వైసీపీ సర్కారు గోరంత సాయం చేసి కొండంత ప్రచారం చేస్తోందని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వాండ్రంగి గ్రామానికి చెందిన కంది ఆదిలక్ష్మికి రూ.19 వేలు ఇచ్చి రూ.10 లక్షలు లబ్ధి చేకూర్చినట్లు కరపత్రం పంపడాన్ని వారు ఉదహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలోని వాండ్రంగి గ్రామానికి చెందిన కంది ఆదిలక్ష్మి అనే మహిళకు రెండు రోజుల క్రితం ప్రభుత్వం నుంచి ఓ కరపత్రం అందింది.అందులో లబ్ధిదారులకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, ఇంటిస్థలం, మౌలిక సదుపాయాల కల్పనకు రూ.10 లక్షలు ఇచ్చినట్లుగా చూపించారు. వాస్తవానికి ఆమె సొంత స్థలంలోనే ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ఆమె ఖాతాలో గృహనిర్మాణశాఖ అధికారులు రూ.19 వేలు మాత్రమే వేశారు. గురువారం సామాజిక మాధ్యమాల్లో ఈ అంశం విస్తృతంగా ప్రసారమవడంతో కరపత్రంలో పేర్కొన్నంత లబ్ధి తమకు అందలేదని ఆమె వాపోయారు. దీనిపై ఆమె ఎంపీడీవో రమణమూర్తిని సంప్రదించగా అమరావతి నుంచి వచ్చిన కరపత్రంలో తప్పులు దొర్లాయని, సచివాలయ సిబ్బందితో మాట్లాడి సరిచేస్తామని చెప్పారన్నారు.
Must Read ;- అడ్డంగా దొరికారు : ఎర్రచందనం స్మగ్లింగ్‌లో వైసీపీ నేతలు