ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కళాశాలల్లో సదస్సులు పెట్టి టీడీపీ ప్రత్యేక హోదాపై సరిగా పోరాడటం లేదని, అధికారంలోకి రాగానే పోరాడి తాను ప్రత్యేక హోదా సాధిస్తానంటూ నమ్మ బలికి ఆ తర్వాత మడం తిప్పారు. 25 పార్లమెంటు సీట్లలో గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తానని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయన కూడ ఊహించని రీతిలో రాష్ట్ర ప్రజలు 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్లు సీట్లు కట్టబెడితే ఆ మరునాడే జగన్ మాట మార్చారు. అధికారం చేపట్టాక మొదటి సారి బీజేపీ ప్రభుత్వ పెద్దలను కలసిన జగన్ మీడియా ముందుకు వచ్చి బీజీపీకి పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉందని, ప్రత్యేక హోదాపై పోరాడలేమని, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమంటూ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారు. అంతకు ముందు కూడ కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండగా టీడీపీ ప్రత్యేక హోదాపై పోరాడటం లేదంటూ జగన్ ఆరోపణలు చేశారు. దీంతో ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయనుకున్న విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు అడియాశలయ్యాయి.
రెండేళ్ల పాలనలో ఒక్క కంపెనీ రాలేదు
అధికారం చేపట్టిన రెండేళ్లలో ఏపీకీ ఒక్క కొత్త పరిశ్రమ కూడ రాలేదు. వైసీపీ సర్కారు వైఖరి కారణంగా ఏపీలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ఎవరూ ముందుకు రావడం లేదు. అంతేకాకుండా జగన్ కక్ష పూరిత పాలన, మొండి వైఖరి వల్ల కొత్త పరిశ్రమ ఒక్కటీ రాకపోగా ఉన్న అదాని, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ కంపెనీలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయి. దీంతో రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. పాదయాత్రలో హామీ ఇచ్చిన ఉపాధి హామీలన్నీ ఇలా ఆవిరైపోయాయి.
ఉద్యోగాల సంగతి అంతే..
అధికారమిస్తే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల పైచిలుకు పోస్టులను భర్తీచేస్తామంటూ పాద యాత్రలో నమ్మబలికి యువతను ఆకర్షించి ఓట్లను దండుకున్నారు. ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లోని వివరాలను చూసి నిరుద్యోగ యువత తెల్ల ముఖం వేయాల్సి వచ్చింది. ఉన్నత అధికారులతో సమీక్షలు నిర్వహించి వివిధ శాఖల్లో వేలాది పోస్టులను గుర్తించి చివరకు అత్యంత దారుణంగా గ్రూప్ 1& 2లో 36 పోస్టులు, 400 పోలీసు పోస్టులు, ఇతర శాఖల్లో అరకొర పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో యువత అవాక్కయ్యారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేక, ప్రవేటు కంపెనీలు రాక, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేక ఏపీలో విద్యార్థులు, నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది.
Must Read ;- జగన్ డౌన్ డౌన్!.. హోరెత్తిపోతోంది!











