జార్ణండ్ లో ఓ న్యాయమూర్తిని నడిరోడ్డుపై ఆటోతో గుద్ది చంపేసిన దుండగుల కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కేసు విషయం తెలిసిన వెనువెంటనే స్పందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ తనదైన శైలిలో కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కేసును సుమోటోగా విచారణ చేపడుతున్నట్లుగా కూడా ఆయన సంచలన ప్రకటన చేశారు. అనుకున్నట్లుగానే ఈ కేసుపై విచారణ మొదలెట్టిన జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. శుక్రవారం మరోమారు ఈ కేసు విచారణను చేపట్టింది. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థలు చేస్తున్న జాప్యంపై జస్టిస్ రమణ తనదైన శైలి ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. అసలు న్యాయ వ్యవస్థకు దర్యాప్తు సంస్థలు సహకరించడం లేదని కూడా జస్టిస్ ఎన్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీబీఐతో పాటు ఐబీ కూడా అంతే
శుక్రవారం నాటి విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్వీ మరణ ఏమన్నారన్న విషయానికి వస్తే.. ‘‘జార్ణండ్ న్యాయమూర్తి హత్య ప్రభుత్వ వైఫల్యమే. న్యాయ వ్యవస్థకు సీబీఐ, ఐబీ సహకరించడం లేదు. దేశంలో పెడ ధోరణులు మొదలయ్యాయి. జడ్జీల ఫిర్యాదులను సీబీఐ, ఐబీ పట్టించుకోవడం లేదు. అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయవ్యవస్థను కింబచపరడం బాధాకరం. జడ్జీలపై ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో గమనిస్తున్నారా? కేంద్రం ఏం చేయాలనుకుంటోంది’’ అని జస్టిస్ ఎన్వీ రమణ ఎన్నడూ లేని రీతిలో తనదైన శైలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 17లోగా జడ్జీల రక్షణకు తీసుకున్న చర్యల వివరాలు అందజేయాలని అటార్నీ జనరల్ కు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తులో ఏ మేర పురోగతి ఉందో వివరించాలని, అందుకోసం సోమవారం నాడు సీబీఐ తమ ముందు హాజరు కావాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు.
సీబీఐ తీరు మారాల్సిందే
జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యలు విన్నంతనే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంలో సీబీఐ నాన్చుడు ధోరణి ఠక్కున గుర్తుకు వచ్చింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ జగన్ పార్టీకే చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే.. ఆ పిటిషన్ కు సంబంధించి తన అభిప్రాయం చెప్పేందుకు సీబీఐ వాయిదాల మీద వాయిదాలు కోరింది. అంతేకాకుండా మరోమారు వాయిదా ఇచ్చేందుకు నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ససేమిరా అంటే.. తన అభిప్రాయం చెప్పదలచుకోలేదని, ఈ వ్యవహారంలో కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమేనని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వ్యవహారంలో సీబీఐ సరిగ్గా స్పందించి ఉంటే.. జగన్ బెయిల్ ఎప్పుడో రద్దు అయ్యేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సీజేఐ నేరుగా సీబీఐ పేరు చెప్పి మరీ న్యాయ వ్యవస్థకు దర్యాప్తు సంస్థలు సహకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో అయినా సీబీఐ తీరు మారి తీరాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
Must Read ;- జస్టిస్ ఎన్వీ రమణ సలహానే కాదన్నారే