తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి గత కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మా కు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి.. సీనియర్ నటుడు, మా క్రమశిక్షణా కమిటీ చైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాశారు. మా ఎన్నికలు ఆలస్యమైతే.. సంస్థ తరఫున జరిగే సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడతాయని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే మా కు ఎన్నికలు నిర్వహించాలని ఆ లేఖలో చిరంజీవి విజ్ఞప్తి చేశారు.
ముందే కూసిన ప్రకాశ్ రాజ్
ఇప్పటికే మా ఎన్నికలకు సంబంధించి సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ అందరికంటే ముందు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ దఫా మా ఎన్నికల్లో తాను పోటీ చేయదలచుకున్నానని, తనకు మెగా ఫ్యామిలీ మద్దతు కూడా ఉందన్న విషయాన్ని పరోక్షంగా చెబుతూ సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత యువ హీరో మంచు విష్ణు కూడా తాను కూడా మా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. పెద్దలంతా మాట్లాడి ఎన్నికలను ఏకగ్రీవం చేస్తే సరి.. లేదంటే తాను మాత్రం తప్పనిసరిగా బరిలో ఉంటానని కూడా ఆయన ప్రకటించారు. ఇక ప్రస్తుతం మా అధ్యక్షుడిగా ఉన్న నరేశ్ అయితే ఎన్నికలను ఎప్పుడు పెట్టాలో తమకు తెలుసు అని, అయినా ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉండగా.. అప్పుడే ఎన్నికల్లో పోటీ అంటూ ప్రకటనలు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైరి వర్గాలు మారిపోయిన పలువురు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.
తక్షణ ఎన్నికలు ఎందుకంటే..?
ఇలాంటి క్రమంలో ఊహించని విధంగా సోమవారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి మా ఎన్నికలపై స్పందించారు. నేరుగా కృష్ణంరాజుకు లేఖ రాసినట్లుగా పేర్కొన్న ఆయన ఎన్నికలను తక్షణమే నిర్వహించాల్సిన అవసరాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలకు కుంటు పడుతుందని చిరు అభిప్రాయపపడ్డారు. కరోనా నేపథ్యంలో చాలా మంది సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిందరినీ ఆదుకోవాలంటే తక్షణమే మా కు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా మా ఎన్నికలకు సంబంధించి పలువురు సభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారని, ఈ కారణంగా సంస్థ ప్రతిష్ట మసకబారుతుందని కూడా చిరు ఆందోళన వ్యక్తం చేశారు. మా పరువును బజారుకీడ్చేలా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కూడా చిరు ఆ లేఖలో డిమాండ్ చేశారు. చిరు ఎంట్రీతో మా ఎన్నికలు ఏ క్షణంలో అయినా జరగవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- ‘మా’లో కలకలం రేపుతున్న హేమ వాయిస్











