ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌పై సెటైర్లు పేలు తున్నాయి. సీఎం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ కన్నా మార్కెట్లో దొరికే క్యాలెండర్లు బెటరని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. మార్కెట్లో దొరికే క్యాలెండర్ అయితే కనీసం రాశి ఫలాలు అయినా చూసుకోవచ్చన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భర్తీ చేసిన ఉద్యోగాలు కూడా జగన్‌రెడ్డి తన ఖాతాలో వేసుకున్నాడని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, రెండేళ్లు అయినా ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. నిరుద్యోగులను సీఎం మోసం చేశారని ఆయన విమర్శించారు. ఏపీలో 25 వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఒక్కటి కూడా క్యాలెండర్‌లో చూపలేదన్నారు. భర్తీ చేశామని చెప్పుకుంటున్న6 లక్షల ఉద్యోగాల్లో 3 లక్షలు వాలంటీర్ పోస్టులేనన్నారు. మద్యం అమ్మే వారివి కూడా ఉద్యోగాలేనా? కోవిడ్ సమయంలో 3 నెలలు పని చేసేందుకు కాంట్రాక్టు పద్దతిలో తీసుకున్న నర్సు పోస్టులను కూడా క్యాలండర్‌లో పెట్టారని అచ్చెన్న ఎద్దేవా చేశారు. లక్షల ఉద్యోగాల భర్తీ పేరుతో జగన్‌రెడ్డి ఫేక్ క్యాలెండర్ విడుదల చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. ఇప్పటికైనా నిరుద్యోగులను మోసం చేయడం మానుకోవాలని ఆయన విజ్ఙప్తి చేశారు.
అంతా బూటకం: అశోక్ బాబు
జాబ్ క్యాలెండర్ పేరుతో జగన్‌రెడ్డి నిరుద్యోగులను మరోసారి మోసం చేశారని ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. 3 లక్షల వాలంటీర్లు కూడా ఉద్యోగులేనా అని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్లు ఉద్యోగులు కాదని సీఎం బహిరంగ సభల్లో చెప్పాడని, ఇప్పుడేమో భర్తీ చేసిన ఉద్యోగాల్లో వాలంటీర్లను చూపుతున్నారని అశోక్ బాబు గుర్తు చేశారు. లక్షన్నర మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఎలా చూపుతారని ఆయన ప్రశ్నించారు. బూటకపు ప్రకటనలతో ప్రభుత్వమిచ్చిన ఉద్యోగాల ప్రకటనపై టీడీపీ తరఫున న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు.
ప్రత్యోక హోదా పేరుతో యవతను మోసం చేశారు: యనమల రామకృష్ణుడు
ప్రత్యేక హోదా వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేసి నిరుద్యోగ యువతను మోసం చేశారని టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన హామీల్లో ఇది అతిపెద్ద మోసం అన్నారు. ఏపీలో నిరుద్యోగ రేటు ఇప్పటికే 13.5 శాతానికి పెరిగి పోయిందని, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేక ఏ పరిశ్రమా రాష్ట్రానికి రావట్లేదని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. 26 మంది వైసీపీ ఎంపీలు ఉండి కూడా హోదా సాధనలో విఫలమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ ఎంపీలంతా తమ పదవులకు రాజీనామా చేయాలని యనమల డిమాండ్ చేశారు.
Must Read ;- డూబురెడ్డి డాబు జాబ్ కాలెండర్ : నారా లోకేష్