అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బెంగాల్ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దివంగత మాజీ ప్రధాని వాజ్ పేయ క్యాబినెట్లో ఆర్థిక, విదేశాంగ శాఖా మంత్రిగా యశ్వంత్ సిన్హా కీలకంగా వ్యవహరించారు. బీజేపీలో ఉన్నప్పుడే ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేసిన సిన్హా 2018లోనే బీజేపీలో నుంచి బయటకు వచ్చారు. కొంతకాలంగా బీజేపీపై సిన్హా తీవ్ర విమర్శలు చేస్తూ దూకుడు పెంచారు. చాలా మంది తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నవేళ యశ్వంత్ సిన్హా టీఎంసీలో చేరడం మమతకు ఊరట నిచ్చిందనే చెప్పవచ్చు.
మోదీ పాలనకు, వాజ్‌పేయి పాలనకు ఎంతో వ్యత్యాసంః
ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ప్రజాస్వామ్య బలం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉందని, అయితే ప్రస్తుతం వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన అనంతరం యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. నాలుగు నెలలుగా ఢిల్లీ వీధుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు, సరిహద్దుల్లో చైనా దూకుడును కూడా సిన్హా ప్రస్తావించారు. అంతేకాదు, నరేంద్ర మోదీ పాలనకు, మాజీ ప్రధాని వాజ్‌పేయి పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఆపడానికి ఎవరూ లేరు. వాజ్‌పేయి కాలంలో బీజేపీ ఏకాభిప్రాయాన్ని నమ్మింది.. కాని నేటి ప్రభుత్వం అణిచివేత, బలప్రయోగంతో జయించాలని చూస్తోందన్నారు. ఇకపై ఎన్నికల కమిషన్ కూడా తటస్థ సంస్థగా ఉండబోదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990లో మాజీ ప్రధాని చంద్రశేఖర్ క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా, వాజ్ పేయ క్యాబినెట్ లోనూ కీలక పదవుల్లో చేశారు. యశ్వంత్ సిన్హా తనయుడు జయంత్ సిన్హా 2014 నుంచి 2019 వరకూ కేంద్ర పౌర విమానయాన సహాయ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచినా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు.
Must Read ;- బెంగాల్‌లో రోజుకోతీరున రాజకీయం.. జైశ్రీరాం vs హరే కృష్ణ, ఓవైసీ Vs ఉర్దూ