కల్వకుంట్ల తారకరామారావు.. తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి కార్యాధ్యక్షుడు. అంతేనా.. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గంలో కీలక శాఖలైన పురపాలక శాఖతో పాటు పరిశ్రమల శాఖ, ఐటీ శాఖల మంత్రి కూడా. అటు పార్టీలో నెంబర్ టూ పొజిషన్‌లో ఉన్న కేటీఆర్.. ఇటు ప్రభుత్వ పాలనలోనూ నెంబర్ టూగా ఉన్నట్లే లెక్క. ఎప్పటి నుంచి తన కుమారుడికి ఇటు పార్టీ పగ్గాలతో పాటు ప్రభుత్వ పగ్గాలు అప్పగించాలని కేసీఆర్ యత్నిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారు. కీలక శాఖల వ్యవహారాలను అప్పగించారు. అయినా గానీ.. కేసీఆర్‌కు ఎక్కడో ఓ మూల ఏదో అపశకునం కనిపిస్తున్నట్టే ఉంది. అందుకే.. ఎన్ని సార్లు అనుకున్నా గానీ.. పార్టీ పగ్గాలను గానీ, ప్రభుత్వ పగ్గాలను గానీ కేటీఆర్‌కు అప్పగించేందుకు కేసీఆర్ సాహసించడం లేదు. తాజాగా సోమవారం జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలోనూ ఇదే తరహాలో ఆలోచించిన కేసీఆర్.. గతంలో మాదిరిగానే కేటీఆర్‌కు అధికారాలను కట్టబెడుతూనే సర్వాధికారిగా మాత్రం ప్రకటించలేకపోయారు.
కేసీఆర్ లేకుంటే కేటీఆరేనట
టీఆర్ఎస్ 20 ఏళ్ల పండుగలో కేసీఆర్ చాలా అంశాలను ప్రస్తావించారు. పార్టీ పురోభివృద్ధిపై సుధీర్ఘంగానే మాట్లాడిన కేసీఆర్… తన రాజకీయ ప్రత్యర్థులపైనా విరుచుకుపడ్డారు. అదే సమయంలో రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్న కేంద్ర ఎన్నికల సంఘంపైనా నిప్పులు చెరిగారు. పొరుగు రాష్ట్రం ఏపీపైనా సెటైర్లు సంధించారు. ఇన్ని చేసినా.. తన కుమారుడి పట్టాభిషేకం విషయంలో మాత్రం కేసీఆర్ ధైర్యం చేయలేకపోయారనే చెప్పాలి. అయితే ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ ప్రతిపాదించి ఆమోదించిన తీర్మానాల్లో ఓ తీర్మానం మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అదేంటంటే.. పార్టీ అధ్యక్షుడు అందుబాటులో లేని సమయంలో కార్యాధ్యక్షుడు ఎంతటి కీలక నిర్ణయాలైనా తీసుకోవచ్చుననేదే ఆ తీర్మానం సారాంశం. అయినా కార్యాధ్యక్షుడు అంటే.. అధ్యక్షుడు అందుబాటులో లేనప్పుడు అన్నీ తానై నడిపించేవాడే కదా. మరి కొత్తగా ఇప్పుడు ప్రెసిడెంట్ లేనప్పుడు వర్కింగ్ ప్రెసిడెంటే అన్ని నిర్ణయాలు తీసుకోవచ్చని ప్రతిపాదించడమెందుకు? నిజమే.. ఈ దిశగానే ఇప్పుడు సరికొత్త చర్చకు తెర లేసింది. ఇప్పటికే ప్రభుత్వంలో పలు కీలక నిర్ణయాలన్నింటినీ కేటీఆరే తీసుకుంటున్నారు. పార్టీకి సంబంధించి కూడా కేటీఆర్ అన్నీ తానై నడిపిస్తున్నారు. కీలక సమయాల్లో మాత్రమే కేసీఆర్ తెర ముందుకు వస్తున్నారు. మరి అలాంటప్పుడు కేసీఆర్ తన మనసులో ఉన్నట్లుగా కుమారుడికి పగ్గాలు అప్పగిస్తే సరిపోతుంది కదా అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
కేసీఆర్ భయపడుతున్నారా?
ప్లీనరీలో భాగంగా అధ్యక్షుడు అందుబాటులో లేనప్పుడు కార్యాధ్యక్షుడే అన్ని నిర్ణయాలు తీసుకోవచ్చంటూ ఓ తీర్మానం చేయడం ద్వారా.. పార్టీ పగ్గాలను గానీ, పాలనా పగ్గాలను గానీ కేటీఆర్‌కు పూర్తిగా అప్పగించే విషయంలో కేసీఆర్ భయపడుతున్నారన్న వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. కేటీఆర్‌ను సీఎంను చేసినా.. లేదంటే పార్టీ అధ్యక్షుడిని చేసినా.. పార్టీ చీలిపోతుందన్న కోణంలో కేసీఆర్ భయపడుతున్నారంటూ చాలా కాలం నుంచి విశ్లేషణలు సాగుతున్న సంగతి తెలిసిందే. పార్టీకి ఆది నుంచి వెన్నుదన్నుగా నిలిచిన మంత్రి హరీశ్ రావును పక్కనపెట్టేసి.. కేటీఆర్‌కు అన్నీ అప్పగిస్తే.. పార్టీ రెండు ముక్కలు కానుందన్న ఆ విశ్లేషణలు నిజమేనన్నట్లుగా కేసీఆర్ వ్యవహారం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా పార్టీ 20 ఏళ్ల పండుగ వేదికపైనా కేసీఆర్ తన మనసులో ఉన్న దాని ప్రకారం నడుచుకోలేకుండా.. ఇంకా దాగుడుమూతల మంత్రాంగాన్నే ఆశ్రయించారన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.