లఖింపూర్ ఖేరీ ఘటన ఇప్పుడు దేశాన్నే వణికిస్తోంది. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న నిరసనలపైకి కేంద్ర హోం మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కుమారుడు తన కారును ఎక్కించేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఈ ఘటన జరిగినప్పుడు తన కుమారుడు ఆశిష్ అక్కడ లేరని అజయ్ మిశ్రా చెబుతున్నా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం దానిని బాగానే హైలెట్ చేసింది. అదే సమయంలో బాధిత రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకా గాంధీని యూపీ పోలీసులు అరెస్ట్ చేసిన తీరుతో ఈ ఘటన మరింత వైరల్ గా మారింది. మొత్తంగా లఖింపూర్ ఖేరీ ఘటన దేశాన్నే వణికించేస్తోంది. ఇలాంటి క్రమంలో లఖింపూర్ ఖేరీ ఘటనను ఖండిస్తూ బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఆయనతో పాటు ఆయన తల్లి, బీజేపీ ఎంపీ మేనకా గాంధీలను పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి బహిష్కరించేలా చేసింది.
అసంతృప్తిలో మేనకా, వరుణ్
ఇందిరా గాంధీ ఫ్యామిలీ అంటేనే కాంగ్రెస్ గుర్తుకు వస్తే.. ఇందిరా చిన్న కోడలు మేనకా గాంధీ మాత్రం చాలా కాలం నుంచి బీజేపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గాంధీ ఫ్యామిలీకి చెందిన కీలక నేత తమ పార్టీలోకి రావడంతో బీజేపీ మేనకా గాంధీకి స్థాయికి మించి ప్రాధాన్యం కల్పించింది. కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. తన జాతీయ కార్యవర్గంలోనూ కీలక పదవిని ఇచ్చింది. మేనక కోరగానే.. ఆమె కుమారుడు వరుణ్ గాంధీకి కూడా ఎంపీ టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం యూపీలోని రెండు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి తల్లీకొడుకులిద్దరూ బీజేపీ ఎంపీలుగా కొనసాగుతున్నారు. మోదీ తన తొలి కేబినెట్ లో మేనకాకు పదవి ఇచ్చినా.. సెకండ్ టెర్మ్‌లో ఆమెను పక్కనపెట్టేశారు. సరే.. తల్లిని పక్కనపెబడితే.. కుమారుడు వరుణ్ గాంధీకి మంత్రి పదవి ఖాయమన్న వాదనలూ వినిపించాయి. అయితే ఇటీవల జరిగిన కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణలోనూ వరుణ్‌కు మంత్రి పదవి దక్కలేదు. వెరసి తల్లీకొడుకులు ఇద్దరూ బీజేపీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే చెప్పాలి.
కార్యవర్గం నుంచి అవుట్
మంత్రి పదవులు దక్కలేదనో, లేదంటే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలోనే ఇంత పెద్ద దుర్ఘటన జరిగిందన్న కోపమో తెలియదు గానీ.. గురువారం నాడు లఖింపూర్ ఖేరీ ఘటనను ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చేసిన గంటల వ్యవధిలో వెలువడిన బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం నుంచి తల్లీకొడుకుల పేర్లు గల్లంతయ్యాయి. నిన్నటిదాకా వీరిద్దరూ బీజేపీ జాతీయ కార్యవర్గంలో సభ్యులుగానే ఉన్నారు. అయితే గురువారం ప్రకటించిన జాబితాలో ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు ఆ కమిటీలో శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితుల పేరిట దాదాపుగా 200 మందికి పైగా నేతల పేర్లున్నా.. మేనక, వరుణ్ పేర్లు మాత్రం ఏ జాబితాలోనూ కనిపించలేదు. దీంతో వరుణ్ చేసిన ట్వీట్ కారణంగానే తల్లీకొడుకులను బీజేపీ తన జాతీయ కార్యవర్గం నుంచి బహిష్కరించేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- అన్నొస్తే గానీ చెల్లిని వదల్లేదే!











