మంగళగిరిలో పవన్ నిరాహార దీక్ష …!
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేనాని పవన్ ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి తన పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 31న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి చేస్తున్న దీక్షకు మద్దతునిచ్చారు. కూర్మన్నపాలెం గేటు వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి.. దీక్ష చేస్తున్న కార్మికులకు పవన్ సంఘీభావం తెలిపిన విషయం విధితమే. నాటి నుంచి నేటి వరకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కు అందరూ కలిసి రావాలని జనసేన అధినేత పిలుపునిస్తునే ఉన్నారు. అసెంబ్లీలో తీర్మానాలు, ఎంపీలతో ఢిల్లీలో వినయంగా విన్నవించడం వంటివి పనికావని, ప్రభుత్వం ప్రత్యక్ష ఆందోళనకు దిగి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నదే పవన్ స్టాండ్. జగన్ రెడ్డి ప్రభుత్వం కలిసి వస్తే, పోరాటానికి తాము సిద్ధమేనని గతంలో పవన్ అనేక వేదికలపై ఇప్పటికే ప్రకటించారు. కానీ ఏపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయం స్పష్టమైన వైఖరిని నేటికి తెలపకపోడం వంటివి చూసే.. ప్రభుత్వంలో చలనం రప్పించేందుకే మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించకున్నారు.
గుంటూరు నుంచే ఉద్యమం షురూ .. అదే సెంటిమెంట్!
గతంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం గుంటూరుకు చెందిన అమృతరావు నిరాహార దీక్ష చేశారు. దీనినే సెంటిమెంట్ గా పెట్టుకుని పవన్ గుంటూరు జిల్లా నుంచే తన పోరాటం మొదలు పెట్టబోతున్నారు. నిరాహార దీక్ష అనంతరం పవన్ భవిష్యత్తు కార్యాచరణను కూడా దీక్ష వేదిక నుంచే ప్రకటించనున్నారు. ప్రైవేటీకరణ అంశాన్ని విరమించుకునే వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే తప్పా .. కేంద్రం దిగివచ్చేలా కనిపించడంలేదు అన్నది పార్టీ అభిప్రాయం. రాష్ట్ర ప్రయోజనాల కన్నా స్వప్రయోజనాలకే అధిక ప్రాధన్యతనిచ్చే జగన్ ప్రభుత్వం .. ఇప్పటికైనా కళ్లు తెరచి ‘విశాఖ ఉక్కు .. మన అందరి హక్కు’ అని నినదించాలని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు గాదె వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.











