తెలుగు సినిమా రంగం యావత్తూ ఇప్పుడు సంక్రాంతి మీదే దృష్టి పెట్టింది. సినిమాల విడుదలకు ఇంతకంటే మంచి సమయం ఉండదని నిర్మాతలు, హీరోలు, దర్శకుల అభిప్రాయం.
అందుకే పెద్ద నిర్మాతలంతా థియేటర్ల ప్రారంభానికి ఇప్పుడు సుముఖంగా లేరు. ఏకంగా సంక్రాంతి సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వెళ్లడం మంచిదనే అభిప్రాయంలో ఉన్నారు. సాధారణంగా సంక్రాంతి విడుదలకు కేవలం నాలుగు సినిమాలకే అవకాశం ఉంటుంది. ఆ నాలుగు ఏవి అన్నదే ఇక్కడ సమస్య. జనవరి 1 నుంచి విడుదలలు ప్రారంభించుకుంటే ఎవరికీ ఏ సమస్యా ఉండదు. కానీ అందరూ సంక్రాంతేనని అంటున్నారు. ఈసారి సంక్రాంతికి పోటీపడే పెద్ద హీరోలు ఉండరనే దాదాపు అనుకోవాల్సి ఉంటుంది. బరిలో ఉండే స్టార్ హీరో ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ఉంటారు.
పవర్ స్టార్ కే పెద్ద పీట
హిందీలో విజయవంతమైన ‘పింక్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ పైనే అందరి దృష్టీ ఉంది. ఈ సంక్రాంతికి సోలో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మాత్రమేనని అనుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది కూడా నాలుగు చిత్రాలు విడుదలైనా ప్రధాన పోటీ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’ చిత్రాల మధ్యే నడిచింది. రజనీకాంత్ ‘దర్భార్’, కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’ విడుదలైనా వాటికి సరైన ప్రాధాన్యం దక్కలేదు.
అయితే ఇక్కడ పవర్ స్టార్ తో ఓ సూపర్ స్టార్ పోటీ పడే అవకాశం లేకపోలేదు. అతడి రజనీకాంత్. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అన్నత్తే’ని త్వరగా పూర్తిచేయాలన్న దూకుడులో రజనీకాంత్ ఉన్నారు. గత ఏడాది కూడా ‘దర్భార్’తో రజనీ వచ్చినా కొద్దిగా ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి కూడా అలా చేస్తే ఫరవాలేదు. ఈ సినిమా దాదాపు ముగింపు దశకు వచ్చేసింది.
మిగతా ముగ్గురూ ఎవరు?
నిజానికి ఈ సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ కూడా బరిలోకి రావలసి ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ పూర్తికావడానికి ఇంకా సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బాలకృష్ణ – బోయపాటిల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కూడా సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు. ఇక ఆ ముగ్గురూ ఎవరని చూస్తే బరిలో నలుగురు కనిపిస్తున్నారు. వారెవరంటే రామ్ పోతినేని, నితిన్, వైష్ణవ్ తేజ్, అఖిల్ అక్కినేని. వీరిలో కొందరు పక్కకు తప్పుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి కారణం హీరో నితిన్ తన బాస్ పవన్ కళ్యాణ్ కు ఎదురెళతాడా అన్నది సందేహమే. అందువల్ల అతన్ని కూడా మినహాయించుకోవలసి ఉంటుంది.

ఇక వైష్ణవ్ తేజ్ పవన్ కళ్యాణ్ కు స్వయానా మేనల్లుడు. అతను కూడా మావయ్య సినిమాని మనసులో ఉంచుకోక తప్పదు. అలా చూసుకున్నపుడు రామ్, అఖిల్ మాత్రం కచ్చితంగా బరిలో ఉంటారు. దీన్ని బట్టి సంక్రాంతి బరిలో ఉండే సినిమాలు వకీల్ సాబ్, రెడ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. ఈ మూడింటితో పాటు రజనీ కాంత్ మూవీ కొద్దిగా ముందో వెనకో ఉంటుంది. ఇక నాగార్జున కూడా తన సినిమా ‘వైల్డ్ డాగ్’ను త్వరగా ముగించే పనిలో ఉన్నారు. ఇది కూడా జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

థియేటర్ల పరిస్థితి ఏమిటి?
అసలు థియేటర్లు ప్రారంభం కాకుండా సినిమాల విడుదల గురించి మాట్లాడుకోవడం ఏమిటన్న సందేహం వస్తోంది కదూ. ఇప్పటికే ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల థియేటర్లు ప్రారంభమయ్యాయి. పాత సినిమాలకు కూడా 30 శాతం కలెక్షన్లు ఉన్నాయన్న సమాచారం ఉంది. ఒకేసారి సంక్రాంతికి సినిమాలు వస్తే జనం స్పందన తెలయక పోవచ్చు. అందుకే ముందే థియేటర్లు ప్రారంభించడం మంచిదన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. అందుకే దీపావళి నుంచే సినిమా థియేటర్లను ప్రారంభించాలని చాలామంది కోరుతున్నారు.
ముఖ్యంగా చిన్న నిర్మాతలు ఈ విషయంలో పట్టుబడుతున్నారు. దీనివల్ల జనం స్పందన కూడా తెలుస్తుందని, నిదానంగా థియేటర్లకు అలవాటు పడతారని అంటున్నారు. అందువల్ల ఈ దీపావళి నుంచి పాక్షికంగా థియేటర్లు ప్రారంభం కావడానికి అవకాశం ఉంది. మరికొంతమంది దీపావళికి వద్దు ఏకంగా క్రిస్మస్ నుంచిగాని లేదా జనవరి 1 నుంచి గాని ప్రారంభిస్తే మంచిదని సూచనలు చేస్తున్నారు. కాకపోతే దీపావళికి థియేటర్లు ప్రారంభమైంతే కలెక్షన్లు రావనే భయం కూడా కొంతమందిలో ఉంది.
దానికి కారణం ఆర్థిక మాంద్యం. ఈ విషయంలో ఈ నెలఖరుకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందరూ సినిమా విజయం కోసం తపించే హీరోలే. గత ఏడాది సరిలేరు మీకెవ్వరు, అల వైకుంఠపురములో కలెక్షన్లు కుమ్మేశాయి.. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. సంక్రాంతి బరిలో విజేతగా నిలిచే పందెం కోడి ఎవరన్నది చూడాలి.
– హేమసుందర్ పామర్తి