NGT Orders Enquiry In To Laterite Mining :
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖ మన్యంలో యథేచ్ఛగా బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలోని అడవుల్లోని బాక్సైట్ ఖనిజాన్ని లేటరైట్ పేరుతో తవ్వేస్తున్న వైసీపీ పెద్దల తీరుపై విపక్ష టీడీపీ చాలా కాలంగానే పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో మొన్నామధ్య ఏపీ సీఎం జగన్ బాబాయి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అతడి స్నేహితుడు లవకుమార్ రెడ్డిలు ఈ భాగోతాన్ని నడిపిస్తున్నట్లుగా ఓ వీడియో తేల్చేసింది. ఓ గిరిజనుడితో లవకుమార్ రెడ్డి ఫోన్ లో మాట్లాడిన తీరు మొత్తం ఆడియో రూపంలో బయటపడిపోయింది. దీంతో మరింత మేర సమాచారం సేకరించేందుకు టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, చిన్నరాజప్పల నేతృత్వంలో నక్కా ఆనందబాబు, వంగలపూడి అనిత, గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి తదితరులు బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి పరిశీలన కోసం వెళ్లారు. అయితే ముందే మేల్కొన్న వైసీపీ పెద్దలు ఆ ప్రాంతంలోకి టీడీపీ బృందం అడుగుపెట్టకుండా అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్యుద్ధం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఎన్జీటీ ఏం చెప్పిందంటే..?
టీడీపీ నేతలు ఆరోపణలు నూటికి నూరు పాళ్లు నిజమేనన్నట్లుగా శుక్రవారం నాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహరంపై విశాఖపట్నానికి చెందిన కొండ్రు మరిడయ్య దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సందర్భంగా ఈ వ్యవహారంపై క్షేత్ర స్థాయి దర్యాప్తు చేయాలంటూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ దర్యాప్తు కోసం ఏకంగా రెండు బృందాలను ఏర్పాటు చేసిన ఎన్జీటీ.. దర్యాప్తు వివరాలను ఆగస్టు 31లోగా తమ ముందు ఉంచాలని ఆదేశించింది. అంతేకాకుండా ఎన్జీటీ జారీ చేసిన ఆదేశాలు, అందులో పేర్కొన్న అంశాలను చూస్తే.. విశాఖ మన్యంలో లేటరైట్ పేరిట ఖనిజ తవ్వకాలు జరుగుతున్నాయని ధర్మాసనమే తేల్చేసినట్లుగా చెప్పాలి. రిజర్వ్ అడవుల్లో ఖనిజ తవ్వకాలు, ఖనిజ రవాణా కోసం ఏకంగా చెట్లను నరికేసి రోడ్డు నిర్మాణం.. తదితరాలను ప్రస్తావించిన ఎన్జీటీ.. ఈ వ్యవహారంపై పరిశీలన చేసి బాధ్యుల నుంచి జరిమానా వసూలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక దర్యాప్తునకు ఏర్పాటు చేసిన కమిటీల విషయానికి వస్తే.. ఏపీ గనులు, భూగర్భ శాఖకు చెందిన అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన ఎన్జీటీ.. రెండో కమిటీలో మాత్రం కీలక శాఖల అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులను నియమించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఉన్నతాధికారి ఉండే ఈ కమిటిలో విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ అటవీ శాఖాధికారి, ఏపీ గనుల శాఖకు చెందిన సీనియర్ అధికారి, కాలుష్య నియంత్రణా మండలికి చెందిన మరో సీనియర్ అధికారిని నియమించింది. ఈ రెండు కమిటీలు కూడా తమ నివేదికలను ఆగస్టు 31లోగా తమ ముందు ఉంచాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.
అధికారుల్లో వణుకు మొదలైందే
ఎన్జీటీ నుంచి ఆదేశాలు వెలువడిన విషయం తెలిసినంతనే వైసీపీ పెద్దలు షాక్ కు గురయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో నిబంధనలను పక్కనపెట్టి.. వైసీపీ నేతలు చెప్పినట్టు నడుచుకున్న అధికారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్టు వినకుండా ఉండలేని పరిస్థితి. అలాగని వారు చెప్పినట్టు నడుచుకుంటే.. ఇలా కోర్టుల కేసులు, విచారణలు, కేసుల్లో దోషులుగా తేలితే జరిమానాలతో సరిపెడితే ఓకే.. లేదంటే తమ కొలువులకే ఎసరు వస్తే పరిస్థితి ఏమిటని అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్జీటీ ఆదేశాల నేపథ్యంలో వైసీపీ నేతలకు సహకరించిన అధికారులంతా.. ప్రభుత్వ పెద్దలను సంప్రదిస్తూ తమ పరిస్థితి ఏమిటని అడుగుతున్నారట. ఈ సందర్భంగా విచారణే కదా.. మేం చూసుకుంటాంలే అంటూ వైసీపీ పెద్దలు వారికి భరోసా ఇచ్చే యత్నం చేస్తున్నారట. ఏదేమైనా వైసీపీ పెద్దలు చెబుతున్న మాటలు అధికారుల్లో భయాన్ని మాత్రం పారదోలలేకపోతున్నాయట. మరి ఎన్జీటీ ఆదేశించిన మేరకు దర్యాప్తు నివేదికలు ఏమేం చెబుతాయో, ఎందరు అధికారులు, మరెంత మంది వైసీపీ పెద్దల మెడకు ఈ ఉచ్చు పడుతుందోనన్న వాదన మాత్రం ఆసక్తి రేకెత్తిస్తోంది.











