స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కాపీ వివాదంలో చిక్కుకుంది. రచయిత వేంపల్లి గంగాధర్ ఈ సినిమా కథ నాదేనంటూ రైటర్స్ ఆసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కథ ‘తమిళ కూలి’ పేరిట సాక్షి పేపర్ లో వచ్చిందని ఆయన తెలిపాడు. తన కథను చదివి ఇన్స్పైర్ అయిన సుకుమార్ ‘పుష్ప’ కథను తయారు చేశారని ఆరోపణలు చేసారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తాను రాసిన కథనే సుకుమార్ కాపీ చేశాడని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు చేసింది మాములు వ్యక్తి కాదు. కేంద్ర ప్రభుత్వం సాహిత్య అవార్డు గ్రహీత అయిన గంగాధర్ నుంచి ఈ విమర్శలు రావడం టాలీవుడ్ ను షాక్ కు గురి చేశాయి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ సినిమాపై కూడా గంగాధర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాను వ్రాసిన మొండికత్తి నవలను త్రివిక్రమ్ దింపేశాడని ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇప్పుడు పుష్ప సినిమా కథ నాదేనంటూ ఆయన తిరిగి విమర్శలు చేయడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో తన ఆవేదనను తెలియచేస్తూ ఫేసుబుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. “ఈ పోస్ట్ విమర్శ కాదు.వివాదం కాదు. కేవలం ఆలోచించమని కోరే ఆవేదన మాత్రమే. ఈ subject పై నేను చేసిన మొత్తం work జనం ముందు పెట్టడమే ఉద్దేశం. అభద్రతా భావం కారణం కావచ్చు.చేసిన కృషి ముందే చెప్పి ఉంచడం అవసరం అనిపించింది. నిజానిజాలు సినిమా వచ్చాక ప్రజలే నిర్ణయించాలి. నాకు తోడుగా నీడగా స్పందించిన ఆత్మీయ హృదయాలకు ధన్యవాదాలు .సూచన అనుకోండి , సలహా అనుకోండి, ఒక సాహిత్యకారుడి ఆవేదన అనుకోండి… ముందుగానే రాసి పెట్టిన కథలను ,పుస్తకాన్ని, వ్యాసాలను అన్నీ వాడుకోండి .
తెలుగు సాహిత్య కారుల శ్రమను దోచుకోవడం మీ సినిమా రంగానికి కొత్త కాదు కాబట్టి మా అక్షరాలను మీ దృశ్యాలుగా మార్చుకొని బతుక్కోండి …ఎర్ర చందనం నేపధ్యం లో సాక్షి ఆదివారం అనుబంధం( 04 నవంబర్ 2018)లో నేను రాసిన ‘తమిళ కూలీ’ కథ మొత్తం వాడేసుకోండి. 19 ఆగస్ట్ 2008 లో నేను ‘ వార్త ‘ దిన పత్రిక సంపాదక పేజీలో రాసిన ‘ ఎర్ర కొయ్యలోళ్లు ‘ కథ నూ, (ఇదే కథ విశాలాంధ్ర వారు ఏప్రిల్ 2015 లో ప్రచురించిన నా ‘పాపాఘ్ని కథా సంపుటిలో’ కూడా ఉంది). 25 ఫిబ్రవరి 2009 లో నేను నవ్య వార పత్రిక లో రాసిన ‘ కొయ్య బొమ్మలు’ కథ కూడా మీ కోసం కోసం అశ్రు నయనాలతో అంకితం.(ఇదే కథ నా ‘దేవర శిల ‘కథా సంపుటిలో’ కూడా ఉంది.)
గత సంవత్సరం(2019) మే నెలలో మార్కెట్ లోకి వచ్చిన నా 80 పేజీల పుస్తకం ‘ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు’ ను – మొత్తం అన్నీ కలిపి ఉడికించి ‘సినిమా వంట’ తయారు చెయ్యండి. కనీసం పేరుకూడా reference గా సినిమాలో వేయకండి . కథకులను ప్రోత్సహించకండి . మొత్తం సమాచారం మీ ముందు ఉంది. ఇంక పండగ చేస్కోండి. మీ సినిమా బాగారావాలి. మీరందరూ చల్లగా ఉండాలి. ఏళ్ళ తరబడి అక్షరాలనే నమ్ముకున్న నా లాంటి ఎందరో కథకులు తమ పుస్తకాలను మోసుకుంటూ , ఉచితంగా పంచుకుంటూ రోడ్ల మీద మీకు ఎదురౌతూనే ఉండాలి.అదే అంశం పైన విస్తృతంగా రచనలు చేసిన ఒక కథకుడిని భుజం తట్టి ప్రోత్సహిస్తే మీ విలువ పడి పోతుందా? మన చుట్టూ ఏమి జరుగుతుందో, కథకుల కన్నీటిఘోష కూడా ప్రజలకు తెలియాలి. రేపు మీ సినిమా చూస్తున్నప్పుడు నా ఈ అక్షరాలు అందరికీ గుర్తు రావాలి. ఇలాంటి సారూప్యం ఉన్న కథలు రాయలసీమ కథకులు ఎప్పుడో రాసేసారు అని లోకానికి తెలియాలి. అందుకే ఈ ప్రయత్నం. మీ సినిమా బాగారావాలి. మీరందరూ చల్లగా ఉండాలి. ఒకవేళ మీకు కరోనా వస్తే కూడా చెప్పండి …మా తెలుగు సాహిత్య కారుల ప్లాస్మా కూడా దానం చేస్తాం” అంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు.