వారం రోజుల వ్యవధిలో రెండు పాన్ ఇండియా సినిమాలు జనం ముందుకు రాబోతున్నాయి. అలాంటప్పుడు ప్రచారం శైలి ఏ స్థాయిలో ఉండాలి? అందుకే వినూత్న ప్రచార శైలితో ఆ రెండు సినిమాలు జనం ముందుకు రాబోతున్నాయి. ఈ వినూత్న ప్రచారానికి ఒకవిధంగా నెటిజన్లే శ్రీకారం చుట్టారనుకోవచ్చు. ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏమిటా అనే సందేహం ఉందా? వాటిలో ఒకటి రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్, ఇంకోటి బాహుబలి ప్రభాస్ హీరోగా రూపొందిన ‘రాధేశ్యామ్’.
ట్రిపుల్ ఆర్ టీమ్ పీవీఆర్ సినిమాతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న పీవీఆర్ తెరల వద్ద పీవీఆర్ అనే పేరుకు బదులు పీవీఆర్ఆర్ఆర్ అనేలా పేర్లు మార్చివేయబోతున్నారు. దీన్ని ట్విట్టర్ లోని ఓ వర్గం ప్రభాస్ రాధేశ్యామ్ ను ఎగతాళి చేయడం ప్రారంభించింది. అలాంటి ట్రోల్స్ నెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువయ్యాయి. రాధేశ్యామ్ చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ కొత్త ప్రచార వ్యూహాన్ని ప్రారంభించిందని పేర్కొంది. అదేంటంటే రెండు తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలతో కలిసి పనిచేయడమేనట.
అదెలా అంటే రాధేశ్యామ్ పేరును టీఆర్ఎస్ గా మార్చి వేశారు. సాధారణంగా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమతి అనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ తెలంగాణ రాధేశ్యామ్ అన్నా టీఆర్ఎస్సే కదా. రాధేశ్యామ్ అనే పేరులో ఆర్, ఎస్ అనే అక్షరాలతో ఈ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పేరును వైఆర్ఎస్సీపీగా మార్చి వేశారు. సోషల్ మీడియా యూజర్లు కూడా ఇలా ప్రచారానికి సహకరించడం విశేషమే. జనవరి 7న ట్రిపుల్ ఆర్ విడుదల కానుండగా, రాధేశ్యామ్ మాత్రం జనవరి 14న విడుదలవుతోంది. ప్రచార సరళిలో రాజమౌళి పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళుతున్నారు.
రాధేశ్యామ్ యూనిట్ మాత్రం ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించడం లేదు. ప్రచారం ఎక్కువైనా ప్రమాదమే అన్న భావన యూవీ క్రియేషన్స్ కు ఉన్నట్టుంది. ట్రోల్స్ ప్రచారాన్ని మాత్రం ఆహ్వానిస్తోంది. ఈ రెండు సినిమాల మధ్య జరిగే బాక్సాఫీసు గొడవ మీద రాజమౌళి ముందుగానే స్పందించారు. ఈ రెండు పెద్ద సినిమాల మధ్య డైరెక్ట్ క్లాష్ ఉండదని స్పష్టం చేశారు. కంటెంట్ లో దమ్ముంటే అన్నిటినీ ప్రేక్షకులు ఆదరిస్తారని పేర్కొన్నారు. మరి ఈ ప్రచార పర్వం మున్ముందు ఎలాంటి కొత్త పుంతలు తొక్కుతుందో చూడాలి.











