(ఒంగోలు నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
‘సింగడు అద్దంకి పోనూ పోయాడు.., రానూ వచ్చాడు..’ ఇది ప్రకాశం జిల్లాలోని గ్రామస్థాయి నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబుపై జాతీయకమిటీల ఎంపిక తర్వాత వేస్తున్న సెటైర్.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా.., ప్రకాశం జిల్లాపై బాబు సవతితల్లి ప్రేమ చూపించారనే అభిప్రాయం స్థానిక కేడర్ లో ఉంది. అలా నిర్లక్ష్యం చేసినా, పార్టీ మీద అభిమానంతో కష్టపడి 2019 ఎన్నికల్లో వైసీపీ ఫ్యాను గాలికి ఎదురొడ్డి.., జిల్లాలో 4 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చామనేది కేడర్ వాదన. ఏ జిల్లాలోనూ ఈ మాత్రం మెజారిటీ టీడీపీకి దక్కలేదని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆవేదన మొత్తం.. పొలిట్ బ్యూరో, జాతీయకమిటీల ఎంపికలో ప్రకాశం జిల్లా నుంచి ఒక్క నేతకు కూడా స్థానం ఇవ్వకపోవడం దగ్గరే వస్తోంది. పార్టీ అధిష్టానం- ప్రకాశం జిల్లా నేతలను పూచికపుల్లల్లా పక్కనపెట్టింది అని పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది.
నెల్లూరు, గుంటూరు కన్నా పనికిమాలిన వాళ్ళమా…?
సోమవారం నూతన కమిటీలను పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 27 మందితో పార్టీ సెంట్రల్ కమిటీ, 25 మందితో పొలిట్‌బ్యూరో, 31మందితో తెలంగాణ పార్టీ కమిటీ, మరో ఆరుగురితో తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీల జాబితా విడుదల చేశారు.
2019 ఎన్నికల్లో ఒక్కసీటు గెలవని నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, 1 సీటు గెలిచిన గుంటూరు నుంచి నక్కా ఆనంద్ బాబుకు పొలిట్ బ్యూరోలో స్థానం ఇచ్చింది టీడీపీ అధిష్ఠానం. కానీ, 4 సీట్లు ఇచ్చిన ప్రకాశం జిల్లాకు పొలిట్ బ్యూరో, జాతీయకమిటీల్లో స్థానం ఇవ్వలేదు.
ఇక ఏ మొహం పెట్టుకుని గ్రౌండ్ లెవల్లో పార్టీకోసం ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు తిరగగలరని.., వైసీపీ నాయకులు మీ అధిష్ఠానం మీకు విలువే ఇవ్వలేదు..? అని నవ్వితే మొహం ఎక్కడ పెట్టుకోవాలి ద్వితీయశ్రేణి నేతలు అంతర్గత సంభాషణల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినా? అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని అధిష్ఠానం ఇప్పుడు పట్టించుకుంటుంది అని అనుకోవడం తమ భ్రమ, అధికారం లేనప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవడం గురించి కూడా పట్టించుకోకుండా.. చంద్రబాబు జిల్లాలో పార్టీని అనాధలా వదిలేశారని పార్టీ క్యాడర్ నిరాశలో మునిగిపోయింది.
పార్టీ నేతలపై బాబుకు నమ్మకం కలగడం లేదా?
3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్, 7 ఏళ్ల నుంచి టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు మోస్తున్న దామచర్ల జనార్దన్, సీనియర్ నేతలు పోతుల రామారావు, దివి శివరాం, ఏలూరి సాంబశివరావు వంటి నేతలకు కూడా జాతీయ కమిటీల్లో స్థానం ఇవ్వకపోవడంపై జిల్లాలో తీవ్రచర్చ నడుస్తోంది. గొట్టిపాటి, ఏలూరి, పోతుల పార్టీ మారతారని వార్తలు వచ్చాయి. గొట్టిపాటి, పోతుల గ్రానైట్ సంస్థలపై దాడులు జరిగాయి. అందువల్ల వాళ్ళు కూడా పార్టీని వదిలివెళ్తారని పార్టీలో అనుమానం ఉండటమే జాతీయకమిటీల్లో స్థానం ఇవ్వకపోవడానికి కారణం ఏమో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
చూడాలి.. భవిష్యత్తులో టీడీపీ అధిష్టానం కార్యకర్తల ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెబుతుందో..?