తెలుగు నేలలో ఒకప్పుడు విభజన వాదం మారు మోగితే.. ఇప్పుడు సమైక్య నాదం నాట్యం చేస్తోంది. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను తెలంగాణ రాష్ట్ర సమితి సాకారం చేయగా.. ఇప్పుడు అదే పార్టీనే సమైక్య నాదానికి బీజం వేసింది. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు నేల.. ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తున్న సమైక్య నాదంతో మళ్లీ కలిసిపోతుందా? అన్న చర్చను పక్కనపెడితే.. అసలు ఆ దిశగా సాధ్యాసాధ్యాలను పక్కనపెడితే.. ఈ దిశగా సాగుతున్న చర్చ మాత్రం అంతకంతకూ ఆసక్తి రేకెత్తిస్తోంది. టీఆర్ఎస్ పాలనను ఆంధ్రులు కూడా కోరుతున్నారని, ఏపీలోనూ టీఆర్ఎస్‌ను పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారని కేసీఆర్ ఏ ముహూర్తాన అన్నారో గానీ.. సమైక్య నాదంపై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది.
కేసీఆర్ వ్యాఖ్యలు.. నాని చెణుకులు
తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పాలనను చూసి పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా తమ పాలనను ఆహ్వానిస్తున్నారని, తమ రాష్ట్రాల్లోనూ టీఆర్ఎస్‌ను విస్తరించాలని వినతులు వస్తున్నాయని, ఏపీలోని ఉత్తరాంధ్ర నుంచి ఇలా వేలాది వినతులు వస్తున్నాయని మొన్నటి టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇటీవలి ఏపీ కేబినెట్ భేటీ వివరాలను వెల్లడించేందుకు మీడియా ముందుకు వచ్చిన ఏపీ మంత్రి పేర్ని నాని.. ఏపీలోనూ తెలంగాణ పార్టీని పెట్టుకోవచ్చని, అందుకు అభ్యంతరమే లేదని, అదే సమయంలో రెండు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని.. తమ పార్టీ అధినేత జగన్ అభిమతం కూడా అదేనని వరుసబెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. జనాన్ని మభ్యపెట్టేందుకు ఈ తరహా చర్చకు టీఆర్ఎస్, వైసీపీలు తెర తీశాయని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా తనదైన శైలిలో సమైక్య నాదాన్ని వినిపిస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాది సమైక్య నాదమే
శనివారం నాడు ఓ వైపు హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో జగ్గారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘‘రాష్ట్రం సమైక్యంగా ఉండాలని గతంలో నేను అంటే అందరూ తప్పుపట్టారు. ఇప్పుడు అందరూ అదే విషయం గురించి మాట్లాడుతున్నారు. ఎన్నికల కోసం టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీలు ఆడుతున్న డ్రామా ఇది. ఏపీ, తెలంగాణ కలవకూడదనేది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం. తెలంగాణ ఉద్యమ సమయంలో నేను సమైక్య వాదాన్ని వినిపించా. అప్పుడు నన్ను తెలంగాణ ద్రోహి అన్నారు. అయినా నేను ఎమ్మెల్యేగా గెలిచా. సమైక్యం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. పార్టీతో దానికి సంబంధం లేదు. ఏపీ, తెలంగాణ నాయకులు ఇప్పుడు సమైక్యాన్ని తెరపైకి తెచ్చారు. నేను ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు. ప్రజల ఆలోచన మేరకే ముందుకు వెళ్తా. ప్రత్యేక రాష్ట్రం వస్తే జీవితం బాగుంటుందని అందరూ కొట్లాడారు. అయితే సొంత రాష్ట్రం వచ్చినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. గతంలో నేను చెప్పిన విధంగానే ఇప్పుడు ఒక్కొక్కరు సమైక్యం గురించి మాట్లాడుతున్నా. తెలంగాణలో కోటి మందికి పైగా ఆంధ్ర, రాయలసీమ ప్రజలు ఉన్నారు’’ అని జగ్గారెడ్డి గుక్క తిప్పుకోకుండా మాట్లాడేశారు. మరి ఈ వ్యాఖ్యలపై ఎలాంటి చర్చ జరుగుతుందో చూడాలి.