ఏపీలో విద్యుత్ వినియోగానికి సంబంధించి సర్దుబాటు చార్జీల పేరిట అదనపు చార్జీలను వసూలు చేస్తున్న కూటమి సర్కారు చర్యలను నిరసిస్తూ… గురువారం విపక్ష వైసీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు రోడ్డెక్కారు. ఫలితంగా వైసీపీ నిరసనలు మరీ అంతగా విఫలం కాలేదన్న మాట అయితే వినిపించలేదు. ఎన్నికల తర్వాత వైసీపీని వీడిన నేతలు మినహా.. పార్టీలో ఉన్న దాదాపుగా నేతలంతా ఈ నిరసనల్లో పాలుపంచుకున్నారు. అయితే రెండు కీలక నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీ నిరసనలు కనిపించలేదు. ఆ నియోజకవర్గాల నుంచి వైసీపీ తరఫున యోధులుగా ప్రచారం చేసుకున్న ఇద్దరు కీలక నేతల అడ్రెస్సే కనిపించలేదు.
ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసనలు హోరెత్తితే… ఆ రెండు నియోజకవర్గాల్లో చప్పుడుందుకు వినిపించలేదు?… అసలు ఈ నిరసనల్లో కనిపించకుండాపోయిన నేతలు ఎవరు అన్న విషయానికి వస్తే… రాష్ట్రంలోనే కీలక నియోజకవర్గాలుగా భావిస్తున్న గుడివాడ, గన్నవరంలలో వైసీపీ నిరసనలు పెద్దగా కనిపించలేదు. ఈ నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ లు ఈ నిరసనల్లో కనిపించను కూడా కనిపించలేదు.
2019లో వైసీపీ అధికారంలోకి రాగానే.. కొడాలి నానికి జగన్ అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. తన కేబినెట్ లోకి నానిని తీసుకున్న జగన్… ఆయనకు కీలకమైన పౌర సరఫరాల శాఖను ఇచ్చారు. అంతేకాకుండా నాడు విపక్షంగా ఉన్న టీడీపీ నుంచి… ప్రత్యేకించి చంద్రబాబు, నారా లోకేశ్ వర్గాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే బాధ్యతలను కూడా నానికే జగన్ అప్పగించారు. దీంతో రెచ్చిపోయిన నాని… తన నోటికి అదుపే లేదన్నట్లుగా వ్యవహరించారు. నోరు తెరిస్తే బూతులనే పలికిన నాని… టీడీపీలోని దాదాపుగా అందరూ నేతలకు కంటగింపుగా మారిపోయారు. ఫలితంగా బూతుల మంత్రి అంటూ నాని అపఖ్యాతి మూటగట్టుకున్నారు.
ఇక 2918 ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనాన్ని తట్టుకుని గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాదించిన వంశీ… ఆ తర్వాత నానితో స్నేహాన్ని మరింతగా విస్తరించుకుని జగన్ కు దగ్గరయ్యారు. అయితే వంశీకి జగన్ పదవి అయితే ఇవ్వలేదు గానీ,… ఆయన అడిగిన ప్రతి పనినీ చేసి పెట్టారు. ఫలితంగా నాని మాదిరే వంశీ కూడా చంద్రబాబు, లోకేశ్ లను టార్గెట్ చేసుకుని ఓ రేంజిలో రెచ్చిపోయారు.
అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి గుడివాడలో నాని, గన్నవరంలో వంశీ అరాచకాలపై అక్కడి జనం తిరబడిపోయారు. ఎన్నికల్లో ఈ ఇద్దరిని వారి జనమే ఓడించేశారు. అదే సమయంలో నాని, వంశీలు టార్గెట్ చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చేసింది. వీరిద్దరూ వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన చంద్రబాబు సీఎంగా, లోకేశ్ కీలక శాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో వైసీపీ జమానాలో స్వైర విహారం చేసిన వారిపై వరుసగా కేసులు నమోదు అయిపోతున్నాయి.
ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన నాని, వంశీలు తమ నియోజకవర్గాలను వదిలేసి పారిపోయారు. ఎక్కడో హైదరాబాద్ లో తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి సమయంలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా ఆందోళనలకు జగన్ పిలుపు ఇవ్వగా… వారిద్దరూ కనీసం తమ అనుచరులతో అయినా నిరసనలను చేపట్టేందుకు సాహసించలేదు. ఎక్కడ నిరసనలు నిర్వహిస్తే.. ఎక్కడ తమ కొంపలు మునుగుతాయోనన్న భయంతోనే వారు ఇలా వ్యవహరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.