కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గురువారం ప్రకటించిన నూతన జాతీయ కార్యవర్గంలో పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్‌కు కీలక పదవి దక్కింది. పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆయనను సభ్యుడిగా తీసుకుంటూ బీజేపీ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వివేక్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలకు కూడా కీలక పదవులు దక్కాయి. వివేక్‌తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యుడు, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన గరికపాటి మోహన్ రావులను కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యులుగా నియమిస్తూ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నలుగురు తెలంగాణకు చెందిన వారు కాగా.. ఏపీ నుంచి పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ను కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి తీసుకుంది.
జాతీయ ప్రధాన కార్యదర్శిగా దగ్గుబాటి
ఇదిలా ఉంటే.. ఏపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి బీజేపీ ప్రమోషన్ కల్పించింది. ఇప్పటిదాకా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమెను తాజాగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించింది. ఆఫీస్ బేరర్ల జాబితాలో తెలంగాణకు చెందిన మాజీ మంత్రి డీకే ఆరుణకు చోటు దక్కగా.. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ నుంచి విజయశాంతి, హుజూరాబాద్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల రాజేందర్‌లను నియమించింది. ఇక జాతీయ కార్యదర్శిగా ఏపీ కోటా నుంచి సత్యకుమార్‌కు కూడా బీజేపీ అధిష్ఠానం కొత్త పదవిని కల్పించింది. వెరసి గతంలో కంటే కూడా తెలుగు రాష్ట్రాలకు ఈ దఫా బీజేపీ జాతీయ కార్యవర్గంలో మరిన్ని పదవులు దక్కాయనే చెప్పాలి.
వివేక్‌కు పదవిపైనే చర్చ
తెలుగు నేలకు చెందిన ఇంతమందికి బీజేపీ అధిష్ఠానం కీలక పదవులు కల్పించినా.. మాజీ ఎంపీ వివేక్‌కు ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా నియమిస్తూ బీజేపీ తీసుకున్న నిర్ణయమే అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి. ఎందుకంటే.. టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఈటల రాజేందర్ ను బీజేపీలో చేరేలా వివేక్ మంత్రాంగం నడిపారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఇటీవలే ముగిసిన దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఆయన ఆర్థికంగా పార్టీకి ఎంతగానో ఉపయోగపడ్డారు. ఈ క్రమంలో బీజేపీకి సంబంధించి తెలంగాణ శాఖలో వివేక్ కీలక నేత కిందే లెక్క. అలాంటి వివేక్‌ను లాగేసి బీజేపీ భారీ షాకిద్దామని టీఆర్ఎస్ ప్రణాళికలు రచించింది. అందులో భాగంగా ఇటీవలే వివేక్ తో మంత్రి హరీశ్ రావు రహస్య భేటీ కూడా నిర్వహించారన్న వార్తలూ కలకలం రేపాయి. దీంతో టీఆర్ఎస్ ప్లాన్లకు చెక్ పెట్టే దిశగా సాగిన బీజేపీ అధిష్ఠానం వివేక్ కు పార్టీ జాతీయ కార్యవర్గంలో కీలక పదవిలో నియమించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Must Read ;- హరీశ్ వ్యూహంతో బీజేపీకి షాకేనా?











