There Is No Release Of Funds For Development Works In AP :
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సీఎంగా ఉండగా నవ్యాంధ్రలో అభివృద్ధి పరుగులు తీసిన వైనం కళ్లారా చూశాం. రాజధాని అమరావతిలో సరికొత్త టెక్నాలజీ సాయంతో చంద్రబాబు పనులను ఎలా పరుగులు పెట్టించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అబివృద్ధి పనులు ఎక్కడికక్కడ ముమ్మరంగా జరిగాయి. కాంట్రాక్టర్లు కూడా తమకు దక్కిన పనులను శరవేంగంగా పూర్తి చేసేవారు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన మొదలయ్యాక.. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా పడకేసిందనే చెప్పాలి. కనీసం గుంతలు పడి రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న రోడ్లకు మరమ్మతులు కూడా చేయించలేని వైనంపై ఇటీవలే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. సరే.. విపక్షాలంటే అధికార పక్షాన్ని ఆడిపోసుకుంటాయని అంతా అనుకుంటారు కదా. అయితే జగన్ పాలనలో ఏపీలో అభివృద్ధి జీరోనేనని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్చే, సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
కోటంరెడ్డి ఏమన్నారంటే..?
ఇటీవలే తన నియోజకవర్గ పరిధిలోని హరినాథపురానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్లారట. ఈ సందర్భంగా అక్కడ అప్రోచ్ రోడ్లే లేని కారణంగా తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని వైసీపీ శ్రేణులు ఎమ్మెల్యేను కోరారట. ఈ రోడ్డు వేస్తే.. తమకు అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటుందని, ఈ రోడ్డు కోసం చాలా సార్లు విజ్ఞప్తులు కూడా చేశామని, అయినా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారట. అంతేకాకుండా గతంలోనే మొదలుపెట్టిన డ్రైనేజీ పనులు పూర్తి కాలేదని, దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, కనీసం ఆ పెండింగ్ పనులనైనా పూర్తి చేయాలంటూ వారు కోటంరెడ్డికి విన్నవించారట. తమ పార్టీకే చెందిన శ్రేణులు చెబుతున్న విషయాలన్నీ ఓపిగ్గానే విన్న కోటంరెడ్డి.. చాలా నింపాదిగా రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులే లేవని, మొత్తం నిధులన్నీ సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారట. వచ్చే ప్రతి పైసానూ సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తున్న నేపథ్యంలో అభివృద్ధి పనుకు సర్కారీ ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదని ఆయన కుండబద్దలు కొట్టేశాచరట. స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే నోటి నుంచే ఈ మాట వినపడటంతో అక్కడి వారంతా నిశ్చేష్టులయ్యారట.
బుగ్గన చెప్పినదీ ఇదే కదా
సరే.. కోటంరెడ్డి అంటే తన జనాలను అనునయించే క్రమంలో ఏదో అలా మాట జారారని అనుకున్నా.. సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఇదే మాటను పరోక్షంగా చెప్పేశారు. ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పులు, చేస్తున్న ఖర్చులపై లెక్కా పత్రం లేదంటూ ఇటీవలే ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ హోదాలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేసిన సమయంలో బుగ్గన ఎంట్రీ ఇచ్చి తనదైన శైలి మాయామంత్రంతో లెక్కలు చెప్పారు కదా. ఆ తర్వాత కేంద్రం నుంచి లేఖలు వచ్చిన నేపథ్యంలో హుటాహుటీన ఢిల్లీకి వెళ్లిన బుగ్గన. తాము తీసుకొచ్చిన అప్పుల్లో 90 శాతానికి పైగా సంక్షేమ పథకాల అమలుకే ఖర్చు చేశామని చెప్పేశారు. ఈ క్రమంలోనే రూ.1.20 లక్షల కోట్ల అప్పు చేస్తే.. అందులో రూ.1.02 లక్షల కోట్లను కేవలం సంక్షేమ పథకాలకే వెచ్చించామంటూ బుగ్గన చెప్పిన విషయం గుర్తుంది కదా. అంటే.. ఇప్పుడు కోటంరెడ్డి చెప్పినట్టుగా అభివృద్ధి కోసం జగన్ సర్కారు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదన్న మాటలు అక్షర సత్యమే కదా అన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
Must Read ;- బాబు సవాల్‌కు జగన్ సిద్ధమా?











