ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2009-2014 మధ్య కాలంలో హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన నౌషాద్ ఆలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిణామాలపై ఖిన్నులౌతున్నారు. జగన్మోహన్ రెడ్డిగానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గానీ.. న్యాయవ్యవస్థపై చేస్తున్న దాడి గురించి ఆయన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏకంగా 12 పేజీల లేఖ రాశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు చేస్తున్న వ్యాఖ్యల నుంచి ఏకంగా ముఖ్యమంత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను అందులో ప్రస్తావించారు. ఈ పరిణామాలు ఎలాంటి పర్యవసానాలకు దారితీయబోతున్నాయో ఆయన తన ఆందోళనను లేఖలో వ్యక్తపరిచారు.
మాజీ హైకోర్టు న్యాయమూర్తి నౌషాద్ ఆలీ రాసిన లేఖలోని కీలక అంశాలు ఇలా ఉన్నాయి.
‘‘ఆంధ్రప్రదేశ్య హైకోర్టు మీద దాదాపుగా ప్రతిరోజూ విమర్శల దాడి జరుగుతోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు, మంత్రులు, శాసనసభ స్పీకరు, ప్రభుత్వ సలహాదారులు అందరూ కూడా.. విమర్శలు చేస్తున్నారు. వీరందరూ కూడా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డిని సంతోషపరచడానికే న్యాయవ్యవస్థమై దాడి చేస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే సాక్షి టీవీలోని కథనాలు, సాక్షి పత్రికలోని కథనాలు చూసిన తర్వాత.. ఇవన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మార్గదర్శకత్వంలోనే తయారైనట్లు అనిపిస్తోంది.
ముఖ్యమంత్రి హైకోర్టు న్యాయమూర్తులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు. ఇన్నాళ్లుగా పార్టీ వాళ్లు చేస్తున్న ఆరోపణలను బలపరుస్తున్నట్టుగానే ఆ లేఖ ఉంది. ఆ లేఖలోని అంశాలను ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయకల్లం ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించి, లేఖను బయటపెట్టడాన్ని కూడా ఆయన అభ్యంతరపెట్టారు. ఈ లేఖ సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా సర్కులేట్ అయిందని, తనకు కూడా ఒక కాపీ వచ్చిందని నౌషాద్ ఆలీ తెలిపారు.
అవినీతికి మద్దతిచ్చేలా తీర్పులు ఉంటున్నాయని, చంద్రబాబునాయుడు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నుంచి ఇంటిస్థలాలు తీసుకున్న 13 మంది న్యాయమూర్తులను ఆ పదవుల్లోంచి తొలగించి.. ప్రజలకు సరైన సంకేతాలు పంపాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేయడాన్ని కూడా.. నౌషాద్ ఆలీ తప్పుపట్టారు. ఆయన ఇంకా అనేక సాక్షి కథనాలను కూడా తన లేఖలో ప్రస్తావించారు. 151 మంది ఎమ్మెల్యేల బలంతో.. ప్రజలు జగన్ కు అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారు గనుక న్యాయస్థానాలు కూడా జగన్ ను సర్వోన్నతుడిగా అంగీకరించి తీరాలని అర్థం వచ్చేలా వ్యాఖ్యలను కూడా ఆయన ఉదాహరించారు.
పార్టీ వారందరూ చేసిన వ్యాఖ్యలని తన లేఖలో కూడా ప్రస్తావించిన జగన్మోహన్ రెడ్డి.. అదనంగా చేసిన వ్యాఖ్యల్ని కూడా ఆలీ వివరించారు. రాజ్యాంగం ప్రసాదించిన అధికారాల్ని కాపాడ్డంలో మూలస్తంభాలైన మూడు వ్యవస్థలు ఒకదానిపై ఒకటి చెక్ పాయింట్ గా వ్యవహరించాలనంటూ జగన్ రాసిన వాక్యాల్ని ఆయన తప్పుపట్టారు. న్యాయవ్యవస్థను చెక్ చేయడానికి ముఖ్యమంత్రికి అధికారం ఉంటుందనే అర్థం వచ్చేలా ఆ వాక్యాలు ఉన్నాయన్నారు. తన అభిప్రాయం ప్రకారం ఈ విధంగా లేఖరాసిన ముఖ్యమంత్రి జగన్ భ్రమల్లో ఉన్నట్లుగా అనిపిస్తోందని నౌషాద్ ఆలీ పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులను అవమానించడం ద్వారా.. తన మీద పెండింగ్ లో ఉన్న కేసుల విషయంలో అనుచిత ప్రయోజనాలు పొందే ఉద్దేశంతోనే జగన్ ఇలా చేస్తున్నట్లు అనిపిస్తోందని కూడా ఆలీ స్పష్టంగా తన లేఖలో పేర్కొన్నారు. సాక్షిలో ప్రచురించిన కథనాలు.. న్యాయవ్యవస్థకు తీరని కళంకం తెస్తున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. న్యాయమూర్తులు ఇలాంటి దుష్ప్రచారాన్ని దాడులను సమర్థంగా ఎదుర్కొనే స్థైర్యం కలిగి ఉండాలని అంటూనే.. సుప్రీం కోర్టు ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ నౌషాద్ ఆలీ రాసిన లేఖ పూర్తిపాఠం చూడండి :