ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొంది ఆ తరువాత మొఖం చాటేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. గతంలో లాగ ఎన్నికలు వచ్చినప్పుడు కనిపించి ఏవో కల్లబొల్లి కబుర్లు నాలుగుచెప్పి, ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తరువాత మరో ఐదేళ్ల వరకు ఆ పల్లెల వంక కన్నెత్తి చూడకపోయినా పర్వాలేదనుకుంటున్నారా? అటువంటి పప్పులు ఇకపై ఉడకవని గుర్తించండి.
మేం ఎమ్మెల్యేలం, ఎంపీలం, ప్రజాప్రతినిధులం, మమ్మల్నెవడు ఏమంటాడని, మీ పనుల్లో మీరు పడుతున్నారా?, అందులో అధికార పార్టీలో ఉన్నాం, మనం ఆడిందే ఆట, పాడిందే పాట అనుకుంటున్నారా? అలా అయితే మీరు ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమని గుర్తించండి. ప్రజలు , ముఖ్యంగా ఓటర్లు చైతన్యవంతులయ్యారు.
మీరు చెప్పే మాటలు వినేందుకు, మీరు చేసే హూంకరింపులకు బయపడే స్థితిలో లేరు. ప్రస్తుతం ప్రతి ఇంటా, ఇంచుమించు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. సోషల్ మీడియా విస్తృతి బాగా పెరిగింది. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. అమెరికా అధ్యక్షుడు నుండి మన గ్రామ సర్పంచ్ వరకు ఎవరు ఏమి చేస్తున్నారో , ఏమి చేయ్యాలో , అలా చేయకపోతే జరిగే పరిణామం ఏంటో మారుమూల పల్లె ‘నెట్టింటిలో’ కూడా చర్చలు, వాదోపవాదాలు జరుగుతున్నాయి. తప్పొప్పులను అక్కడే తేల్చేస్తున్నారు. సాలూరు కొండల్లో రోడ్డు వేస్తే ముంబైలో ఉన్న సోన్సూద్ కు క్షణాల్లో తెలుస్తోంది. చైనా బోర్డర్లో గలాటా జరిగితే శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరులో చర్చ జరుగుతోంది. ఇదంతా ఎందుకు చెపుతున్నామంటే ‘ప్రజాప్రతినిధులారా అప్రమత్తంగా ఉండండి , అశ్రద్ధ వహించారో అభాసు పాలుకాక తప్పదు’. అటువంటి సంఘటనే విజయనగరం జిల్లా సాలూరు ఎస్టీ రిజర్వుడు స్థానం నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు ఒక కుగ్రామంలో ఎదురైంది.
గిరిజన ప్రాంత పల్లెల్లో ఎమ్మెల్యేకు ఎదురైన పరిస్థితి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది
బిత్తరపోయిన ఎమ్మెల్యే రాజన్నదొర
విజయనగరం జిల్లా సాలూరు వైసీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు ఆయన నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురవ్వడంతో బిత్తరపోయారు. అదే నియోజకర్గం నుండి ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన రాజన్న తన పరిధిలోని చీపురువలస గ్రామం మీదుగా ప్రయాణిస్తుండగా ఆ గ్రామస్తులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ ప్రాంతానికి ఒక్కసారి కూడా రాలేదంటూ నిరసన వ్యక్తం చేశారు.
తమ గ్రామానికి మౌలిక వసతులు, రోడ్డు సౌకర్యం కల్పిచాలంటూ ఎమ్మెల్యే రాజన్నదొరకు సౌమ్యంగా విన్నవించారు. గ్రామస్థులంతా గుమిగూడి తమ సమస్యలు ఏకరువు పెట్టడంతో ఎమ్మెల్యే రాజన్న దొర సహనం కోల్పోయారు. ఆవేశంతో ఊగిపోయారు. ‘ఇక మీ గ్రామానికి ఎప్పుడూ రాను, నేను రాకపోతే మీరే ఇబ్బంది పడతారు’ అని హూంకరించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు తమ నిరసన ఉధృతం చేసారు. ఎమ్మెల్యే రాజన్న దొర వాహనాలను కదలకుండా రోడ్డుపై ధర్నా చేశారు. ఆ గ్రామ యువకులు మరో ముందడుగు వేసి ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ రోడ్డుపై మంటలు వేసి ఎమ్మెల్యే వాహనాలు ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఆ గ్రామస్తులను బ్రతిమాలి , బుజ్జగించి, ఆ గ్రామానికి రోడ్డు వేయిస్తానని హామీ ఇవ్వడంతో శాంతించారు.
ఇదండి కథ..! ఇకనైనా ప్రజాప్రతినిధులారా మేల్కొనండి.











