వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. టీడీపీ నేతలే లక్ష్యంగా లెక్కలేనన్ని దాడులు జరిగాయి. ఆర్థికంగా బలోపేతంగా ఉన్న టీడీపీ నేతలను దెబ్బ కొట్టేందుకు జగన్ సర్కారు తనదైన శైలి వ్యూహాలను అమలు చేసింది. ఇందులో భాగంగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్న టీడీపీ నేతల క్వారీల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయన్న కారణాలను చూపి ఆయా కంపెనీలపై దాడులు చేయడంతో పాటు భారీ ఎత్తున జరిమానాలను విధించింది. అయితే తాము చేసిన వ్యాపారం విలువ కంటే కూడా జగన్ సర్కారు వేసిన ఫైన్లే ఎక్కువగా ఉన్న తీరుపై టీడీపీ నేతలు కోర్టులను ఆశ్రయించారు. తమ కంపెనీలపై దాడులు, జరిమానాల విధింపు మొత్తం రాజకీయ కక్షపూరితంగానే జరిగిందన్న వాదనలతో దాఖలైన ఈ పిటిషన్లకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం ఓ సంచలన తీర్పును వెలువరించింది.
గొట్టిపాటి టార్గెట్ ఎలా అయ్యారంటే..?
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టీడీపీ నేత గొట్టిపాటి రవికుమార్ కూడా గ్రానైట్ క్వారీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినా.. ఆ తర్వాత చంద్రబాబు పాలనకు ఆకర్షితులై టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో కూడా అద్దంకి నుంచే టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గొట్టిపాటి.. వైసీపీ వైపు బలంగా వీచిన గాలిని తట్టుకుని గెలిచి నిలిచారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కావడం, వైసీపీ గెలవడంతో.. టీడీపీలో బలంగా ఉన్న నేతలందరినీ జగన్ సర్కారు టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా టీడీపీకి చెందిన చాలా మంది గ్రానైట్ వ్యాపారులపై కన్నేసిన జగన్ సర్కారు.. గొట్టిపాటి క్వారీలను టార్గెట్ చేసింది. గొట్టిపాటి క్వారీలపై దాడులు చేసిన జగన్ సర్కారు.. గొట్టిపాటి కంపెనీ అక్రమ మైనింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలతో ఏకంగా రూ.50 కోట్ల మేర జరిమానాను విధించింది.
సుప్రీంలో ఊరట
ఈ జరిమానాపై ఆగ్రహం వ్యక్తం చేసిన గొట్టిపాటి కోర్టులను ఆశ్రయించారు. తొలుత హైకోర్టును ఆశ్రయించిన ఆయనకు సింగిల్ జడ్జి బెంచి ఊరట కల్పించగా.. డివిజన్ బెంచ్‌లో చుక్కెదురైంది. దీంతో గొట్టిపాటి నేరుగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం నాడు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది. గొట్టిపాటి గ్రానైట్ కంపెనీలో అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ కమిషన్ నివేదిక ఇవ్వగా, గ్రానైట్ కంపెనీ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. కమిషన్ సిఫారసు మేరకు గ్రానైట్ కంపెనీకి రూ.50 కోట్ల జరిమానా విధిస్తున్నట్టు షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై గొట్టిపాటి హైకోర్టును ఆశ్రయించగా, షోకాజ్ నోటీసులను సింగిల్ బెంచ్ కొట్టివేసింది. అయితే డివిజన్ బెంచ్ ఆ ఆదేశాలను పక్కనబెట్టింది. దాంతో గొట్టిపాటి రవికుమార్ హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తమ కంపెనీలో అవకతవకలు జరిగాయంటూ విజిలెన్స్ కమిషన్ సిఫారసు చట్టవిరుద్ధమని రవికుమార్ పేర్కొన్నారు. వాదనలు విన్న పిమ్మట ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసులను నిలుపుదల చేస్తున్నట్టు సుప్రీం ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. వెరసి జగన్ సర్కారు టీడీపీ నేతలకు చెందిన గ్రానైట్ కంపెనీలపై జరిపిన దాడులు, విధించిన జరిమానాలు సరికాదని తేలిపోయింది.