Supreme Court Notices To CBI Director :
సీబీఐ.. అంటేనే దర్యాప్తు సంస్థల్లోనే ఓ తోపు సంస్థగా పేరుంది కదా. దేశంలో ఎంతటి పెద్ద కేసు అయినా.. తాను మాత్రమే తేలుస్తామన్న రీతిలో సీబీఐ తనదైన శైలిలో డాంబికం ప్రదర్శిస్తున్న సంగతీ తెలిసిందే. అయితే సంస్థ ఏర్పడ్డ నాటి నుంచి ఈ సంస్థ.. ఎన్ని కేసుల విచారణను చేపట్టింది? ఎన్నింటిని నిగ్గు తేల్చింది? ఎన్ని కేసుల్లో నిందుతులకు శిక్షలు పడేలా చేసింది? అన్న వివరాలు మాత్రం ఇప్పటిదాకా ఏ ఒక్కరికీ తెలియవనే చెప్పాలి. అయితే ఆ విషయం ఇప్పుడు తేలిపోతుంది. అంటే.. సీబీఐ సత్తా ఏమిటో తేలిపోయే తరుణం వచ్చేసినట్టే కదా. ఈ దిశగా సోమవారం నాడు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నేరుగా సీబీఐ చీఫ్ కే నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు కదా.. సీబీఐ డైరెక్టర్ ఈ వివరాలు వెల్లడించి తీరాల్సిందే. తన ఆధ్వర్యంలోని సీబీఐ సత్తాను ఆ డైరెక్టర్ తేల్చి చెప్పాల్సిందే. మొత్తంగా సీబీఐ సత్తా ఏమిటో త్వరలోనే తేలిపోతుందన్న మాట.
ఆదేశాలు ఎలా వచ్చాయంటే..?
సీబీఐ అధికారులు ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని ఇద్దరు లాయర్లపై నమోదు చేసింది. ఈ కేసు విచారణ సోమవారం జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం చేపట్టింది. విచారణ సందర్భంగా సీబీఐ న్యాయవాదులు చేసిన వాదనలపై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగానే అసలు ఎన్ని కేసుల్లో నిందితులకు సీబీఐ శిక్షలు వేయించగలుగుతుందన్న విషయాన్ని తెలుసుకోవాలని న్యాయమూర్తులు అనుకున్నారు. అంతే.. ఇద్దరు న్యాయమూర్తుల నుంచి సీబీఐకి ప్రశ్నల వర్షం కురిసింది. ఇప్పటివరకు సీబీఐ ఎన్ని కేసులు చేపట్టింది?, ఎన్ని నిరూపించింది?, ఎందరికి శిక్ష వేయించింది?, ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి?.. ఇలా అన్ని వివరాలను చెప్పాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. ఆరు వారాల్లో సీబీఐ డైరక్టర్ ఈ వివరాలు సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. అలాగే సిబ్బంది, మౌలిక వసతుల లేమి కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరు వారాల్లో నివేదిక అందించాలని ఆదేశించింది. మొత్తంగా మీ సత్తా ఏమిటో చెప్పండి సారూ అంటూ సుప్రీంకోర్టు సీబీఐ డైరెక్టర్ ను ఆదేశించిందన్న మాట.
మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యల ప్రస్తావన
రెండు వారాల కిందట మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ కూడా సీబీఐ విషయంలో కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సీబీఐని రాజకీయ పంజరం నుంచి వదిలి పెట్టాలని .. సీబీఐని పటిష్ట పరిచేందుకు మొత్తం 12 సూచనలను సూచించిన సంగతి తెలిసిందే. కాగ్, ఎన్నికల కమిషన్ తరహాలో సీబీఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. నాటి మద్రాస్ హైకోర్టు ఆదేశాల నుంచి సీబీఐ ఇంకా తేరుకోకముందే ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మళ్లీ అవే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అసలు మీ సత్తా ఏమిటో చెప్పండంటూ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
Must Read ;- జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాగ్రహంతోనైనా సీబీఐ మారాలి