మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోటీచేసిన ప్రకాష్ రాజ్ వర్గం మూకుమ్మడి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో సమావేశమై చర్చించారు. అంతకుముందే ఆయన మా సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి పోటీ చేసిన వారిలో శ్రీకాంత్, బెనర్జీ, ఉత్తేజ్, సురేష్ కొండేటి, కౌశిక్, తనీష్, సుడిగాలి సుధీర్, సమీర్, ప్రభాకర్, శివారెడ్డి, బ్రహ్మాజీ గెలుపొందారు. వీరందరూ కూడా రాజీనామా చేసేయాలని నిర్ణయానికి వచ్చారు.
అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఓడిపోయినవారిలో ప్రకాష్ రాజ్, నాగినీడు, అనితా చౌదరి, హేమ, జీవితా రాజశేఖర్, అనసూయ, అజయ్, గోవిందరావు, ఖయ్యూమ్, ప్రగతి, రమణారెడ్డి సుబ్బరాజు, టార్జాన్ ఉన్నారు. వీరిందరినీ విడగొట్టి వేరు కుంపటి పెట్టే దిశగా ఓ వర్గం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అందుకే మీడియా ముఖంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించి రాజీనామాల విషయాన్ని ప్రకటిస్తారు. మాలో గొడవలన్నీ తాత్కాలికం అని మెగాస్టార్ చిరంజీవి పెళ్లి సందడి ప్రీరిలీజ్ వేడుకలో ప్రకటించినా ఎవరిలోనూ మార్పురాలేదు.
వీరందరూ వేరు కుంపటి పెట్టుకోవడానికి సిద్దపడ్డారంటే దీనికి మెగా ఫ్యామిలీ మద్దతు ఉందనే అందరూ భావిస్తున్నారు. దీనివల్ల సినిమా ఇండస్ట్రీలో వీరు మరింత లోకువ కావడానికే ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా ఎవరైనా ఓటమి పాలైతే ఆ తర్వాత అందరూ ఒక్కటవుతారు.కానీ ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ప్రకాష్ రాజ్ వర్గం తీసుకునే ఈ నిర్ణయం ఈ వర్గంపై మరింత వ్యతిరేకత పెంచే ప్రమాదమే ఉంది. చాాలా వేగంగా కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ అసోసియేషన్ చీలిక అనేది జరిగితే మాత్రం నష్టం ప్రకాష్ రాజ్ వర్గానికే కాకుండా మెగా ఫ్యామిలీ మీద కూడా మచ్చ పడుతుంది.
ఎన్నికల్లో రౌడీయిజం జరిగింది.. 11 మంది రాజీనామా చేస్తున్నాం: ప్రకాష్ రాజ్
మా ఎన్నికల్లో రౌడీయిజం జరిగిందని ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే. ‘రెండు మూడు రోజులుగా సంఘర్షణ జరిగింది. సరే ఏంచేయాలి. ఏదైనా ఒకే ప్యానల్ ను ఎన్నుకోమని అన్నాం. ఎలక్షన్ జరిగిన విధానం గురించి చర్చించాం. చాలా రౌడీయిజం జిరిగింది. అయినా భరించాం. బెనర్జీ మీద చేయి చేసుకున్నారు. అసభ్యకరమైన భాష వాడారు. రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయి. నిన్న గెలిచిన వారు ఈరోజు ఎందుకు లేరు అనుకున్నాం. ఇలా ఉంటే కలిసి పనిచేయలేం అనిపించింది. పోస్టల్ బ్యాలెట్లలో అక్రమాలు జరిగాయి.
మా అసోసియేషన్ మసకబారింది అన్న మాట కూడా వచ్చేసింది. గెలిచిన 11 మంది రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది మా సంక్షేమం కోసమే తీసుకున్న నిర్ణయం. మా పదవులకు రాజీనామా చేస్తున్నాం. మీరు పనిచేయండి.. మేం బయటి నుంచి చూస్తూ ఉంటాం. మాది ఇక నుంచి ప్రశ్నించే పని. మా రాజీనామా అంగీకరిస్తారని భావిస్తున్నాం. నా రాజీనామాను వెనక్కి తీసుకుంటా. కానీ ఒక కండిషన్. తెలుగు కాని వాడు పోటీ చేయడానికి వీల్లేదు అని మాటను వెనక్కితీసుకుంటే నా రాజీనామాను వెనక్కి తీసుకుంటా. వేరు కుంపటి ఆలోచన లేదు. ఆత్మ, పరమాత్మ వంటివి రావు’ అన్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ‘మొదట్నుంచీ చెబుతూనే ఉన్నాం..ఒకే ఫ్యానల్ కు ఓటేయమని. కలిసి చేయాలనే ఇష్టూ దగ్గరే సమస్య ఉంది. విష్ణుకు అడ్డురాకూడనే ఈ రాజీనామా. ఆ ప్యానల్ కే మా విజయాన్ని వదిలేస్తున్నాం. అంతకంటే వేరే ఉద్ధేశం లేదు. వారు మ్యానిఫెస్టోలో పెట్టింది 100 శాతం చేస్తారన్న నమ్మకం ఉంది. ఈ ఒక్కసారికి క్షమించండి. సభ్యులందరికీ థ్యాంక్స్. మీ అందరి వెనకాల మేముంటామని మాట ఇస్తున్నాం.’ అన్నారు.
కళ్లనీళ్ల పర్యంతమైన బెనర్జీ
నటుడు బెనర్జీ కళ్లనీళ్ల పర్యంత మయ్యారు. మోహన్ బాబు తనను కొట్టడానికి వచ్చి పచ్చి బూతులు మాట్లాడారాన్నారు. ‘40 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. మంచు లక్ష్మిని, మంచు విష్ణుని ఎత్తుకుని తిరిగా. అందరం ఉండి అన్ని బూతులు తిడుతుంటే ఏంచేయాలో పాలుపోలేదు. అసలు మా అసోసియేషన్ లో ఉండొద్దు అనుకున్నాం. ఇలా ఎందుకు బతకాలి అనిపించింది. అన్ని వందల మందిలో నన్ను నానా మాటలన్నారు. విష్ణు నువ్వు బాగా చేస్తావ్.. బాగా చేసి మంచి పేరు తెచ్చుకోండి’ అంటూ బెనర్జీ భావోద్వేగంతో మాట్లాడారు.
Must Read ;-‘మా’ విష్ణుకు ప్రకాష్ రాజ్ ప్యానల్ విజేతల లేఖ











