వైఎస్ వివేకానందరెడ్డి.. ఏపీ సీఎం జగన్ కు సొంత బాబాయి. అబ్బాయి కోసం ఏకంగా ఎంపీ పదవిని వదులుకున్న బాబాయి. అన్న వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం ఇరు కుటుంబాలు కలిసే ఉన్నా.. ఆ తర్వాత వేరు పడిపోయాయి. ఎంత వేరుపడ్డా.. అన్న కొడుకు జైలుకు వెళుతుంటే.. బాబాయి తట్టుకోలేకపోయారు. పరుగు పరుగున సీబీఐ దర్యాప్తు జరుగుతున్న చోటుకు వెళ్లి అబ్బాయికి ధైర్యం చెప్పారు. అంతగా తన వెన్నంటి నిలిచిన బాబాయిని గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అత్యంత కిరాతకంగా చంపేస్తే.. సీఎంగా ఉండి కూడా వారిని పట్టుకునే దిశగా జగన్ సాగలేకపోయిన వైనం నిజంగానే ఆశ్చర్యం రేకెత్తించేదే. అయితే వివేకా కూతురు డాక్టర్ సునీత పోరాటం ఫలితంగా ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసును అన్ని కోణాల్లో పరిశీలించిన సీబీఐ.. ఎట్టకేలకు ఈ కేసు చిక్కుముడిని విప్పినట్లుగా సమాచారం. అయితే.. కోర్టులో దాఖలు చేయనున్న చార్జిషీట్ ద్వారానే ఆ వివరాలు బయటకు రానున్నాయి. అప్పటిదాకా వివేకాను కిరాతకంగా హత్య చేసి సీబీఐ చేతికి దొరికిపోయిన వారు ఎవరన్న విషయంపై ఊహాగానాలు మినహా స్పష్టత వచ్చే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఐదుగురు హంతకులు.. రూ.8 కోట్ల సుపారీ
వివేకాను హత్య చేసేందుకు కడప జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖులే పథకం రచించినట్లుగా తెలుస్తోంది. అనుకున్నదే తడవుగా సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ఇంకో రెండు, మూడు నెలల సమయం ఉందనగా.. ఆ ఇద్దరు వ్యక్తులు తమ ప్లాన్ ను అమలులో పెట్టారు. ఇందుకోసం వారు ఏకంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఐదుగురు నరహంతకులను పిలిపించారట. వారికి ఏకంగా రూ.8కోట్ల మేర సుపారీ ఆఫర్ చేయడం ద్వారా వారిని ఈ హత్యకు ఒప్పించారట. భారీ మొత్తంలో డబ్బు చేతికి అందుతున్న నేపథ్యంలో ఆ ఐదుగురు వివేకాను హత్య చేసేందుకు సిద్ధపడిపోయారు. వారికి సహకారం అందించేందుకు స్థానిక వ్యక్తి ఉపయోగపడ్డాడట. అనుకున్నట్లుగానే వివేకాను హత్య చేసిన ఆ ఐదుగురు.. ఆ తర్వాత తమ సొంత ప్రాంతాలకు పరారయ్యారు. హత్య చేసిన ఆనవాళ్లను పట్టుకుని పోలీసులు ఎంతగా వెతికినా.. హంతకుల జాడ మాత్రం తెలియరాలేదు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. రోజుల తరబడి ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఏకంగా 1,600 మందిని విచారించింది. ఈ క్రమంలోనే సీబీఐ విచారించిన వివేకా ఇంటి వాచ్ మన్ రంగయ్య అసలు విషయాన్ని బయటపెట్టేశారట. దీంతో అతడిని జమ్మలమడుగు మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లి వాంగ్మూలం రికార్డు చేయించారు.
ఆ ఇద్దరు ఎవరు?
వివేకాను హత్య చేసిన వారు ఐదుగురు, వారికి సహకరించిన మరొక స్థానికుడు మొత్తం కలిపి ఆరుగురు అయితే.. వివేకా హత్యకు పథకం రచించిన వారు ఇద్దరు మాత్రమేనట. వారిద్దరూ కడప జిల్లాకు చెందిన ప్రముఖులట. వారి పేర్లు ఏవీ ఇప్పుడప్పుడే రావు గానీ.. వివేకాను హత్య చేయించాల్సిన అవసరం వారికి ఏమొచ్చిందన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. వివేకా ఏ ఒక్కరితోనే శత్రుత్వం కలిగి ఉన్న నేత కాదు. రాజకీయాల్లో ఆజాతశత్రువు కిందే లెక్క.అలాంటిది ఏకంగా రూ.8 కోట్ల మేర సుపారీ ఇచ్చి మరీ వివేకాను హత్య చేయించిన ఆ ఇద్దరు ప్రముఖులు ఎవరు? అసలు వారు ఎందుకు వివేకాను హత్య చేయించారన్నది ఇప్పుడు అంతు చిక్కడం లేదు. ఈ వివరాలు సీబీఐ అదికారులు చార్జి షీట్ ను కోర్టుకు సమర్పిస్తే తప్పించి పేర్లు వెల్లడి అయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో కేసు చిక్కుముడి వీడుతున్న సమయంలో దర్యాప్తు అధికారిని సీబీఐ మార్చివేయడం కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తంగా సీబీఐ విప్పిన ఈ చిక్కుముడి జనానికి తెలుస్తుందా?.. లేదంటే తెలియకుండానే మరుగున పడిపోతుందా? అన్న దిశగా ఆసక్తికర చర్చ నడుస్తోంది.
Must Read ;- నేల విడిచి సాము.. ఇన్‌సైడర్ లో జగన్ చేసిందిదేగా