2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాను గాలి బలంగా వీచినా.., టీడీపీ పార్టీ అంతో ఇంతో సీట్లు సాధించి ప్రకాశం జిల్లాలోనే పరువు నిలబెట్టుకుంది. జిల్లాలోని 12 ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ 4 స్థానాలు దక్కించుకుని బతుకు జీవుడా అంటూ బయటపడింది. కానీ, అధికారంలోకి వచ్చి సీఎం అయిన తర్వాత భవిష్యత్తులో టీడీపీ పార్టీ ప్రతిపక్షంగా కూడా నిలవకూడదనే ఏకైక లక్ష్యంతో జగన్ ముందుకు సాగుతూ.., తెలుగు తమ్ముల్లపై సామ, దాన, బేధ, దండోపాయాలను ప్రదర్శిస్తూ., టీడీపీ ఆర్థిక మూలాలను చిన్నాభిన్నం చేస్తూ ముందుకు సాగుతున్నారు.
ప్రకాశం జిల్లాలో టీడీపీ కీలక నేతలకు వందల ఎకరాల్లో గ్రానైట్ లీజులు ఉన్నాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వానికి పంగనామాలు పెట్టి.., కోట్లు దోచుకున్నా అడిగే వాళ్లెవరూ లేరు. ఇప్పుడు జగన్ ఈ అక్రమాలనే ఆయుధంగా చేసుకుని టీడీపీ ఆర్థిక పునాదులను దెబ్బతీస్తున్నారు. 8 నెలల క్రితం అధికారులు వరుస దాడులు జరిపి.., అక్రమ గ్రానైట్ తవ్వకాలు, లీజు నిబంధనల ఉల్లంఘించిన 20 మంది గ్రానైట్ లీజు దారులపై సుమారు రూ. 2,100 కోట్ల పన్నులు విధించారు. ఇలా పన్నుల విధించిన సంస్థల్లో టీడీపీ మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యేలు కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావువి ఉన్నాయి. శిద్ధా రాఘరావుకు చెందిన గ్రానైట్ సంస్థలపై 290 కోట్ల రూపాయలు,. ఆయన సోదరులు శిద్ధా సూర్య ప్రకాశరావు, శిద్ధా హనుమంత రావుకు రూ. 145 కోట్లు ఫైన్ విధించారు. తొలుత కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న శిద్ధా కుటుంబ ఆ తర్వాత.., వైసీపీ నేతలతో రహస్య. మంతనాలు జరిపి ఫ్యాను గూటికి చేరింది.
కరణం కూడా తన కుమారుడు వెంకటేష్ కి వైసీపీ కండువా కప్పి.., తానూ ఫ్యాను గూటికి చేరిపోయారు. తాజాగా గొట్టిపాటికి చెందిన 11 గ్రానైట్ లీజులు, పోతులకు చెందిన 3 గ్రానైట్ లీజులను రద్దు చేస్తూ.., భూగర్బ గనుల శాఖ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు జిల్లాలో రాజకీయ వేడిన రాజేస్తోంది. 2014 ఎన్నికలకు ముందు నుంచే గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు.., జగన్ వెంట నడుస్తూ 2014 ఎన్నికల్లో విజయం కూడా సాధించారు. కానీ, టీడీపీ ప్రభుత్వం ఏర్పడటంతో మారిన రాజకీయ, కుల సమీకరణలో నేపథ్యంలో వీరు టీడీపీ పంచన చేరి జగన్ కి షాక్ ఇచ్చారు. అప్పుడు వారు వైసీపీకి ఇచ్చిన ఫిరాయింపు గిఫ్టుకు.., జగన్ గ్రానైట్ లీజుల రద్దు రూపంలో రిటర్న్ గిప్ట్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గొట్టిపాటి, పోతులకు ఇక దారులు క్లోజ్ అయినట్లేనా..?
గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు వైసీపీలో చేరుతున్నారనే వార్తలు .., గత కొన్ని నెలలుగా చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కానీ, దీనిపై ఆ నేతలు ఇద్దరూ తెర వెనుక మంతనాలు చేశారే గానీ, బహిరంగంగా ఎవ్వరూ ఎక్కడా పార్టీ మారుతున్నామని చెప్పలేదు. 2014 వరకూ గొట్టిపాటి రవికుమార్, వై.ఎస్.కుటుంబానికి సన్నిహితుల లిస్టులో ఉన్నారు. కానీ, ఎప్పుడు అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక.., ఆ పార్టీలో చేరారో దీనిపై జగన్ తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు వైసీపీ వర్గాలు చెప్తున్నాయి.
అందువల్లే గొట్టిపాటి మళ్లీ వైసీపీలో చేరతాడనే వార్తలు వచ్చినా.., జగన్ నుంచి ఆమోద ముద్ర లేకపోవడంతో ఆ దిశగా అడుగులు పడలేదని తెలుస్తోంది. దీంతోపాటు ఎప్పుడు అయితే కరణం కుటుంబం వైసీపీలో చేరిందో.., అప్పుడు గొట్టిపాటికి వైసీపీలో డోర్లు పూర్తిగా క్లోజ్ అయ్యాయని కరణం వర్గం చెబుతోంది. 8 నెలల క్రితం అధికారులు జరిపిన సోదాల్లో నిబంధనలు ఉల్లంఘించారని, అక్రమాలకు పాల్పడ్డారని.., గొట్టిపాటి రవికుమార్ కి చెందిన గ్రానైట్ సంస్థలపై రూ. 280 కోట్ల రూపాయల ఫైన్ ను అధికారులు విధించారు.
దీనిపై గొట్టిపాటి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తనకున్న పరిచయాల ద్వారా వైసీపీలోకి తిరిగి వెళ్లడానికి ప్రయత్నాలు చేసినా.. అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఏకంగా 11 గ్రానైట్ లీజులను ప్రభుత్వం రద్దు చేయడంతో ఓ విధంగా గొట్టిపాటి రవికుమార్ ఆర్థిక మూలాల్ని వైసీపీ దెబ్బకొట్టిందనే చెప్పుకోవాలి. మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు సైతం గొట్టిపాటితో పాటు టీడీపీలోకి వచ్చారు. ఆయనకు చెందిన 3 గ్రానైట్ లీజులను రద్దు చేయడంతో ఆయన సైలెంట్ అయ్యారు.
ఇప్పటికే తమ ఫ్యాక్ఠరీలపై విధించిన పన్నులపై 3 సార్లు కోర్టుకు వెల్లి స్టే తెచ్చుకున్న గొట్టిపాటి, పోతుల.., ఇప్పుడు లీజుల రద్దుపై ఏం చేయబోతున్నారనేది వారి భవిష్యత్తు రాజకీయ వ్యూహాన్ని బహిర్గతం చేయవచ్చు. లీజుల రద్దుపై కోర్టును ఆశ్రయిస్తే ఇక గొట్టిపాటి రవికుమార్ కోర్టు ద్వారానే పోరాటం చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లే…, మౌనంగా ఉంటే మాత్రం గత పరిచయాలను ఆధారంగా చేసుకుని జగన్ ప్రసన్నం చేసుకుని ప్యాను కండువా కప్పుకోవడానికి ప్రయత్నాలు చేయవచ్చు.
చూడాలి.., ముందు ఈ రిటర్న్ గిఫ్టు వ్యూహం.., గొట్టిపాటి, పోతులతోనే ఆగుతుందా.., జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్థన్, ఏలూరి సాంబశివరావు దగ్గరకు వచ్చి ఆగుతుందా? అంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.











