ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మంత్రులకు మార్కులు వేయనున్నారు. ఈ మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించి వారి పని తీరుపై ఓ అంచనాకు రానున్నారు. గురువారం నాడు జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఒకరిద్దరు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక ముందు ముందు మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు చెబుతున్నారు.
కొన్ని మీడియా సంస్థలు తనపైనా, ప్రభుత్వంపైనా రాస్తున్న కథనాలకు మంత్రులు ఇస్తున్న లీకులు కూడా ఓ కారణంగా భావించిన ముఖ్యమంత్రి అలాంటి వారిని అదుపులో ఉంచేందుకు ఈ మార్కులు, ర్యాంకుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకువచ్చారని అంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే మంత్రివర్గాన్ని రెండున్నర ఏళ్లకు ప్రక్షాళన చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మొదటి ఆరు నెలలు మంత్రులు వారి వారి శాఖలపై పట్టు పెంచుకునేందుకు సమయం ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ తర్వాత నుంచి వారి పనితీరుపై అధికారులతో సమీక్షలు చేయిస్తున్నారు.
మంత్రివర్గంలో ఒకరిద్దరు మినహా మిగిలిన వారి పట్ల సంతృప్తిగానే ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గంలో తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరిని రాజ్యసభకు పంపడంతో వారి స్థానంలో మరో ఇద్దరికి మంత్రులుగా అవకాశం కల్పించారు. వారిద్దరూ మినహా మిగిలిన వారి పనితీరుపై ముఖ్యమంత్రి క్షేత్రస్ధాయి నుంచే సమీక్షలు జరిపి మార్కులు ఇవ్వనున్నారు. దీని ఆధారంగానే ర్యాంకులు కేటాయిస్తారని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మిగిలిన ఏడాదిలో మంత్రులు వారి పనితీరును మెరుగుపరుచుకునేందుకు అవకాశం కల్పించినట్లు అవుతుందనేది సీఎం అభిప్రాయంగా చెబుతున్నారు.
మంత్రులే కీలకం…
తన మంత్రివర్గంలో ఉన్న వారు చాలా కీలకమని మంత్రులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పాలన సాగిస్తున్నామని, ఇలాంటి సమయంలో తనతో పాటు మంత్రులు కూడా కష్టపడితే భవిష్యత్ లో మంచి ఫలితాలు వస్తాయన్నది సీఎం ఆలోచనగా చెబుతున్నారు. మీడియాతో జాగ్రత్తగా ఉండాలనే పదే పదే చెబుతున్న సీఎం కొందరు మంత్రులు వారికే లీకులు ఇవ్వడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారంటున్నారు. హోమంత్రి, సమాచార శాఖతో పాటు మరికొందరి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రిపైనా, రాయలసీమకు చెందిన మరో మంత్రిపైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
మంత్రి బెర్త్ కోసం ఎమ్మెల్యేలు తపన
ప్రస్తుత మంత్రివర్గాన్ని మార్చే అవకాశాలు ఇప్పట్లో లేకపోయినా ఏడాది తర్వాత జరిగే మార్పుల్లో తమకు అవకాశం వచ్చేందుకు ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా సీఎం పేషీలోని అధికార యంత్రాంగంతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు తాము దగ్గరయ్యామని, వారికి నిరంతరం అందుబాటులో ఉన్నామనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ విషయంలో జిల్లాల వారీగా పోటీలు పడీ మరీ ఎమ్మెల్యేలు పని చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది.