వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. అయితే ఇప్పటిదాకా ఈ హత్యకు కారణాలేమిటన్న విషయాలు గానీ, వివేకాను హత్య చేసింది ఎవరన్న విషయం గానీ బయటపడలేదు. టీడీపీ అధినేత సీఎంగా ఉన్న సమయంలో 2019 మార్చిలో సరిగ్గా ఎన్నికలకు సమయం ఆసన్నమైనప్పుడు పులివెందులలోని తన సొంతింటిలోనే వివేకా దారుణంగా హత్యకు గురయ్యారు. దీనిపై చంద్రబాబు సర్కారు ఓ సిట్ ను ఏర్పాటు చేయగా.. జగన్ సీఎం అయ్యాక దానిని రద్దు చేసి.. దాని స్థానంలో మరో సిట్ వేశారు. అయినా కేసులో ఇంచు పురోగతి కూడా కనిపించలేదు. ఈ క్రమంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయాలంటూ వివేకా కూతురు డాక్టర్ సునీత హైకోర్టును ఆశ్రయించారు. అందుకు హైకోర్టు సరేననడంతో సీబీఐ అధికారులు రంగంలోకి దిగిపోయారు. కరోనా సెకండ్ వేవ్ కు ముందు ఓ దఫా విచారణ చేపట్టిన సీబీఐ.. రెండు నెలల నుంచి కడపలోనే తిష్ట వేసి మరీ ఈ కేసు చిక్కుముడిని విప్పుతోంది.
సీబీఐ కస్టడీకి సునీల్
తమ విచారణకు కొంతకాలం పాటు రెగ్యులర్ గానే వచ్చిన పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్ ఆ తర్వాత తప్పించుకోవడంతో అతడిని గోవాలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా అతడిని కోర్టులో హాజరుపరచి 13 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసి.. 10 రోజుల కస్టడీకి కోర్టును ఒప్పించారు. ఈ నేపథ్యంలో శనివారం అతడిని సీబీఐ అధికారులు జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటికే విచారణను ఎలా చేపట్టాలన్న విషయంపై క్లిస్టర్ క్లియర్ గానే ప్లాన్ గీసుకున్న సీబీఐ అధికారులు.. వివేకా హత్యకు వినియోగించిన ఆయుధాల కోసం గాలింపు మొదలెట్టేసింది. ఇందులో భాగంగా సునీల్ వెంటేసుకుని పులివెందులకు సమీపంలోని రోటరీపురం వంకలో ఆయుధాల కోసం గాలింపు చేపట్టింది. విచారణలో భాగంగా అందిన సమాచారం మేరకే ఈ గాలింపు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ 10 రోజుల పాటు తమ కస్టడీలోని సునీల్ కుఏ సంధించాల్సిన ప్రశ్నలను కూడా ఇప్పటికే సీబీఐ సిద్ధం చేసిందట. అంతేకాకుండా వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరిలను కూడా అరెస్ట్ చేసే దిశగా సీబీఐ కదులుతోందట.
అంతా కక్కేయక తప్పదు
ఇదిలా ఉంటే.. సీబీఐ కస్టడీలోకి వెళ్లిపోయిన సునీల్ ఓ 10 రోజుల పాటు వారి అదుపులోనే ఉంటాడు. ఈ 10 రోజుల్లో వివేకా హత్య కేసుకు సంబంధించిన అన్ని వివరాలను సీబీఐ అధికారులు రాబట్టే పనిని మొదలెట్టారు. వివేకాను హత్య చేసింది ఎవరు? ఈ హత్యకు పథకం రచించింది ఎవరు? అసలు వివేకాను హత్య చేయడానికి గల కారణాలేమిటి? ఈ దిశగా దారి తీసిన కారణాలేమిటి? హత్యకు మనుషులను ఎక్కడి నుంచి పిలిపించారు? అందుకు ఏ మేర ఖర్చు చేశారు? హంతకులకు ఎంత మొత్తం ఇచ్చారు? హత్య జరిగిన సమయంలో ఘటనా స్థలిలో ఎంతమంది ఉన్నారు? వారు ఎవరు? హత్యకు ఏ ఆయుధాలు వాడారు?.. ఇలా చాంతాడంత ప్రశ్నావళిని సీబీఐ అధికారులు సునీల్ కు సంధించనున్నారట. ఇప్పటికే వివేకా హత్య కేసుకు సంబంధించి సునీల్ చాలా విషయాలే చెప్పాడని, ఈ 10 రోజుల కస్టడీలో మొత్తం ప్లాన్ ను కూడా అతడు వెల్లడించక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంటే.. మరో 10 రోజుల్లో వివేకా హత్య కేసు మిస్టరీ వీడిపోతుందన్న మాట.