ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ముగిశాయనే చెప్పాలి. అదే సమయంలో 2024 ఎన్నికలకు సంబంధించి త్వరలోనే తెర మీదకు వచ్చే కొత్త సమీకరణాలను కూడా ఈ ఎన్నికలు ముందుగానే చూపించేశాయి. అంతేకాకుండా కీలక మండలాల్లో విపక్ష టీడీపీ సత్తా చాటింది. ఇటు గుంటూరు జిల్లా పరిధిలోని మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలంలో అధికార వైసీపీకి టీడీపీ చుక్కలు చూపిస్తుండగా.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని కడియం మండలంలో ఏకంగా ఎంపీపీ పదవినే కైవసం చేసుకుంది. ఇక్కడ కేవలం నాలుగు స్థానాలను దక్కించుకున్న టీడీపీకి.. 8 స్థానాలు గెలుచుకున్న జనసేన మద్దతు పలకడంతో పాటుగా తానే స్వయంగా ఎంపీపీ పదవిని టీడీపీకి కట్టబెట్టిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.
కడియం రిజల్ట్ ఇదే
కడియం మండలంలో మొత్తం 22 ఎంపీటీసీ స్థానాలున్నాయి. నామినేషన్ల సమయంలోనే వైసీపీ, జనసేన ఒక్కో స్థానాన్ని ఏకగ్రీవంగా దక్కించుకున్నాయి. మిగిలిన 20 స్థానాలకు ఎన్నికలు జరగగా.. వైసీపీ, జనసేన 8 స్థానాల చొప్పున గెలుచుకోగా.. టీడీపీకి 4 స్థానాలు మాత్రమే దక్కాయి. ఈ క్రమంలో ఎంపీపీ స్థానం వైసీపీకి దక్కే ఛాన్సే లేకుండా పోయింది. అదే సమయంలో టీడీపీ, జనసేనలు ఎన్నికలకు ముందు నుంచే వ్యూహాత్మకంగా కలిసి సాగాయి. జనసేన బరిలో నిలిచిన స్థానాల్లో టీడీపీ మద్దతు పలికితే.. టీడీపీ బరిలో నిలిచిన చోట జనసేన మద్దతు పలికింది. రెండు పార్టీలు కలిసి వైసీపీకి చుక్కలు చూపాయి. అయితే ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు వైసీపీ రచించిన వ్యూహాన్ని జనసేన తిప్పికొట్టింది. తాను టీడీపీతోనే సాగుతానని తేల్చి చెప్పింది. అంతేకాకుండా కడియం జడ్పీటీసీని తాను గెలిచేలా సాయం చేసిన టీడీపీకే కడియం ఎంపీపీని ఇచ్చేస్తున్నట్లుగా జనసేన సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో కడియం ఎంపీపీగా టీడీపీ అభ్యర్థి సత్యప్రసాద్ ఎన్నికయినట్లుగా అధికారులు ప్రకటించారు.
2024లో టీడీపీ వెంటే జనసేన
జనసేన ప్రస్తుతం బీజేపీతో మిత్రపక్షంగా సాగుతున్నా.. ఆ రెండు పార్టీల మధ్య అంతగా సఖ్యత కనిపించడం లేదు. తిరుపతి పార్లమెంటుకు జరిగిన ఉప ఎన్నికల నాటి నుంచి ఇరు పార్టీల మధ్య మనస్పర్థలు మరింతగానే పెరిగాయని చెప్పాలి. ఇలాంటి క్రమంలో జనసేనాని బయటకు చెప్పకున్నా.. 2014 సార్వత్రిక ఎన్నికల మాదిరిగా.. 2024లోనూ టీడీపీతోనే జట్టు కట్టడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగానే జనసేనకు బలమున్న చోటల్లా బీజేపీతో కాకుండా టీడీపీతో పొత్తు పెట్టుకునే ఆ పార్టీ ముందుకు సాగుతోంది. ఇక కడియంలో టీడీపీ కంటే తన బలం రెట్టింపుగా ఉన్నా కూడా టీడీపీకే ఎంపీపీ పీఠాన్ని వదిలేసిన వైనం కూడా టీడీపీ, జనసేనల మధ్య బలం మరింతగా బలోపేతాన్ని సూచిస్తున్నదేనని చెప్పాలి. టీడీపీ వెంట జనసేన సాగితే.. 2024లో వైసీపీకి బ్యాండ్ బాజానేనన్న రీతిలో సరికొత్త విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- దుగ్గిరాల వైసీపీదేనా?.. టీడీపీ వదిలేస్తుందా?