మనం ఆరోగ్యంగా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంది. కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరువాత చేతుల శుభ్రత అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరైంది. చేతులు ఎప్పటికప్పుడు కడుక్కోకపోతే ఏమవుతుందో కూడా ఈపాటికే అందరికీ తెలిసిపోయింది. అందరూ చేతులు శుభ్రం చేసుకుంటారు.. కానీ సరైనా పద్ధతుల్లో చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పటికి కూడా చాలా మందికి తెలియదు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రలో ప్రివెన్షన్ తెలిపిన దాని ప్రకారం చేతులు శుభ్రం చేసుకునేటప్పుడు కొన్ని హ్యాండ్ వాషింగ్ టెక్నీక్స్‌ను పాటించాలని తెలిపింది.
చేతులు ఇలా శుభ్రం చేసుకోవాలి..
చేతులు శుభ్రం చేసుకునేటప్పుడు చేతులను శుభ్రమైన రన్నింగ్ వాటర్‌లో కడుక్కోవాల్సి ఉంటుంది. తగినంత సోప్‌ను తీసుకుని చేతులను బాగా రుద్దుకోవాలి. చేతులను వెనుక, ముందు భాగాల్లో, వేళ్లు, గోర్ల మధ్యలో రుద్దుతూ కడుక్కోవాలి. కచ్చితంగా 20 సెకండ్లపాటు చేతులను రుద్దు కోవాలి. అలా రుద్దుకున్న రెండు చేతులను రన్నింగ్ వాటర్ కింద బాగా కడుక్కోవాలి. ఆ తరువాత శుభ్రమైన టవల్ లేదా హెయిర్ డ్రయర్‌ని వాడి చేతులను తుడుచుకోవాలి.
మరింత అవగాహన అవసరం..
కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ వ్యాప్తి కూడా చేతులను తరచూ శుభ్రం చేసుకోకపోవడంతోటే వ్యాప్తి చెందుతోంది. తుమ్మినా, దగ్గినా చేతులను అడ్డంపెట్టుకున్న తరువాత, ఏవైనా వస్తువులను తాకినప్పుడు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుంది. చేతుల శుభ్రత విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తునే ఉన్నాయి. దీనిపై మరింత అవగాహనను ప్రజలకు కల్పించాల్సి ఉంటుంది.
శుభ్రతతోనే రోగాల నుండి విముక్తి…
అపరిశుభ్ర చేతులతో కరచాలనం చేయడం, తాకడం ద్వారా కరోనా, స్వైన్‌ఫ్లూ, కంటి జబ్బులు, చర్మవ్యాధులు, కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. అలాగే 20 శాతం నిమోనియా వ్యాధులు, 17 శాతం నీళ్ల విరేచనాలు సోకుతున్నాయి. నిత్యం హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల వ్యాధికారక క్రీములు తొలగిపోయి ఆరోగ్యంతో ఉండొచ్చు. వాష్‌రూమ్‌కి వెళ్లొచ్చిన తరువాత, వెళ్లే ముందు, భోజనానికి ముందు, తరువాత, కూరగాయలు కట్‌చేసేటప్పుడు, చేసిన తరువాత ఇలా ప్రతీ సారి చేతులను శుభ్రంగా వాష్ చేసుకుంటే రోగాల బారిన పడే అవకాశం లేకుండా పోతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కాలకృత్యాలు ముగించిన తరువాత సగటున దేశంలో కరోనాకంటే ముందు 34 శాతం మంది మాత్రమే సబ్బు నీళ్లతో చేతులను కడుక్కుంటున్నారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో అప్పటికి ఇప్పటికి చేతులు శుభ్రం చేసుకుంటున్న వారి సంఖ్య బాగానే పెరిగింది. చేతులు శుభ్రం చేసుకోవడం ఇప్పుడు అందరికీ తప్పనిసరైంది.
చిన్నారుల విషయంలో జాగ్రత్త..
రోజుకు వీలయినన్ని ఎక్కువ సార్లు(5 సార్ల కంటే ఎక్కువ) చేతులు శుభ్రం చేసుకోవాలి. చిన్నారుల విషయంలో చాలా జాగ్రత్తలను తల్లిదండ్రులు తీసుకోవాలి. ఆటలపైనే వారి దృష్టంతా ఉంటుంది. ఆటలు ఆడిన తరువాత చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తుంటారు. అలాంటి వారికి శుభ్రత గురించి చెప్పాలి. చేతులను శుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకున్నట్లేనని వైద్యులు చెబుతున్నారు.











