‘మహానటి’ చిత్రం నటిగా కీర్తి సురేష్ ను సింహాసనం ఎక్కించినా దాన్ని నిలుపుకోవడంలో మాత్రం ఆమె ఇప్పటిదాకా తప్పటడుగులు వేసింది. అసలు కారణం మాత్రం అందిరికీ తెలిసిందే. అదేంటంటే మహానటి వరకూ ఆమె ఎంతో అందంగా కనిపించింది. ముద్దుగా బొద్దుగా ఉన్న కీర్తి సన్నబడటానికి చేసిన ప్రయత్నం వికటించింది. ఆ తర్వాత వచ్చిన మిస్ ఇండియా చిత్రం మిస్ ఫైర్ అవ్వడానికి ప్రధాన కారణం ఆమె సన్నగా కనపించడమే కాక ఆమె మొహంలో ఉండే కళపోయింది.
అంతకుముందు ‘దేశముదురు’ చిత్రంలో హన్సిక కూడా అంతే. ఆ తర్వాత తెరమరుగైపోయింది హన్సక. కానీ కీర్తి విషయంలో అలా జరగలేదు. ఆమెకు అవకాశాలకు కొదవ లేదుగానీ హిట్లు మాత్రం రావడం లేదు. ఓటీటీలో విడుదలైన పెంగ్విన్ చిత్రం కూడా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత నితిన్ రంగ్ దే బసంతి కూడా అంతే. గుడ్ లక్ సఖి చిత్రం కూడా ఆమె బ్యాడ్ లక్ అనే చెప్పాలి. గత ఏడాది విడుదల కావలసిన ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఇదిగో ఓటీటీ వచ్చేసుంది.. అదిగో వచ్చే నెలలోనే విడుదల కాబోతోంది లాంటి వార్తలు చాలానే వచ్చాయిగానీ సినిమా విడుదల మాత్రం వెనక్కి వెళ్లిపోయింది.
ఒకవిధంగా చూస్తే మహానటి తర్వాత వచ్చిన లేడీ ఓరియంటెడ్ సినిమా ఏదీ సరిగా ఆడలేదు. ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న వార్త ఏమిటంటే రాబోయే మూడు సినిమాల్లో ఆమె చెల్లెల్లి పాత్రకే పరిమితమైపోయింది. దాదాపు అరడజను చిత్రాల్లో ఆమె నటిస్తుండగా అందులో మూడు సినిమాల్లో పెద్ద హీరోలకు చెల్లిలి పాత్రలో కనిపించబోతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కు చెల్లిగా అన్నాత్తే చిత్రంలో నటించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చే ‘భోళాశంకర్’ చిత్రంలో కూడా చిరంజీవికి చెల్లిగానే కీర్తి నటిస్తున్నట్టు సమాచారం.
సెల్వ రాఘవన్ నటుడిగా రూపొందిస్తున్న సానికాయిదమ్ చిత్రంలోనూ కీర్తిది చెల్లెలి పాత్రే అని చెబుతున్నారు. చెల్లి పాత్రల కోసం ఈమెకి ఇంత డిమాండు ఎందుకొచ్చిందో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మాత్రం ‘సర్కారువారి పాట’లో మంచి అవకాశాన్ని మాత్రం దక్కించుకుంది. నేను హీరోయిన్ గా మాత్రమే చేస్తాను అనుకోకుండా నటనకు అవకాశం ఉన్న ఎలాంటి పాత్రనైనా చేయడానికి ఆమె సిద్ధమని అర్థమవుతోంది. రాబోయే సినిమాల్లోనైనా ఆమె సన్నగా కాకుండా తనదైన అందచందాలతోనే అలరించాలని మాత్రం ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.











