ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీ. ఇక్క ఛాన్సు ఇచ్చి చూడండి. అంటూ 2019 ఎన్నికల్లో అనూహ్య మెజారిటీ సాధించిన వైసీపీ ప్రభుత్వం అవినీతి తిమింగలాలను వదిలేసి, చిన్నవారిపై చర్యలు తీసుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వారిపై కనీసం విచారణ కూడా జరపడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయినా వైసీపీ పెద్దలకు అవేమీ కనిపించవు. ఎవరైనా చోటా నేతలు తప్పు చేస్తూ దొరికితే మాత్రం వారితో రాజీనామా చేయిస్తున్నారు. అదే పెద్దలపై చర్యలు తీసుకోవాల్సి వస్తే మాత్రం ఏమీ ఎరగనట్టు నటిస్తున్నారు.
ఎమ్మెల్యే శ్రీదేవికి ఇంకో న్యాయమా?
తన వద్ద కోటి 40 లక్షలు తీసుకుని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎగవేతకు పాల్పడిందని వైసీపీ పార్టీ నేత, గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ రవికుమార్ ఆడియో, వీడియో విడుదల చేసి సాక్ష్యాలతో సహా అవినీతిని బట్టబయలు చేశారు.
అయినా సదరు వైసీపీ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు ఉండవు. ఆరోపణలు చేసింది ప్రతిపక్షం అయితే అనుకోవచ్చు. సొంత పార్టీ నేతలే తాడికొండ ఎమ్మెల్యే బండారం బయటపెట్టారు. అయినా వైసీపీ పెద్దలకు వారి అవినీతి కనిపించదు, వినిపించదు. నేను విన్నాను, నేను ఉన్నాను. అని భరోసా ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి అవినీతి అనకొండలను వెనుకోసుకు వస్తున్నారని అర్థం అవుతోంది.
తాడికొండ ఎమ్మెల్యే సీఐ ని నానా దుర్భాషలాడితే.. స్పష్టంగా ఆడియో రికార్డు దొరికితే.. అందులో.. ఆమె ఇసుక మాఫియాకు స్వయంగా నాయకత్వం వహిస్తున్న స్థాయిలో ఆధారం దొరికినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు.
దుర్గగుడి సభ్యురాలు వరలక్ష్మి రాజీనామా?
విజయవాడ దుర్గగుడి పాలకమండలి సభ్యురాలికి చెందిన కారులో తెలంగాణ నుంచి ఏపీకి తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. దీనిపై మీడియాలో వచ్చిన కథనాలు వైసీపీ నేతల పరువు తీశాయి. వైసీపీ పెద్దలు సదరు సభ్యురాలిని రాజీనామా చేయించాలని దుర్గగుడి ఛైర్మన్ సోమినాయుడును ఆదేశించారట. అడిగిందే తడవుగా ఆమెపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించారని తెలుస్తోంది.
జరిగిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ పాలకమండలి సభ్యురాలు రాజీనామా లేఖ పంపిందని, దాన్ని ఆమోదించామని సోమినాయుడు మీడియాకు తెలిపారు. పదవుల్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఆరోపణలు రావొచ్చు. కోర్టులో కేసు రుజువయ్యే వరకు రాజీనామాను ఆమోదించాలని వరలక్ష్మి కోరారని సోమినాయుడు భాష్యం చెప్పారు. జగన్ ప్రభుత్వంలో ఎవరిపట్లనైనా ఇదే నీతి ఉంటుందన్నారు.
జగన్ ప్రభుత్వంలో అవినీతికి తావులేదా?
జగన్ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని వైసీపీ నేతలు తొడలు కొడుతున్నారు. కానీ పేదలకు సెంటుభూమి వ్యవహారంలో కాకినాడ, రాజమండ్రి, కావలిలో వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. అయినా వారిపై విచారణకు కూడా ఆదేశించలేదు. 108 అంబులెన్సులను టెండర్లు లేకుండా అయిన వారికి కట్టబెట్టి ప్రభుత్వానికి రూ.330 కోట్ల భారం పెంచారని ప్రతిపక్షం సాక్ష్యాలతో ఆరోపించినా దానిపై నోరు మెదపరు. తమిళనాడు బోర్డర్ లో రూ.5 కోట్లు వైసీపీ మంత్రికి చెందిన కారులో దొరికితే డబ్బు నాది కాదు. కారు మాత్రమే నాది అన్నా… దానిపై కనీసం విచారణ ఉండదు. ఇక తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అవినీతిపై, సొంతపార్టీ నేతలు ఆధారాలతో బయటపెట్టినా వారిపై చర్యలు తీసుకోరు. మంత్రి జయరాం బెంజికారు లంచంగా పుచ్చుకుని కొడుకుకు కానుకగా ఇస్తే దాన్ని గురించి పట్టించుకున్న దిక్కు లేదు. అంటే ఏపీలో పెద్దలకు ఒక న్యాయం. చిన్నవారికి మరో న్యాయం అమలవుతోందని అర్థం చేసుకోవచ్చు.
పేదల సెంటు భూమిలో రూ.4000 కోట్ల అవినీతి
పేదలకు సెంటు భూమి పేరుతో వైసీపీ పెద్దలు ప్రభుత్వ నిధులు కొల్లగొట్టారు. మార్కెట్లో ఉన్న ధర కన్నా 300 శాతం అధిక ధరలు చెల్లించి భూములు కొనుగోలు చేశారు. ముంపు భూములు, ఆవ భూములు కొనుగోలు చేసి అయిన వారు కొట్లాది రూపాయలు దండుకునేలా సహకరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం కనీసం విచారణకు కూడా ఆదేశించలేదు.
ఎందుకంటే ఈ భూ కుంభకోణాల్లో ఉన్నది ఎమ్మెల్యేలు కాబట్టి. విశాఖలో ఓ వైసీపీ నేత విజయసాయిరెడ్డి పేరు చెప్పి భూదందాలు నడుపుతుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అంతవరకూ బాగానే ఉంది. దందాలు చేసినా, అవినీతి చేసినా మేమే చేయాలి. అన్న చందంగా ఉంది వైసీపీ నేతల తీరు. అవినీతి అనకొండలకు అండగా నిలిచి, చిన్న చేపలను బలిస్తే ఉపయోగం ఉండదు. ప్రజలు అంతా గమనిస్తూనే ఉంటారని వైసీపీ నేతలు ఇప్పటికైనా గ్రహించాలి.