ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకోసం ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేక పారిశ్రామిక విధానం ‘‘జగనన్న వైయస్సార్ బడుగు వికాసం’’ను సీఎం వైయస్.జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం, నా అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని సీఎం అన్నారు. ఎస్సీలు ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలని, ఎవ్వరికీ తీసిపోని విధంగా పారిశ్రామిక వేత్తలుగా, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని జగన్ అన్నారు.
రాష్ట్రంలో ఎప్పుడూ , ఎక్కడా జరగని విధంగా రూ. 1 కోటి రూపాయిలు ఇన్సెంటివ్‌లుగా ఇస్తున్నామన్నారు. ఎస్సీలు, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారుచేసేలా కొత్త కొత్త కార్యక్రమాలను చేపడుతున్నాం అని జగన్ అన్నారు. దళితుల్లో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలను కూడా చేపడుతున్నట్లు చెప్పారు.
16.2 శాతం ఎస్సీలకు, 6శాతం ఎస్టీలకు ఇండస్ట్రియల్ పార్కుల్లో భూముల కేటాయింపు జరుగుతుందని, స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, క్వాలిటీ సర్టిఫికేషన్.. పేటెంట్ రుసుముల్లో రాయితీలు ఉంటాయని జగన్ వివరించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మంచి జరగాలి, వారి కాళ్లమీద వారు నిలబడాలనే ఉద్దేశంతో వారి జీవితాలను మార్చాలనే నవరత్నాలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టామని, సచివాలయాల్లో కూడా 82శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయని, పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ అమలుచేస్తున్నామని జగన్ చెప్పారు.
అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికీ పథకాలు అందడానికి గ్రామ, వార్డు, వాలంటీర్ల వ్యవస్థను చేపట్టామన్నారు.
రాబోయే రోజుల్లో పేదల స్థితిగతులను పూర్తిగా మార్చాలని ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు జగన్ వివరించారు. అందరికీ మంచి జరగాలని, అలాగే మరింత మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన వ్యక్తులు ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే.. ఎలా చేయాలి? ఎవరిని కలవాలి? అనే విషయంలో అవగాహన కల్పించడంపై అధికారులు దృష్టిపెట్టాలని సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.











