కట్టడి చేయగలిగింది. అనంతరం బెయిర్ స్టో, మనీష్ పాండే బ్యాటింగ్ ప్రదర్శనతో సునాయాసంగా గెలిచేలా కనబడింది. అయితే చివర్లో ఒత్తిడికి లోనై పది పరుగుల తేడాతో ఓడిపోయింది. వార్నర్, బెయిర్ స్టో, మనీష్ పాండే, విజయ్ శంకర్, ప్రియం గార్గేతో కూడిన హైదరాబాద్ బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. మిడిలార్డర్ కాస్త బలపడితే హైదరాబాద్‌కు మరింత బలం చేకూరుతుంది. బౌలింగ్ విభాగంలో ఏస్ బౌలర్ భువనేశ్వర్ వికెట్లేమీ తీయలేకపోయినా పరుగులను బాగానే నియంత్రించాడు. మిగిలిన బౌలర్లు కూడా ఎకానమీ విషయంలో ఫర్వాలేదనిపించారు.
బలహీనతలు
డేవిడ్ వార్నర్ ఫామ్‌లో లేకపోవడం హైదరాబాద్‌కు పెద్ద లోటు. అలాగే మిడిలార్డర్ వైఫల్యం కూడా జట్టును బాగా దెబ్బతీస్తోంది. నికార్సయిన ఆల్‌రౌండర్ లేని లోటు తొలి మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. మిడిలార్డర్‌లో అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ ఉండుంటే తొలి మ్యాచ్‌లో కచ్చితంగా హైదరాబాద్ గెలిచి ఉండేది. ప్రముఖ బౌలర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా వైదొలగడం హైదరాబాద్‌కు తీరని లోటు. ఇకపై భారమంతా భువనేశ్వర్ పైనే పడనుంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్ బలాలు
కోల్‌కతా జట్టుకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. ఎనిమిదో స్థానం వరకు కోల్‌కతా బ్యాటింగ్‌లో డెప్త్ ఉంది. వారు టచ్‌లోకి వస్తే ఈ సీజన్‌లో బలమైన జట్లలో ఒకటిగా కోల్‌కతా నిలుస్తుంది. మరోవైపు కోల్‌కతా బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది. తొలి మ్యాచ్‌లో శివమ్ మావి, సునీల్ నరైన్ చక్కగా బౌలింగ్ చేశారు. స్టార్ ఆటగాడు ప్యాట్ కమిన్స్ ఫామ్‌లోకి రావాల్సి ఉంది. తొలి మ్యాచ్ పరాజయం కారణంగా కోల్‌కతాను తక్కువగా అంచనా వేయడానికి లేదు. కోల్‌కతా టీమ్‌లో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. వారు టచ్‌లోకి వస్తే ప్రత్యర్థి జట్టుకు తిప్పలు తప్పవు.
బలహీనతలు
తొలి మ్యాచ్ పరాజయం కోల్‌కతా టీమ్‌లో నిరాశను నింపింది. హిట్‌మ్యాన్ రోహిత్ ధాటికి కోల్‌కతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కమిన్స్ నిరాశపరిచాడు. ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. భారీ పరుగుల లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన కోల్‌కతా ఒత్తిడికి గురైంది. ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. తొలి మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఈ మ్యాచ్‌లోనూ పరాజయం తప్పదు.
మ్యాచ్ ఫేవరెట్
జట్ల బలాబలాలు, ప్రస్తుత ఫామ్ బట్టి చూస్తే సన్‌రైజర్స్ కంటే కోల్‌కతా జట్టే బలంగా కనబడుతోంది. కోల్‌కతా టీమ్‌లో మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉన్నారు. అయితే టీ-20లో ఏమైనా జరగొచ్చు. ఆ మూడు గంటలు ఎవరు బాగా ఆడితే వారే విజేతలు. కాబట్టి హైదరాబాద్ అవకాశాలను కూడా తీసిపారేయలేం. వార్నర్, బెయిర్ స్టో, మనీష్ పాండే వంటి హిట్టర్లు చెలరేగితే కోల్‌కతాకు కష్టాలు తప్పవు.