కేంద్ర హోం శాఖ మంత్రి హోదాలో బీజేపీ కీలక నేత అమిత్ షా…మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలి సారిగా ఏపీ పర్యటనకు వచ్చారు. 2014 ఎన్నికల తర్వాత తిరిగి టీడీపీ, జనసేనలతో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ 2024 ఎన్నికల్లో ఏపీలో 8 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఏపీలో ఇన్నేసి సీట్లను ఆ పార్టీ గెలిచిన దాఖలా గతంలో లేదు. దీంతో కూటమిపై బీజేపీ నేతలకు ప్రత్యేక గౌరవం ఏర్పడింది. ఇక ఏపీకి అమిత్ షా రావడానికి ఒక్క రోజు ముందు విశాఖ ఉక్కుకు కేంద్రం భారీ రివైవల్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీపై హర్షం వ్యక్తం చేసిన కూటమి… అమిత్ షాకు భారీ ఎత్తున స్వాగతం పలికింది. మొత్తంగా ఇతరత్రా అంశాలు అస్సలు గుర్తుకు రానంతగా బీజేపీ, టీడీపీ, జనసేనల హోరు వినిపించాల్సిన చోట… అనూహ్యంగా అమిత్ షా నోట వైసీపీ పాలన, జగన్ పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అంటే…ఎంత సంతోషంలో ఉన్నా కూడా జగన్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని మరిచిపోవడం కష్టమన్న మాట.
2019 నుండి 24 వరకు ఏపీలో విధ్వంసం జరిగిందని, అంతకుముందు చంద్రబాబు సర్కార్ చేసిన పునాదులను ధ్వంసం చేసి, రాష్ట్రాన్ని నిలువునా నాశనం చేశారని విరుచుకుపడ్డారు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.. జగన్ తన ఐదేళ్ల పాలనలో ఏపీని విధ్వంసం చేశారు. రాజధాని అమరావతి పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. మూడు రాజధానులు అంటూ జనాన్ని అయోమయానికి గురి చేశారు. అంతేనా… 70 శాతం నిర్మాణం పూర్తి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికి వదిలేసి… ప్రాజెక్టు ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చాివేశారు. ఇక శాంతి భద్రతల విషయానికి వస్తే… తనకు నచ్చని వారిని, విపక్షాలకు చెందిన వారిపై ఇష్టారాజ్యంగా కేసులు నమోదుచేసి హింసిచారు. 15 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడునే ఆదారాలు లేకుండానే కేసు నమోదు చేసి జైలుపాలు చేశారు. వెరసి ఐదేళ్ల పాటు ఏపీలో జగన్ తన రాక్షస పాలనను సాగించారు. ఈ పాలన గుర్తుకు వచ్చిందంటే… ఎవరైనా ఇట్టే వణికిపోవాల్సిందే.
అమిత్ షా విషయంలోనూ అదే జరిగింది. అటు టీడీపీ నేతలతోపాటుగా ఇటు బీజేపీ నేతలను కూడా జగన్ తన పాలనలో వేధింపులకు గురి చేశారు. ఈ విషయాలన్నీ ఏపీ నేతల నుంచి తెలుసుకున్న అమిత్ షా… ఆదివారం నాటి ఎన్డీఆర్ఎఫ్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుని జగన్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీలో విధ్వంసం రాజ్యమేలిందని అమిత్ షా అన్నారు. అయినా కూడా ఏపీ ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, తాము ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. సభా వేదిక మీద నుంచి అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అమిత్ షా నోట ఇలా జగన్ విధ్వంస పాలన గురించి విన్నంతనే… ఏపీలో ఈ తరహా పాలన సాగిందా అన్న దిశగా జాతీయ మీడియా విస్మయానికి గురైంది.
అమిత్ షా… అంత ఈజీగా రాజకీయ వ్యాఖ్యలు చేయరు.. ఆయన నోట వెంట ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయంటే జగన్‌కి త్వరలోనే డేంజర్ బెల్స్ మోగడం ఖాయం అని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.. అంతేకాదు, జగన్ ప్యాలెస్‌లపై అమిత్ షా ఆరా తీసిన గంటల వ్యవధిలోనే ఈ కామెంట్స్ రావడం వెనక ఊహించని ఈక్వేషన్స్ ఉన్నాయని చెబుతున్నారు.. మరి, ఏం జరగనుందో త్వరలోనే చూడాలి..