ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ లో డిప్యూటీ సీఎం హోదాలో ఇటు ఎక్సైజ్ శాఖ, అటు వాణిజ్య పన్నుల శాఖల వంటి కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న కళత్తూరు నారాయణ స్వామి ఏం మాట్లాడినా సంచలనమే. ఇటీవలే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తూ.. సొంతంగా ఎన్నికల్లో గెలిస్తే చంద్రబాబు ఇంటిలో పాకీ పనిచేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన స్వామి పెద్ద ఎత్తున విమర్శలకు గురయ్యారు. తాజాగా తనకు కీలక పదవిని ఇచ్చిన జగన్‌నే అభాసుపాలు చేసేలా నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలే జగన్‌మోహన్‌రెడ్డిపైన దాడి చేసే రోజు రాబోతున్నదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఎక్కడో కాకుండా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధి సాక్షిగా నారాయణ స్వామి చేయడం గమనార్హం. టంగ్ స్లిప్ కారణంగానే ఈ వ్యాఖ్యలు వినిపించినా.. నారాయణ స్వామి నోట నుంచి వచ్చిన ఈ వ్యాఖ్యలను ఆధారం చేసుకుని వైసీపీ ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా తమదైన శైలి సెటైర్లు వేస్తున్నారు.
‘స్థానిక’ నేతలతో తిరుమలకు..
ఇటీవలే ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో నారాయణ స్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని మెజారిటీ స్థానాలను వైసీపీ దక్కించుకుంది. ఈ క్రమంలో తన నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జడ్పీటీసీలతో కలిసి నారాయణస్వామి బుధవారం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం మహిళా ఎంపీపీలు, జడ్పీటీసీలను ముందు పెట్టుకుని ఆ వెనుకాలే పురుష ప్రతినిధులను రాగా తిరుమల ఆలయం వెలుపల నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పేదలకు ఇళ్లు ఇచ్చిన జగన్ ఘనతను ఆయన ప్రస్తావించారు. అయితే బర్నింగ్ ఇష్యూగా మారిన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు, పవన్ పై వైసీపీ ఎదురుదాడిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడి తనను తాను అవమానపరచుకోలేనంటూ ఓ ఆసక్తికరమైన వ్యాఖ్యను చేసిన నారాయణ స్వామి.. ఆ తర్వాత మొత్తం పవన్ కల్యాణ్ నే టార్గెట్ చేస్తూ మాట్లాడారు.
దాడి పవన్ పై కాదు.. జగన్ పైనే
ఈ క్రమంలో పవన్‌పై దాడికి వైసీపీ శ్రేణులను జగనే పంపించారన్న వాదనను తిప్పికొట్టే క్రమంలో పవన్ కల్యాణ్‌పై దాడి కాదు.. ఆ దాడి జగన్ పై జరగబోతోందని నారాయణ స్వామి టంగ్ స్లిప్ అయ్యారు. ప్రజలే జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసే రోజు రాబోతున్నదని నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణ స్వామి నోట నుంచి ఈ వ్యాఖ్య వెలువడినంతనే.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నారాయణ స్వామి టంగ్ స్లిప్ అయిన కారణంగానే ఈ మాట అన్నారని, అయితే రాష్ట్రంలో వైసీపీ పాలనను చూస్తుంటే.. త్వరలోనే ప్రజలే జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసే రోజు రాబోతున్నదని సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి. మరి ఈ వివాదం నుంచి నారాయణస్వామి ఏ రీతిన బయటపడతారో చూడాలి.
Must Read ;- పీకే వర్సెస్ పోసాని.. హద్దులు దాటేసింది











