ఏపీలో నిరుద్యోగులు రోడ్డెక్కారు. నిన్నటిదాకా ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసిన నిరుద్యోగులు… జగన్ సర్కారు జాబ్ చార్ట్ విడుదల చేయగానే రోడ్డెక్కిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లకు సంబంధించిన జాబ్ చార్ట్ విడుదలైనా… ఆందోళనలు ఎందుకంటే… సదరు జాబ్ చార్ట్ లో జగన్ సర్కారు చేసిన మాయే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేయడంతో పాటుగా జగన్ డౌన్ డౌన్ అంటూ నిరుద్యోగ యువత చేస్తున్న నినాదాలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మారుమోగుతున్నాయి.
సేవకులు ఉద్యోగులెలా?
లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకుంటున్న జగన్ సర్కారు… అందులో తనదైన శైలి మాయలతో కనికట్టు చేసింది. సేవకులుగా గుర్తిస్తున్నామని స్వయంగా జగన్ చెప్పిన గ్రామ, వార్డు వలంటీర్ల పోస్టులను కూడా ఉద్యోగాలుగానే జగన్ సర్కారు తన జాబ్ చార్ట్ లో ప్రకటించింది. అంతేకాకుండా ఆయా శాఖల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉండగా… కొత్తగా ప్రకటించిన జాబ్ చార్ట్ లో మాత్రం అరకొర ఖాళీలే ఉన్నట్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క ఉద్యోగ భర్తీ ప్రకటన కూడా రాకపోవడం, ఇప్పుడు ప్రకటించిన జాబ్ చార్ట్ లో వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఖాళీలు ఉండటం నిరుద్యోగుల ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది.
ఖాళీలు బోలెడు… భర్తీ జానెడేనా?
జాబ్ చార్ట్ వచ్చిన వెంటనే నిరుద్యోగ యువత నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. గ్రూప్-1,2 రెండింటికీ కలిపి కేవలం 36 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా జాబ్ చార్ట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నాలుగైదేళ్లకోమారు నోటిఫికేషన్ వచ్చే గ్రూప్-1లో వందల పోస్టులను భర్తీ చేస్తారు. ఇక గ్రూప్అ-2లో అయితే వెయ్యికి తక్కువ కాకుండా పోస్టులు ఉంటాయి. అయితే ఈ రెంటికీ కలిపి కేవలం 36 పోస్టులనే ప్రకటించారు. ఇక మిగిలిన కేటగిరీ ఉద్యోగాల విషయంలోనూ జాబ్ చార్ట్ లో అరకొర నియామకాలే ఉంటాయన్న విషయాన్ని కూడా జగన్ సర్కారు ప్రకటించింది. జాబ్ చార్ట్ లో ప్రకటించిన అరకొర పోస్టు భర్తీకి షెడ్యూల్ ప్రకటించినా… గతానుభవాల నేపథ్యంలో అసలు జాబ్ చార్ట్ అమలు అవుతుందా? అన్న అనుమానాలు నిరుద్యోగుల్లో రేకెత్తుతున్నాయి. వెరసి జగన్ సర్కారుపై నిరుద్యోగ యువత ఒంటికాలిపై లేచిందనే చెప్పాలి. మరి ఈ నిరసనల హోరు నుంచి జగన్ సర్కారు ఎలా తప్పించుకుంటుందో చూడాలి.
Must Read ;- డూబురెడ్డి డాబు జాబ్ కాలెండర్ : నారా లోకేష్