Special Bench In Supreme Court For Cases Of Public Representatives :
ప్రజా ప్రతినిధులపై నమోదు అవుతున్న కేసుల విచారణలు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. దీంతో ఈ కేసులు చిన్నవైనా, తీవ్ర ఆరోపణలతో కూడినవైనా కూడా.. వాటితో ఎలాంటి ఇబ్బంది లేకుండానే ప్రజా ప్రతినిధులు చట్టసభలకు ఎన్నికవుతున్నారు. మంత్రులు అవుతున్నారు. ఏకంగా సీఎంలు కూడా అవుతున్నారు. ఈ తరహా పరిస్థితిపై నియంత్రణ ఉండేలా చూడాలంటూ గతేడాది సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. నాడు సుప్రీంకోర్టులో ఓ న్యాయమూర్తిగా ఉన్న ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ వాదనలకు సానుకూలంగా స్పందించిన జస్టిస్ ఎన్వీ రమణ.. ప్రజా ప్రతినిధులపై నమోదయ్యే కేసుల విచారణలు నిర్ణీత కాల వ్యవధిలోగానే పూర్తి కావాల్సిందేనని కూడా అభిప్రాయపడ్డారు. దీనిపై అభిప్రాయాన్ని చెప్పాలని గత నవంబర్ లోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు జస్టిస్ ఎన్వీ రమణ నోటీసులు జారీ చేశారు. అయితే దీనిపై ఇప్పటిదాకా కేంద్రం స్పందించిన పాపాన పోలేదు. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఇదే పిటిషన్ పై మంగళవారం నాడు జస్టిస్ ఎన్వీ రమణ మరోమారు విచారణ చేపట్టారు.
కేంద్రం తీరుపై ఆగ్రహం
ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ విధానపరమైన నిర్ణయంపై అభిప్రాయం చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం నెలల తరబడి సమయం ఎలా తీసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా నవంబర్ లో నోటీసులు జారీ చేస్తే.. ఇప్పటిదాకా అసలు కౌంటరే దాఖలు చేయకపోవడానికి గల కారణాలేమిటని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించిన జస్టిస్ రమణ.. కౌంటర్ దాఖలు చేసేందుకు కేంద్రానికి 10 రోజుల గడువు ఇస్తున్నట్లుగా తేల్చి చెప్పారు. ఆ సమయంలోగా కేంద్రం కౌంటర్ దాఖలు చేయకపోతే.. దీనిపై చెప్పడానికి కేంద్రం వద్ద ఏమీ లేదనే భావిస్తామని కూడా జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా కౌంటర్ దాఖలులో కేంద్రం జాప్యంపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారనే చెప్పాలి.
జగన్ కు ఇబ్బందే
కేంద్రం తీరును తనదైన రేంజిలో కడిగిపారేసిన జస్టిస్ ఎన్వీ రమణ.. ప్రజా ప్రతినిధులపై నమోదయ్యే కేసుల సత్వర విచారణ కోసం సుప్రీంకోర్టులో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తామని కూడా ఆయన మరో సంచలన వ్యాఖ్య చేశారు. ఈ ప్రత్యేక ధర్మాసనం ద్వారా ప్రజా ప్రతినిధులపై నమోదయ్యే కేసులు ఆయా కోర్టుల్లో ఏ దశలో విచారణలో ఉన్నాయన్న విషయాన్ని నిత్యం పర్యవేక్షించనున్న సుప్రీం ప్రత్యేక ధర్మాసనం.. ఆయా కేసుల సత్వర పరిష్కారం కోసం సలహాలు, సూచనలు చేస్తుంది. ఈ బెంచ్ గనుక అందుబాటులోకి వస్తే.. జగన్ పై నమోదైన అక్రమాస్తుల కేసు తరహా కేసులు కూడా సత్వరమే పరిష్కారమయ్యే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్ కేసుల సాగదీత కుదరదు