వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో ఎలాంటి పరిస్థితులు రాజ్యమేలాయో ఇప్పటికే లెక్కలేనన్ని సార్లు చెప్పుకున్నాం. అయినా కూడా మళ్లీ మళ్లీ వాటిని గుర్తు చేసుకోక తప్పని పరిస్థితులు దాపురించాయి. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు జగన్ ప్రాధాన్యం ఇస్తే… అందుకు సహకరించిన అధికారులకు తాయిలాలు ఇచ్చిన జగన్… సర్కారీ ధనాన్ని దర్జాగా దోచుకునేందుకు వారికి అవకాశం కల్పించారు. ఇదే అదనుగా జగన్ చెప్పిన పని చేసిన అధికారులంతా తమ పరిధిలోని శాఖలకు చెందిన నిధులను తమ జేబుల్లో వేసుకుని ఎంచక్కా ఇతర పోస్టుల్లోకి మారిపోయారు. ప్రజాధనం కదా… దానిని అక్రమంగా బొక్కేసి తప్పిచుకుందాంటే కుదరదు. అందుకే కాబోలు… అలా ప్రజాధనాన్ని అప్పనంగా జేబుల్లో వేసుకున్న మరో సీనియర్ ఐపీఎస్ అధికారి అడ్డంగా బుక్కయిపోయారు. ఆ అధికారి మరెవరో కాదు… జగన్ జమానాలో సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన పీవీ సునీల్ కుమార్.
నాడు వైసీపీ నేతగా, నరసాపురం ఎంపీగా కొనసాగిన ప్రస్తుత ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును అదుపులోకి తీసుకున్న సీఐడీ… తన కస్టడీలో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రఘురామనే ఆ మరునాడు కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై రఘురామ ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం లేకపోగా… తాజాగా కూటమి సర్కారు అధికారం చేపట్టాక దీనిపై విచారణ జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా పలు విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. సునీల్ కు సన్నిహితంగా వ్యవరించిన తులసిబాబు అనే ఓ భారీకాయుడిని సీఐడీ కార్యాలయానికి పిలిపిచి… ఆయనను రఘురామ గుండెలప కూర్చోబెట్టి రఘురామను అంతమొందించేందుకు ఓ భారీ కుట్రే జరిగింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో తులసిబాబును విచారించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇలా సునీల్ పిలవంగానే… అలా సీఐడీ ఆఫీస్ కు వచ్చి వారు చెప్పినట్లుగా రఘురామ గుండెలపై కూర్చున్నందుకు తులసిబాబుకు మంచి గిఫ్టే దక్కింది.
సీఐడీ చీఫ్ గా వ్యవహరిస్తూనే సునీల్ కుమార్… కొంతకాలం పాటు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కు చైర్మన్ గానూ వ్యవహరించారు. చెపం్పిన పని చేసినందుకు తాయిలం తీసుకునేందుకే సునీల్ కు జగన్ సర్కారు ఈ పోస్టును కట్టబెట్టిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పోస్టును అడ్డం పెట్టుకున్న సునీల్… కార్పొరేషన్ కు డ్యాష్ బోర్డు రూపకల్పన, దాని నిర్వహణ పేరిట టెండర్లు పిలిచి… నిబంధనలను తోసిరాజని తులసిబాబుకు చెందిన కంపెనీకి ఏకంగా రూ.3.06 కోట్లను కట్టబెట్టారట. ఏకమొత్తంగా ఒకేసారి ఇంత మొత్తాన్ని చెల్లించేశారట. తీరా ఆ డ్యాష్ బోర్డును రూపొందించారా? అంటే… అదీ లేదు. డ్యాష్ బోర్డు లేదు. లేని డ్యాష్ బోర్డుకు నిర్వహణ అన్న మాటే లేదు. అంటే పేరుకే టెండర్లు అంటూ యాక్ట్ చేసిన సునీల్.. గుట్టుచప్పుడు కాకుండా రూ.3.06 కోట్లను తన అనుయాయుడికి ముట్టజెప్పారన్న మాట. ఈ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి రాగా… సునీల్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పని స్థితిలో పడిపోయారు.