మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. ఈ కేసులో దోషులు ఎవరన్న విషయం స్వయంగా వివేకా సోదరుడి కుమారుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసునంటూ ఇదివరకే విపక్ష టీడీపీ నేతలు సంచలన ప్రకటనలు చేశారు. ఈ ప్రకటనలు నిజమేనన్నట్లుగా ఈ కేసులో సీబీఐ అధికారులు తొలి నిందితుడిగా అరెస్ట్ చేసిన సునీల్ కుమార్ యాదవ్ కుటుంబం కూడా దోషులెవరన్న విషయం జగన్ కు తెలుసునంటూ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు సోమవారం నాడు జగన్ సొంతూరు పులివెందులలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కుటుంబం సంచలన ప్రకటన చేసింది. ఈ కేసులో ఏ పాపం తెలియని తమ కుమారుడు సునీల్ ను.. సీబీఐ అధికారులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని, ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేకున్నా.. వివేకాను తానే చంపానట్లుగా ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆ కుటుంబం తీవ్ర స్థాయి ఆరోపణలు గుప్పించింది.
సీబీఐ కస్టడీలో సునీల్
ఈ కేసు దర్యాప్తును చేపట్టిన నాటి నుంచి సీబీఐ అధికారులు.. వైసీపీలో క్రియాశీల కార్యకర్తగా కొనసాగుతున్న సునీల్ కుమార్ యాదవ్ ను ప్రశ్నిస్తూనే ఉంది. అంతేకాకుండా అతడి సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్, తండ్రి కృష్ణయ్య యాదవ్ లను కూడా సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. చివరకు సునీల్ తల్లి సావిత్రమ్మను కూడా సీబీఐ పలుమార్లు విచారించింది. మొత్తంగా సునీల్ ఫ్యామిలీ మొత్తం కూడా సీబీఐ విచారణకు హాజరైందనే చెప్పాలి. ఇటీవలే సునీల్ ను అరెస్ట్ చేసిన సీబీఐ అతడిని కోర్టులో హాజరుపరచింది. కొన్ని రోజుల తర్వాత తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసి.. కోర్టు ఆదేశాలతో అతడిని 10 రోజుల కస్టడీకి తీసుకుంది. ప్రస్తుతం సునీల్ సీబీఐ కస్టడీలోనే ఉన్నాడు. సునీల్ ను కస్టడీలోకి తీసుకోగానే.. వివేకా హత్యకు వినియోగించినట్లుగా భావిస్తున్న ఆయుధాలను పులివెందుల సమీపంలోని ఓ వంకలో దాచారన్న సమాచారంతో ప్రస్తుతం అక్కడ సీబీఐ గాలింపు చేపట్టింది. సునీల్ ను కస్టడీకి తీసుకునేదాకా అతడి కుటుంబ సభ్యుల్లో ఎవరినో ఒకరిని విచారణకు పిలుస్తూనే ఉన్న సీబీఐ.. అతడిని కస్టడీలోకి తీసుకోగానే వారిని పిలవడం మానేసింది. ఈ నేపథ్యంలోనే జగన్ సొంతూరులోని సునీల్ ఇంటిలో సోమవారం అతడి తల్లిదండ్రులు, సోదరుడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కలకలం రేపారు.
సునీల్ ఫ్యామిలీ వాదన ఏంటంటే..?
ఈ సందర్భంగా సునీల్ కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. వివేకాను హత్య చేసిన వారెవరన్న విషయం జగన్ కు తెలుసునని వారు ప్రకటించారు. ఈ కేసులో సునీల్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయినా వివేకాను హత్య చేసింది తానేనని ఒప్పుకోవాలంటూ సునీల్ ను సీబీఐ అధికారులు చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. తనను విచారణ పేరిట పిలిచి బట్టలూడదీసి మరీ చిత్రహింసలకు గురి చేశారని కృష్ణయ్య ఆరోపించారు. రెండు నెలలుగా తమ కుటుంబంపై సీబీఐ కొనసాగిస్తున్న చిత్రహింసలను తట్టుకోలేక సామూహిక ఆత్మహత్యకు పాల్పడదామనే గోవాకు పారిపోయామని, అయితే తాము ఆత్మహత్య చేసుకుంటే.. నింద తమపైనే పడుతుందన్న భావనతో తిరిగి వచ్చామని చెప్పారు. ఇక విచారణలో తనను సీబీఐ అధికారులు చాలా ప్రశ్నలు అడిగారని, అవేవీ బయటకు చెప్పుకునే విషయాలు కాదని, సీబీఐ అధికారులు మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని సునీల్ తల్లి సావిత్రమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మహిళ అని కూడా చూడకుండా తనను అడగరాని ప్రశ్నలు అడిగారని కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సొంతూరు పులివెందులకు చెందిన తమకే ఇంత అన్యాయం జరుగుతోంటే.. ఇక తాము ఎవరికి చెప్పుకోవాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో సునీల్ భార్య లక్ష్మి కూడా పాల్గొన్నారు. మొత్తంగా వివేకా హంతకులు ఎవరన్న విషయం జగన్ కు తెలుసునంటూ సునీల్ ఫ్యామిలీ మాటలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.
Must Read ;- సునీల్ అరెస్ట్ తో వివేకా హంతకుల్లో వణుకు











