నవ్యాంధ్రప్రదేశ్‌ను ఇప్పుడు మాదకద్రవ్యాల అంశం కుదిపేస్తోంది. వేలాది కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ తాలిబాన్ ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు తరలివస్తున్న వైనం.. ఆ డ్రగ్స్ ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడకే వస్తున్న తీరుతో ఈ వాదనకు బలం చేకూరిందనే చెప్పాలి. ఇక ఏపీలో నిత్యం ఎక్కడో ఒక చోట అక్రమ మార్గాల ద్వారా తరలుతున్న గంజాయి గుట్టలుగుట్టలుగా దొరికిపోతోంది. విజయవా, గుంటూరు కేంద్రంగా కొందరు వ్యాపారులు ఈ గంజాయిని ఉత్తరాంధ్రకు చెందిన పలు ప్రాంతాల నుంచి తెప్పిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న వైనంపైనా ఇటీవలే పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు. తాజాగా గురువారం నాడు తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండల పరిధిలో దేవుడి చిత్రపటాల మాటున గంజాయి పెట్టి తరలిస్తున్న వైనం కూడా బయటపడిపోయింది. వరుసగా వెలుగు చూస్తున్న ఈ ఘటనలను పరిశీలిస్తే.. ఏపీ నిజంగానే డ్రగ్స్ కు డెన్ గా మారిపోతోందన్న వాదనలు అంతకంతకూ బలపడుతున్నాయనే చెప్పాలి.
ద్వారంపూడి టార్గెట్ అయ్యారే!
అధికార వైసీపీలో కీలక నేతగా, పార్టీ అధినేత, సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి.. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వ్యవహారంలో తనదైన శైలి దూకుడు ప్రదర్శించే ద్వారంపూడిని జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ అధికారులు విచారించిన వైనం కూడా తెలిసిందే. జగన్ సామాజిక వర్గానికి చెందిన ద్వారంపూడి ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో కింగ్ పిన్‌లా మారిపోయారు. మంత్రి పదవి లేకున్నా.. ఆ జిల్లాకు చెందిన మంత్రులు కూడా ద్వారంపూడి ముందు మోకరిల్లాల్సిందేనన్న వాదనలు లేకపోలేదు. ఇంతగా హవా సాగిస్తున్న ద్వారంపూడిపై ఒక్కసారిగా డ్రగ్స్ ఆరోపణలు చుట్టుముట్టాయి. విపక్ష టీడీపీ.. ద్వారంపూడిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీలోకి తరలివస్తున్న డ్రగ్స్ దందా మొత్తం ద్వారంపూడి కనుసన్నల్లోనే సాగుతోందని, ద్వారంపూడిని ముందుగా విచారించాలని, డ్రగ్స్ సరఫరాదారులతో ఆయనకు ఉన్న సంబంధాలేమిటో నిగ్గు తేల్చాలని వాదిస్తోంది. ఈ తరహాలో ఎవరు ముందుగా ద్వారంపూడిని తీసుకొచ్చారో గానీ.. బుధవారం నాడు టీడీపీపై విరుచుకుపడిన సందర్భంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ద్వారంపూడి పేరును ప్రస్తావించక తప్పలేదు. ఇక గురువారం నాడు సజ్జల కామెంట్లపై విరుచుకుపడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ద్వారంపూడిని విచారిస్తే.. డ్రగ్స్ దందా మొత్తం బయటపడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఎలా చిక్కుకున్నారో తెలియదు గాని.. ఏపీని వణికించేస్తున్న డ్రగ్స్ దందాలో ద్వారంపూడి కేంద్ర బిందువుగా మారిపోయారు.
టీడీపీ మార్కు దాడి షురూ
ఆఫ్ఘన్ నుంచి విజయవాడకు తరలివస్తున్న భారీ మొత్తం డ్రగ్స్‌ను గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో డీఆర్ఐ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. దాదాపుగా రూ.27 వేల కోట్ల విలువ చేసే ఈ డ్రగ్స్ విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సుధాకర్ అనే వ్యక్తికి చెందిన కంపెనీకి తరలివెళుతున్నాయని తెలుసుకున్న డీఆర్ఐ నేరుగా విజయవాడలోనూ తనిఖీలు చేపట్టింది. సుధాకర్‌తో పాటు అతడి భార్యనూ అరెస్ట్ చేశారు. రూ.27 వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ విజయవాడకు తరలివస్తూ మధ్యలోనే పట్టుబడిన వైనంపై అధికారంలో ఉన్న వైసీపీ ముందుగా స్పందించాల్సి ఉంది. అయితే వైసీపీ ఆ దిశగా స్పందించకపోగా.. బాధ్యత కలిగిన విపక్షంగా ఈ భారీ డ్రగ్స్ విజయవాడకు తరలివస్తోంటే.. ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ వ్యాఖ్యానించడం తప్పైపోయినట్లుగా వైసీపీ ఎదురు దాడి మొదలెట్టింది. అయితే ప్రజా సమస్యలపైనా, జగన్ సర్కారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైనా తమదైన శైలి పోరు సాగిస్తున్న టీడీపీ.. వైసీపీ ఎదురు దాడితో తమదైన మార్కు పోరాటానికి తెర తీసింది. నేరుగా జగన్ నే టార్గెట్ చేస్తూ టీడీపీ సంధిస్తున్న దాడితో జగన్ సర్కారు ఉక్కిరిబిక్కిరి అయ్యిందనే చెప్పాలి. టీడీపీ తరఫున జగన్ సర్కారును జనం కోర్టులో నిలబెట్టేస్తున్న ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం డ్రగ్స్ దందాపై గడచిన రెండు రోజులుగా విరుచుకుపడుతున్నారు. కాకినాడ వచ్చి తనను ప్రశ్నించే వారిని లారీలతో తొక్కించేస్తానని ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలపై గురువారం ఎదురు దాడి చేసిన కొమ్మారెడ్డి.. ఒక్కసారి కాదు పది సార్లు వస్తాం ఏం చేస్తారో చూస్తామంటూ సవాల్ విసిరిన వైనం కలకలం రేపుతోంది.
దేవుడి పటాల మాటున గంజాయి!
ఈ మాటల యుద్ధం ఇలా కొనసాగుతుండగానే.. గురువారం నాడు ద్వారంపూడి సొంత జిల్లా తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో దేవుడి పటాల మాటు తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కిర్లంపూడి మండలం బూరుగుపూడి సమీపంలో గంజాయి తరలిపోతున్న వైనంపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఓ ఆటోని స్వాధీనం చేసుకోగా.. అందులో దేవుడి పటాలు కనిపించాయి. అయితే ఆ పటాల వెనుక ఏదో అనుమానాస్పదంగా ఉండగా.. పటాలను తొలగించగా.. లోపల గంజాయి బయటపడింది. దేవుడి పటాలతో చుట్టేసిన మొత్తం 15 కట్టల్లో ఏకంగా 122 కిలోల గంజాయి దొరికింది. దీనిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తలను అదుపులోకి తీసుకోగా.. వారిని విచారించగా ఇలా దేవుడి పటాల మాటున గంజాయిని చాలా కాలం నుంచే తరలిస్తున్నట్లుగా తేలింది. విశాఖకు చెందిన ఓ వ్యక్తి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారని కూడా తేలింది. ఓ వైపు విదేశాల నుంచి భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు.. మరోవైపున ఏకంగా దేవుడి పటాల మాటున గంజాయి తరలిస్తున్న వైనం చూస్తుంటే.. నవ్యాంధ్ర మాదక ద్రవ్యాలకు కేంద్రంగా మారిందన్న వాదనలకు బలం చేకూరుతోంది. మరి ఈ దందాను ఎలా అరికడతారో చూడాలి.
Must Read ;- లోకేశ్ ఎంట్రీ.. సజ్జలకు స్ట్రాంగ్ వార్నింగ్











