ముంబయిపై దుమారాన్ని లేవదీసి నటిగా కంగన రనౌట్ అవుతుందేమో అనిపిస్తోంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ లో నటి కంగనా రనౌత్ అదరి దుమ్మూ దులిపేస్తోంది. కాకపోతే ఆమె బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకంపైన చేసిన ఆరోపణలు చాలామంది మనోభావాలను దెబ్బతీశాయి. అంతేకాకుండా ఈరోజు ఆమె ముంబయి పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. ముంబయి పాక్ ఆక్రమిత కాశ్మీరా అని ఆమె ప్రశ్నించడం పెద్ద వివాదాన్నే లేవదీసింది.
బాలీవుడ్ లో 99 శాతంమంది డ్రగ్స్ వాడతారని ప్రకటించడమే కాకుండా వాళ్ల వ్యక్తిగత జీవితంలోకి కూడా తొంగిచూసింది. రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌశల్ డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలనడం వాళ్ల కోపానికి కారణమైంది. `రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, విక్కీ కౌశల్ డ్రగ్ టెస్ట్ కోసం బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని కూడా కోరింది. పైగా ఇలా ట్వీట్ చేస్తూ పీఎం కార్యాలయాన్ని కూడా ట్యాగ్ చేసింది. ఈ డ్రగ్స్ గోల ఇలా ఉంటే ముంబయిపై చేసిన తాజా వ్యాఖ్యలపై బాలీవుడ్ అంతా ఆమెకు వ్యతిరేకంగా మారింది.
ముంబయి పోలీసుల తీరుపై ఆమె ఆరోపణలు గుపించడంతో మహారాష్ర్ట ప్రభుత్వం కూడా ఆమెపై మాటల దాడికి దిగింది. ముంబయి పోలీసులపై తనకు నమ్మకం పోయిందని, ప్రజలకు వారు భద్రత ఇవ్వలేరని ఆరోపించింది. పైగా ముంబై పోలీస్ కమిషనర్ పరబ్ బీర్ సింగ్ వ్యవహారశైలిని కూడా అనుమానించింది. కంగన వ్యాఖ్యలపై మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ ‘ముంబై పోలీసుల పనితీరు స్కాట్‌లాండ్ పోలీసులకు ఏమాత్రం తీసిపోదు. దేశంలోనే ఉత్తమ సేవలందిస్తున్న పోలీసుల్లో మా పోలీసులు ఒకరు’ అన్నారు.
ఒకవేళ ముంబైలో గానీ, మహారాష్ట్రలో గానీ ఆ నటికి భద్రత లేదనుకుంటే ఆమెకు ముంబైలో ఉండే హక్కు కూడా లేదన్నారు. దీంతో కంగన కూడా ఏమీ తగ్గలేదు. సెప్టెంబర్ 9వ తేదీన తాను ముంబైకి వస్తున్నానని, ఎవరికైనా దమ్ముంటే ఆపవచ్చని సవాలు విసిరారు. కంగన వ్యాఖ్యలపై చాలా మంది నటులు స్పందించారు. ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మారిన సోనూ సూద్ కూడా ఆమె వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘ఈ నగరం తలరాతను మారుస్తుంది… నమస్కారం చేస్తే పురస్కారమే లభిస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ముంబయి భారతదేశంలోనే ఉందని రితేష్ దేశ్ ముఖ్ అన్నారు. ముంబయి లక్షలాదిమందికి తిండి పెట్టిందని, కృతజ్ఞత లేనివారే పీవోకేతో పోలుస్తారని నటి ఊర్మిళా మతోంద్కర్ వ్యాఖ్యానించింది. దియామీర్జా, రేణుకా సహానీ లాంటి వారంతా కంగన వ్యాఖ్యలను తప్పుబట్టారు.