(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
నిస్తేజంలో కొట్టుమిట్టాడుతున్న విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీని పోలిట్‌బ్యూరో ప్రకటన మరింత నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఇప్పటివరకు విజయనగరం జిల్లా నుండి మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు పూసపాటి అశోక్ గజపతి రాజు ఒక్కరికే పోలిట్బ్యూరోలో స్థానం ఉండేది. ఈ సారి ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణికి కూడా అవకాశం ఇవ్వడం జిల్లాలో చర్చనీయాంశమైంది. అశోక్ ప్రాభవానికి సమాంతర వ్యవస్థను తయారు చేస్తున్నారా? అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఓటమి తరువాత మౌనం దాల్చిన అశోక్
సాధారణ ఎన్నికల్లో విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి తాను, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన కుమార్తె అదితి గజపతిరాజు ఓడిపోయిన తరువాత అశోక్ గజపతి రాజు మౌనం దాల్చారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన మౌనంతో కేడర్ అంతా నిస్తేజంలోకి జారుకుంది. ఇంతలో కరోనా వ్యాప్తి చెందడంతో ఆయన బంగ్లా గేటుకు తాళాలు బిగించేశారు. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా, జిల్లా పార్టీ కార్యాలయంగా కొనసాగుతున్న అశోక్ బంగ్లాకు తాళాలు పడటంతో ఆ పార్టీ నాయకులు ‘చెట్టు కొకరు .. పుట్ట కొకరు’ చందంగా మారిపోయారు. కార్యకర్తలు ఏమి చేయాలో, అవసరం వస్తే ఎవరిని కలవాలో దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు. ‘ఎవరికి వారే యమునా తీరే’ చందంగా పార్టీ నాయకుల పరిస్థితి మారిపోయింది.

నాగార్జున ఎంపికతో మరింత డీలా
విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షునిగా కిమిడి నాగార్జున ఎంపికతో పార్టీ కేడర్ మరింత డీలా పడింది. కొన్ని దశాబ్ధాలుగా అశోక్ సూచించిన వ్యక్తే ఇక్కడ అధ్యక్షుడుగా కొనసాగడం, అంతా తానేగా పార్టీని నడిపించడం ఆనవాయితీ. నాగార్జున నియామకంతో పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా ఆయన ఈ జిల్లాకు చెందిన వ్యక్తి కాకపోవడం, టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు సొంత తమ్ముడు కొడుకు కావడం అశోక్ ఆటలు సాగే అవకాశం లేకుండా పోయింది. దీంతో జిల్లా తెలుగుదేశం నాయకులు, కేడర్ అశోక్‌ను పట్టించుకోవడం మానేయడంతో ఆయన ప్రాభవం మసకబారుతోంది.
సంచైత ఎంట్రీతో మారిన సీన్
విజయనగరం కేంద్రంగా పనిచేస్తున్న ప్రతిష్ఠాత్మకమైన మాన్సాస్ ఛైర్‌పర్సన్‌గా సంచైత గజపతి ఎంటరైన నుండి అశోక్ గజపతి రాజుపై జిల్లా ప్రజలకు ఉన్న విశ్వాసం సన్నగిల్లుతోంది. నిజాయితీ పరునిగా ఉన్న ముద్ర చెరిగిపోతోంది. మాన్సాస్ ముసుగులో అశోక్ చేసిన అక్రమాలు, ప్రతిష్టాత్మకమైన ఎమ్మార్ కాలేజీ ప్రైవేటీకరణకు ఆయన హయాంలోనే ప్రయత్నాలు మొదలయ్యాయనే ప్రచారం.. వెరసి అశోక్ ప్రతిష్ట గంగలో కలిసిపోయింది. ఆమె సంధించిన పలు ప్రశ్నలకు అశోక్ గజపతి సమాధానం చెప్పకపోవడంతో జిల్లా ప్రజల్లో అశోక్ గజపతి వ్యవహార శైలిపై అపనమ్మకం చోటుచేసుకుంది.
గుమ్మడి నియామకంతో సమాంతర వ్యవస్థ
పార్టీ పరంగా ఇంతవరకు జిల్లాలో అశోక్ గజపతి రాజు పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయన చెప్పిందే పార్టీకి వేదం. ఆయన చూపిందే మార్గంగా ఉండేది. ఇప్పుడు అదే స్థాయిలో విజయనగరం జిల్లా నుండే ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణికి పోలిట్‌బ్యూరో సభ్యురాలిగా ఎంపిక చేయడంతో పార్టీలో ప్రత్యామ్నాయం, సమాంతర వ్యవస్థ ఏర్పడేందుకు అవకాశం కలిగింది.
‘అధికారాంతంబున చూడవలే’ అనే చందంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా , పలుమార్లు రాష్ట్ర మంత్రిగా , ఒకసారి కేంద్ర మంత్రిగా, టీడీపీలో ద్వితీయ స్థాయి నాయకునిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన అశోక్ గజపతి రాజు ప్రస్తుత పరిస్థితికి ప్రజలతో నేరుగా లేని సంబంధాలు , నాయకులతో అంటీముట్టనట్లు వ్యవహరించడం, ఆయనదైన ఒక కోటరీలోనే కాలక్షేపం చేయడం ప్రధాన కారణాలని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అశోక్ భవిష్యత్ రాజకీయం ఎలావుంటుందో వేచిచూడాలి.











