అందరికీ దీపావళి నవంబరు 4వ తేదీ వస్తుందేమోగానీ షారుక్ ఇంట్లో మాత్రం ఈరోజే వచ్చింది. పుత్రుడు జైలులో ఉండటంతో షారుక్ కు కంటి మీద కునుకులేకుండా పోయింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా రాని బెయిల్ ఎట్టకేలకు వచ్చింది. పుత్రుడు ఇంటికి రాగానే టాపాసుల మోత మోగాయి. షారుక్ అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహం వచ్చింది. ఆనందంతో పండగ చేసుకున్నారు. షారుఖ్ ఖాన్ తన కుమారుడు ఆర్యన్ ఖాన్ తో కలిసి ఇంటికి చేరుకోగానే మన్నత్ బంగ్లాలో ఆనందం తాండవించింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ బస్ట్ కేసులో మూడు వారాల పాటు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉన్న ఆర్యన్ ఈ బెయిల్ తో ఊపిరి పీల్చుకున్నాడు.
సహ నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాలకు కూడా బెయిల్ లభించింది. మన్నత్ వెలుపల ‘స్టే స్ట్రాంగ్ ఆర్యన్ ఖాన్’ బ్యానర్ కూడా కనిపించింది. ఆర్యన్ తన ఇంట్లోకి ప్రవేశించే సన్నివేశం పెద్ద పండగలాగానే ఉంది. బాలీవుడ్ బాద్షా అభిమానులు, శ్రేయోభిలాషులకు ఇది నిజంగా దీపావళి పండగలాంటిదే. తన కుమారుడిని కారులో ఎక్కించుకుని షారుక్ ఇంటికి చేరుకున్నారు. వారిని ఫొటోలు, వీడియోలు తీయడానికి అక్కడికి చేరుకున్న మీడియా సిబ్బిందితో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.
జుహీ చావ్లా ఇచ్చిన హామీతోనే..
షారుఖ్ ఖాన్ కూ బాలీవుడ్ హీరోయిన్ జుహీ చావ్లాకూ ఉన్న స్నేహం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆర్యన్ ఖాన్ కు బెయిల్ రావాలంటే ఎవరో ఒకరు పూచీకత్తు ఇవ్వాల్సిందే. అందుకు పూచీకత్తును జుహీ చావ్లా ఇవ్వడం విశేషం. వీరిద్దరూ కలిసి జంటగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇద్దరూ వ్యాపార భాగస్వాములు కూడా. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీని కలిసే చేస్తున్నారు. సినిమాలు తీశారు. లక్ష రూపాయల పూచీకత్తు పత్రాలపై జుహీ సంతకాలు చేసింది. దీని కోసం ఆమె ముంబై సెషన్స్ కోర్టుకు కూడా వెళ్లింది. మొత్తానికి షారుఖ్ ఇబ్బందుల్లో స్నేహ హస్తాన్ని అందించింది.











