‘మహానటి’ కీర్తి సురేష్ ను ఓటీటీ స్టార్ గా మార్చిన సినిమా ‘పెంగ్విన్’.కేవలం కరోనా కారణంగానే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఎమోషనల్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. కీర్తి సురేష్ ఉందన్న కారణంతోపాటు పబ్లిసిటీ కూడా తోడవడంతో ఈ సినిమా వల్ల అమెజాన్ ప్రైమ్ కు భారీగానే ఆదాయం తెచ్చినట్టు సమాచారం.
కథేంటి? : ఆరేళ్ల క్రితం కొడుకును పోగొట్టుకుంటుంది రిథమ్ (కీర్తి). ఆ జ్ఞాపకాలు ఆమెను వెంటాడుతూనే ఉంటాయి. భర్తతో (లింగా) విడిపోయి, మరొకరిని (రంగనాథ్) ఆమె పెళ్లి చేసుకుంటుంది. మళ్లీ ఏడు నెలల గర్భిణిగా ఉంటుంది. తన కొడుకు మిస్సయిన సరస్సు దగ్గర తన జ్ఞాపకాలు నెమరువేసుకుంటుంటుంది. అదేసమయంలో కనిపించకుండాపోయిన కొడుకు దొరుకుతాడు. అతను విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు. అతడిని ఎవరు తీసుకుపోయారు? ఎందుకు తీసుకెళ్లారు ? అనేది ఆమెకు అర్థంకాదు. ఇలాంటి థ్రిల్లింగ్ మిస్టరీలతో కథ సాగుతుంది.
ఎలా తీశారు? : ఈ తరహా సినిమాలకు మ్యూజిక్ అనేది చాలా కీలకం. అలాగే సినిమాటోగ్రఫీ కూడా. ఈ రెండింటి విషయంలో సినిమాకు న్యాయం జరిగింది. కథనం విషయంలోనే లోపం కనిపించింది. సినిమాలో బిగువు సడలడానికి కథనమే కారణం. ప్రథమార్థం వరకూ కథనం గ్రిప్పింగ్ గా సాగినా ఆ తర్వాత మాత్రం గతి తప్పింది. కథలో లాజిక్ మిస్సయిన అనుభూతి కలుగుతుంది. ఒక్క కీర్తి సురేష్ నటన తప్ప ఈ సినిమాలో చెప్పుకోతగ్గ అంశాలు లేవు.
లాభనష్టాల మాటేమిటి?: కరోనా కాలంలో సినిమాల కోసం మొహం మొత్తినవారికి ఇది కాలక్షపాన్ని ఇచ్చింది. 7.5 కోట్లకు అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాని సొంతం చేసుకుందట. ఆ తర్వాత ఆదాయాన్ని బట్టి షేర్ కూడా ఇస్తున్నట్లు సమాచారం. అలాగే అన్ని భాషలు కలిపి రూ. 6 కోట్లకు డీల్ జరిగిందని సమాచారం. మొత్తం 13.5 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. 9కోట్లకు పైగానే లాభాలు దక్కాయంటున్నారు. హిందీ హక్కులు కూడా కలిపితే నిర్మాతకు మరింత లాభాలు వచ్చినట్లే. ఓటీటీకి ఇవ్వడం వల్ల అటు అమెజాన్ తోపాటు ఇటు నిర్మాత కూడా లాభపడినట్లుగానే భావించాలి.
తారాగణం: కీర్తి సురేష్, లింగా, మదంపట్టి రంగరాజ్, మాస్టర్ అద్వైత్, మధి, నిత్య కృప తదితరులు
సాంకేతికవర్గం: సంగీతం: సంతోష్ నారాయణ్ , కూర్పు: అనిల్ క్రిష్, కెమెరా: కార్తీక్ పళని
బ్యానర్: స్టోన్ బెంచ్ ఫిలింస్, ప్యాషన్ స్టూడియోస్
నిర్మాతలు: కార్తీక్ సుబ్బరాజ్, కార్తికేయన్ సంతానం, సుధాన్ సుందరం, జయరాం
రచన, దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
ఎక్కడ చూడాలి: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఒక్క మాటలో: సెకండాఫ్ దెబ్బేసింది. ఒక్కసారి చూడొచ్చు.
రేటింగ్: 2.5/5
– పామర్తి హేమసుందర్